భక్త రామదాసు రాసినట్టుగా జన బాహుళ్యంలో ప్రచారంలో ఉన్న కీర్తనల ఆధారంగానే పరిశోధకులంతా కథనాలను అల్లారే తప్ప ఇతర ఆధారాల కోసం ఇంత వరకు పెద్దగా ప్రయత్నించలేదు
బురుజు.కాం Buruju.com : ( భద్రాచలం రాముడు స్పురణకు రాగానే భక్త రామదాసు గుర్తుకొస్తారు. భక్త రామదాసుకు సంబంధించి ప్రచారంలో ఉన్న కథనాల్లో చాలా వాటికి ఇప్పటికీ చారిత్రక ఆధారాలు లభించలేదు. భద్రాచలం ఆలయాన్ని యాదాద్రి మాదిరిగా తీర్చిదిద్దుతామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం.. భక్త రామదాసు చెందిన వాస్తవాల వెల్లడికీ నడుం కట్టాలి. భక్త రామదాసు ఏమయ్యందీ చారిత్రక కోణంలో పరిశీలించి బురుజు.కాం అందిస్తున్న కథనాల్లో ఇది మొదటిది) భక్త రామదాసు గోల్కొండ చెరశాల నుంచి విడుదలయ్యాక భద్రాచలంలో శేషజీవితాన్ని గడిపారనటానికి సాక్ష్యాలు కొరవడ్డాయి. మెఘల్ పాలకుల ఆగడాలతో ఆయన కుటుంబ సభ్యులతో సహా అదృశ్యమయ్యారనేది ఒక వాదన. ఆయన గోల్కొండ బంధీఖానాలోనే చనిపోయారని.. గోల్కొండ కోటను ఔరంగజేబు స్వాధీనం చేసుకొన్నప్పుడు మిగతా ఖైదీలతో పాటు భక్త రామదాసునూ విడిచిపెట్టారని.. వంటి సూత్రీకరణలు గ్రంధాల్లో కనిపిస్తున్నాయి. భక్త రామదాసు రాయించినట్టుగా చెప్పే శాసనం అప్పట్లోనే ధ్వంసమయ్యింది. ఆయన ఉనికికి చెందిన చారిత్రక ఆధారాలు లభించకపోవటం వల్లనే వివాదాస్పద అంశాలు తలెత్తుతున్నాయి.
రామదాసును బంధించినట్టుగా చెప్పే గోల్కొండ కోటలోని సామాగ్రిని భద్రపరిచే గది
భక్త రామదాసుకు Bhakta Ramadasu సంబంధించి జనబాహుళ్యంలో ఉన్న కథలే ప్రస్తుతానికి ప్రామాణికమై ఉన్నాయే తప్ప ఎటువంటి పత్రాలు, శాసనాలు ఇంతవరకు కనిపించనేలేదు. ప్రాచ్యలిఖిత పత్రాల బండాగారాల్లో నాటి రెవెన్యూ రికార్డులు లక్షల సంఖ్యలో గుట్టలుగా పడి ఉన్నందున వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే తప్పకుండా కొన్ని ఆధారాలు లభించొచ్చు. ప్రఖ్యాత చరిత్రకారులు సురవరం ప్రతాపరెడ్డి తన వ్యాసాల్లో ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తూ. . ఆనాడు తానీషాకు నిజంగా పైకం తిరిగి అందివుంటే ఆ విషయం రికార్డుల్లో తప్పకుండా లిఖించి ఉంటుందని పేర్కొన్నారు. అసలు అప్పట్లో ఖైదీల కోసం గోల్కొండ సమీపంలోని అశుర్ఖానా పక్కన చెరశాల ఉండేది. రామదాసును అక్కడ కాకుండా.. రాజప్రాసాదాల సమీపంలోని ధనాగారం భవనం కింద సామాగ్రిని భ్రద్రపర్చే గదిలో ప్రత్యేకంగా ఉంచినప్పుడు.. మళ్లీ చిత్ర హింసలు పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చినట్టు? వంటి సందేహాలూ నివృత్తి కావాల్సివుంది.
భక్త రామదాసు విగ్రహం
భక్త రామదాసుకు చెందిన చారిత్రక సత్యాల కోసం 1920లో ఎంతో ఉత్సాహంగా భద్రాచలం ఆలయానికి వెళ్లిన అప్పటి పురావస్తు శాఖ సహాయక సూపరింటెండెంట్ వెంకోబారావు.. అక్కడ అటువంటివేమీ లభించక తీవ్ర నిరాశ చెందారు. చరిత్రకారుడు జాదూనాథ్ సర్కార్.. 1919లో తాను పర్షియన్ పత్రాలను అధ్యయనం చేసి రాసినట్టుగా ప్రకటించిన ‘ఔరంగజేబు చరిత్ర’లో.. కంచెర్ల గోపన్నఇతివృత్తం వద్దకు వచ్చేసరికి మాత్రం జనం నోళ్లలో నానుతున్న కథనే చెప్పి మిన్నకున్నారు. రామదాసుకు చెందిన చారిత్రక అంశాలను తెలుసుకొనేందుకు ‘బురుజు’ ప్రతినిధి కొన్ని గ్రంధాలు, నివేదికలను పరిశీలించినప్పుడు.. చాలా వాటిలో సాక్ష్యాలు అంటూ లేని కథనాలే కనిపించాయి. భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ).. 1954లో ‘గోల్కొండ’ పేరుతో వెలువరించిన నివేదికలోను రామదాసు చారిత్రకతను నిరూపించలేదు .
భద్రాచలం ఆలయం
ఇంతవరకు వెలువడ్డ వాటిలో వెంకోబారావు నివేదిక మాత్రమే కొంత పరిశోధనతో కూడుకొనివుంది. ఆ తర్వాత కొన్ని గ్రంధాలకు ఆయన నివేదికే ప్రధాన వనరుగా ఉంటూ వచ్చింది. పురావస్తు శాఖ అధికారి వెంకోబారావు 1920 , జనవరి నుంచి ఏప్రిల్ వరకు వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ అప్పటికే జనం చెప్పుకొంటున్న భక్త రామదాసు కథకు ఆధారాల కోసం భద్రాచలం ఆలయానికి వెళ్లారు. అక్కడ 17వ శతాబ్ధానికి చెందిన భక్త రామదాసుది కాకుండా .. 19వ శతాబ్ధం వాడైన వరద రామదాసు వేయించిన శాసనం, అలాగే భక్త రామదాసు కాలానికి చెందిన ముగ్గురు మహిళలు.. ఆలయ మండపాలు, ప్రహారీలు నిర్మించారనే విషయాన్ని తెలిపే శాసనాన్ని మాత్రం కనుకొనగలిగారు. వీటి వివరాలను నాటి మద్రాస్ ప్రభుత్వం 1920, ఆగస్టు నెలలో ‘వార్షిక శిలా శాసన పత్రం’ పేరుతో వెలువరించిన నివేదికలో పొందుపర్చింది. భద్రాచల రాముడిపై విపరీత భక్తిభావం ఏర్పడి కుటుంబ సమేతంగా అతని సన్నిదిలో గడపటం కోసం కంచి నుంచి 19వ శతాబ్ధంలో (బహుశా 1832) తరలివచ్చినవాడే వరద రామదాసు. ఆయన వచ్చేసరికి భక్త రామదాసు కాలంనాటిదిగా భావించే ఒక శాసనం భద్రాచలం Bhadrachalam ఆలయంలో ఉన్నప్పటికీ దానిపై గల అక్షరాలు ధ్వంసమై ఉన్నాయి. ( వెంకోబారావు నివేదికలోని ముఖ్యాంశాలు వచ్చేవారం ‘బురుజు’లో)