కొత్త సచివాలయంలో.. అంతర్జాతీయ ప్రతినిధులకు ప్రత్యేక మందిరాలు (మూడో భాగం )
personBuruju Editor date_range2023-01-23
రాత్రి వేళ.. బిర్లా ఆలయం వద్ద నుంచి చూసినప్పుడు నూతన సచివాలయం ఇలా కనువిందు చేస్తుంది
బురుజు.కాం Buruju.com : ( తెలంగాణ నూతన సచివాలయ భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్.. తన జన్మదినమైన ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభించనున్నారు. కొత్త భవనాల్లో మునుపటి మాదిరిగా తిరిగే స్వేచ్ఛ తమకు ఉంటుందా? లేక ప్రభుత్వం ఆంక్షలేమైనా పెడుతుందా? అనే సందేహాలు విలేకర్లను వెంటాడుతున్నాయి. పాత, కొత్త సచివాలయాలపై ‘బురుజు’ అందిస్తున్న కథనాల్లో ఇది మూడోవది) తెలంగాణ నూతన సచివాలయ భవనాల్లో Telangana new secretariat పలు సదుపాయాలు ఉండబోతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు వచ్చినప్పుడు.. వారితో భేటీలను నిర్వహించే మందిరాలు ప్రత్యేకంగా ఉంటాయి. విశాలమైన ప్రాంగణం అందుబాటులోకి వచ్చినందున ఇక వాహనాలను నిలపుకోవటానికి మునుపటి మాదిరిగా.. ఇబ్బందులంటూ తలెత్తవని సమాచారం. క్యాంటిన్ల సమస్యా పరిష్కారం కానుంది. ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఎటువంటి ఏర్పాట్లను చేస్తున్నదీ మాత్రం ఇంతవరకు వెల్లడికాలేదు. ఆ విషయంపై స్పష్టత కనుక వస్తే.. ఇక మునుపటి మాదిరిగా స్వేచ్ఛగా వార్తలను సేకరించుకోవచ్చనే భరోసా విలేకర్లకు కలుగుతుంది.
పగలు హుస్సేన్ సాగర్ వద్ద నుంచి చూసినప్పుడు సచివాలయం ఇలా కనిపిస్తుంది
హైదరాబాదుకు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు వచ్చినప్పుడు కనీసం వారిని కూర్చోపెట్టటానికి , వారితో సమావేశాలను నిర్వహించటానికి సచివాలయంలో సరైన మందిరాలు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్.. పలు సార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నూతన సచివాలయంలో మందిరాల సమస్య ఉండబోవటంలేదు.. పాత సచివాలయంలో.. ముఖ్యమంత్రి కార్యాలయం గల ‘సి’ బ్లాకులోని ఇరుకు మందిరంలోనే ఉమ్మడి రాష్ట్ర సీఎంలు.. అధికారులతో సమావేశాలను నిర్వహించేవారు. పాలన పగ్గాలను చేపట్టిన కొత్తలో కేసీఆర్.. సచివాలయానికి వచ్చినన్ని రోజులూ ఇదే మందిరాన్ని ఉపయోగించారు.
పాత సచివాలయంలో.. ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే సమతా భవనంలోని సమావేశ మందిరం ఇలా ఇరుకుగా ఉండేది. కేసీఆర్.. సీఎం అయిన కొత్తలో.. రంజాన్ ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశం ఇది
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన ‘డి’ బ్లాకు భవనాల్లోని సమావేశ మందిరం మాత్రం పెద్దగానే ఉండేది. విలేకర్ల సమావేశాలను మంత్రులు ఇక్కడే నిర్వహించేవారు. ఇది దిగువ అంతస్తులో.. సందర్శకులు వచ్చిపోయే దారిలోనిది కావటం వల్ల.. ఒక్కోసారి సందర్శకులు సైతం విలేకర్ల సమావేశాల్లోకి చొరపడేవారు. మూడో సమావేశ మందిరం.. గల భవనం తెలంగాణ అవతరణ తర్వాత ఏపీ పరిధిలోకి వెళ్లింది. ఇప్పుడు నూతన సచివాలయంలో.. వివిధ రకాల మందిరాలు ఉంటాయి కనుక ఇక సమావేశాలకు సమస్యలంటూ ఉండబోవు.
కొత్త సచివాలయ0లో.. అన్ని సదుపాయాలతో కూడిన క్యాంటిన్లు అందుబాటులోకి రానున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. పాత సచివాలయంలో క్యాంటిన్ల సమస్య ఎక్కువగా ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత.. పాత క్యాంటిన్.. ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన భవనాల మధ్య ఉండిపోవటంతో.. తెలంగాణ సచివాలయ క్యాంటిన్ ను.. నల్ల పోచమ్మ ఆలయం దగ్గరలో తాత్కాలిక షెడ్లలో నడుపుతూ వచ్చారు. సచివాలయ ఉద్యోగులు, సందర్శకులతో పాటు విలేకర్లకూ క్యాంటిన్ల అవసరం చాలానే ఉంటుంది. ఇక.. సందర్శకులతో పాటు విలేకర్లు తమ వాహనాలను నిలుపుకోవటానికి పాత సచివాలయంలో చాలా ఇబ్బంది పడేవారు. ‘డి’ బ్లాకు మూడు వైపుల, నల్ల పోచమ్మ ఆలయం వద్ద ద్విచక్ర వాహనాలను పెట్టుకొనేవారు. కార్ల పార్కింగు సమస్య తీవ్రంగా ఉండేది. కొత్త సచివాలయంలో పార్కింగు సమస్య ఇక ఉత్పన్నం కాబోదని అధికార వర్గాలు తెలిపాయి (నాలుగో భాగం వచ్చేవారం ‘బురుజు’లో..)