యశోద సినిమాలో సరోగసి కోసం వచ్చిన యువతుల మధ్య యశోద పాత్రధారిణి సమంత
బురుజు.కాం Buruju.com : కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తెచ్చిన సరోగసి surrogacy చట్టం ప్రకారం.. కేవలం పెళ్లయ్యి.. అదీ పిల్లలు గల మహిళ మాత్రమే వేరే దంపతుల కోసం గర్భాన్ని ధరించేందుకు వీలవుతుంది. అంతేతప్ప.. ‘యశోద’ సినిమాలో చూపించినట్టుగా పెళ్లికాని యువతులు.. అదీ సొమ్ముకోసం.. ముక్కూమొహం తెలియని వ్యక్తుల కోసం గర్భాన్ని మోసి బిడ్డను కని ఇస్తానంటే సాధ్యంకాదు. యశోద సినిమా కథ అంతా మెడికల్ మాఫియా నేపథ్యంతో ఉంటుంది కనుక చట్టాల ప్రసక్తే అక్కడ ఉండదని సరిపెట్టుకొన్నప్పటికీ.. సరోగసి గురించి తెలుసుకోదలచినవారు మాత్రం 2022, జనవరి నెల నుంచి అమల్లోకి వచ్చిన చట్టాన్ని తప్పక అధ్యయనం చేయాలి. వేరే దంపతుల కోసం కేవలం ఉదారతతోనే తప్ప డబ్బుకోసం గర్భాన్ని ధరించటాన్ని నూతన చట్టం నిషేధిస్తుంది కనుక ఇక సరోగసి అంటే అద్దె గర్భం అని కాకుండా నిస్వార్ధ గర్భంగా మనం వ్యవహరించాల్సివుంటుంది.
సరోగసి విధానాన్ని వివరించే చిత్రం
వైద్యంలో వస్తున్న నూతన పోకడలు ఎన్ని వెర్రితలలు వేస్తున్నదీ తెలియజేసే చిత్రమే యశోద Yashoda . ప్రస్తుతం ఇది ఓటీటీ వేదికైన ‘అమెజాన్ ప్రైమ్’ లో అందుబాటులో ఉంది. సస్పెన్స్ తో సినిమా ఆద్యంతం ప్రేక్షకుడికి ఉత్కంఠ కలిగిస్తుంది. సోదరి వైద్యానికి అవసరమయ్యే సొమ్ముకోసం సరోగసికి సిద్ధమవుతుంది యశోద పాత్రలో నటించిన సమంత. తీరా ఆసుపత్రికి వెళ్లాక అక్కడ ఏవేవో జరుగుతున్నట్టుగా గ్రహించి.. వాటి గురించి పరిశోధిస్తుంది. సరోగసి ద్వారా పుట్టే పిల్లల లేలేత శరీర భాగాలను మహిళల అందాలకు ఉపయోగిస్తున్నట్టుగా తెలుసుకొని విస్తుబోతుంది. ఇటువంటి అందాల ఆపరేషన్ కోసం వచ్చిన ఒక హాలివుడ్ నటి, మరో యువతి హత్యకు గురవ్వటంపై పోలీసు అధికారులు చేసే పరిశోధన మరో వైపు కొనసాగుతూ ప్రేక్షకుడు కథలో లీనమయ్యేలా చేస్తుంది. చివరికి.. సరోగసి మాఫీయా దురాగతాలను బయటపెట్టేందుకు పోలీసులు పంపిన యువతే యశోద అని బహిర్గతమవుతుంది.
సరోగసి పద్దతిలో పిల్లల్ని పొందిన సినీనటులు
బాలివుడ్ నటులైన అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, కరణ్ జోహార్, ప్రియాంక చోప్రా, ఇంకా మంచు లక్ష్మి వంటి వారు సరోగసి ద్వారానే పిల్లలను కన్నారు. వివాహమైన కేవలం నాలుగు నెలలకే నయనతార దంపతులు కవల పిల్లలకు తల్లితండ్రులు కావటంతో పెళ్లికి ముందే సరోగసి ఏర్పాట్లు చేసుకొన్నట్టు ప్రస్తుతం సామాజిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ నయనతారకు Nayanatara నోటీసును సైతం అందజేసింది. ఎందువల్ల నంటే.. సరోగసి నూతన చట్టం ప్రకారం.. పెళ్లి కానివారు సరోగసి ద్వారా పిల్లల్ని పొందటానికి వీలులేదు. ఇక యశోద సినిమాలో సరగోసి కోసం వచ్చినవారంతా ఒక్కొక్కరు ఒక్కో ఆర్థిక పరమైన ఇబ్బందులను వెల్లబోసుకొంటుంటారు. కొత్త చట్టం మాత్రం అందుకు అంగీకరించదు. సరోగోసికి సిద్ధమయ్యే మహిళ కేవలం ఉదారతతో మాత్రమే గర్భాన్ని ధరించేందుకు అంగీకరించాలి. పైగా వారు పిల్లల్ని కోరుకొనే దంపతుల కుటుంబానికి దగ్గరవారై ఉండాలి. గర్భాన్ని ధరించే మహిళకు వివాహమయ్యి పిల్లల్ని కలిగి, 25-35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఆమెకు వైద్య ఖర్చులను బీమాను మాత్రం సమకూర్చాలి. చట్టాన్ని surrogacy act ఉల్లంఘించిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు.
దంపతులకు పిల్లలు పుట్టే అవకాశం లేనప్పుడు మాత్రమే సరోగసీని ఎంచుకొంటారని మనం అనుకొంటాము. పిల్లల్ని కంటే లావైపోయి సినిమా అవకాశాలు ఎక్కడ కొల్పోతామోననే భయంతో కొందరు నటీమణులు సరోగసిని అనుసరిస్తున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. యశోద సినిమా కారణంగా ఇప్పుడు ఇటువంటి విధానం గురించి మరింత మందికి తెలిసింది. మనదేశంలో దీనికి వైద్యులు రూ.16 లక్షల వరకు వసూలు చేస్తుంటారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఏడాదికి 3వేల మంది పిల్లలు ఇలా పుడుతున్నట్టు సమాచారం. జర్మని, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో సరోగసి నిషేధం.