25 అడుగుల ఎత్తు గల కొండను 30 అడుగుల వెడల్పులో తొలచి మాంజీ ఏర్పాటు చేసిన రహదారి.. ఇప్పుడు గ్రామమే అక్కడికి విస్తరించేలా చేసింది
బురుజు.కాం Buruju.com కేవలం ఒక సుత్తి, గునపం సాయంతో కొండను తొలచి గ్రామానికి రహదారిని ఏర్పాటు చేసిన దశరథ్ మాంజీ.. జీవిత లక్ష్యం అంటే ఏమిటో తరతరాలకూ తెలియజెప్పబోతున్నాడు. మాంజీ.. కొండను తొలచిన చోట బీహార్ ప్రభుత్వం ఇటీవల ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి.. అక్కడ ఆయన విగ్రహాన్ని నెలకొల్పగా అదిప్పుడు ఆ రాష్ట్రంలో ఒక పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. ఎందుకంటే.. తాజ్ మహాల్ ఎటువంటి ప్రేమ చిహ్నమో అంతకు మించిన ప్రేమ మాంజీ రహదారి వెనుక ఉంది. రహదారులు, స్వాగత ద్వారాలకే కాదు.. పథకాలకూ ఇప్పుడు మాంజీ పేరును పెడుతున్నారు. వృత్తి నైపుణ్యాలను పెంపొందించే పథకాన్ని ‘దశరథ్ మాంజీ కౌశల్ యోజన’ పేరుతో బీహారు ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇక ఆయన ప్రేరణతో వివిధ రకాల కార్యక్రమాలకు కొంత మంది నడుం కడుతూనే ఉన్నారు. బీహారులోని గయకు చెందిన సత్యేంద్ర గౌతమ్ అనే ఆయన.. చెట్లంటూ బతకని చోట ఏకంగా పదివేల చెట్లను పెంచి శెభాష్ అనిపించుకొంటున్నారు. మాంజీయే తనకు ప్రేరణ అని ఆయన ప్రకటించారు. ఇంతటి ఘనతకు కారకుడైన మాంజీ మాత్రం ఒక నిరుపేద. అతని జీవిత గాథ ఆధారంగా హిందీలో మాంజీ అనే సినిమా రూపొందింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమాను చూస్తున్నప్పుడు ఒక్కో సారి ప్రేక్షకులకు కళ్లు చెమ్మగిల్లుతాయి. అతని సంకల్ప బలం ముందు అంతెత్తు పర్వతం సాగిలపడ్డ తీరును చూశాక.. మాంజీలా చరిత్రలో నిలిచిపోవాలనే తపన ప్రేక్షకుడికి కలుగుతుంది. సినిమా విడుదలయ్యి ఆరేళ్లు దాటినప్పటికీ.. దాని ఇతివృత్తం మాత్రం ఎప్పటికీ గుండెల్ని తాకుతూనే ఉంటుది కనుక ఎప్పుడైనా సరే దీన్ని చూడొచ్చు.
మాంజీ.. కొండను తొలచిన చోట బీహార్ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన స్మారక వనం . ఇదిప్పుడు ఒక పర్యాటక ప్రాంతంగా మారింది
బీహారులోని గెహ్లార్ గ్రామం అన్ని విధాల వెనుకబడి ఉంటుంది. అక్కడి వెనుకబడిన కులాల వారు అత్యంత పేదరికంతో కొట్టుమిట్టాడుతుంటారు. అయినా వారిపై గ్రామ పెద్దల ఆగడాలు కొనసాగుతుంటాయి. అప్పు తీసుకొని అధిక వడ్డిలను చెల్లించనివారిని చితక బాదటం, మహిళల్ని ఎత్తుకెళ్లి చెరువుల్లో శవాలుగా మార్చటం.. తక్కువ కులాల వారు ఎదురుగా కనబడితే చాలు.. వారు మహానేరం చేసినట్టుగా పరిగణించి శిక్షలు వేయటం వంటి ఘోరాలెన్నో చోటుచేసుకొంటుంటాయి. అటువంటి నేపథ్యంలో.. 1934లో ఆ గ్రామంలో జన్మించిన దశరథ్ మాంజీ.. ఆ తర్వాత అక్కడ దొరల వద్ద బానిసగా బతకటం ఇష్టం లేక ఏడేళ్ల పాటు ధన్ బార్ బొగ్గు గనుల్లో పనిచేసి తిరిగి గ్రామానికి వస్తాడు. గ్రామానికి వచ్చీరావటంతోనే గ్రామ దొరల ఆగడాలకు లోనవుతాడు. గ్రామంలో ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు.
తాను తొలచిన కొండ వద్ద దశరథ్ మాంజీ
ఊరికి అడ్డుగా పర్వత పంక్తులు ఉంటాయి. గ్రామస్తులు.. దగ్గరలోని వజీరుగంజ్ వెళ్లాలంటే కొండను ఎక్కిదిగాలి. లేదా దాని చుట్టూ తిరిగి వెళ్లాలి. ఒక రోజు పొలం పనుల్లో ఉన్న మాంజీకి భోజనం తెస్తూ అతని భార్య ఫగునియా.. కొండపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడుతుంది. గర్భవతిగా ఉన్న ఆమెను అతి కష్టం మీద మరొకరి సాయంతో కొండ మీదగా వజీరుగంజ్ ఆసుపత్రికి మోసుకెళ్తాడు. తీవ్ర రక్తస్రావమయ్యి అడపిల్లకు జన్మనచ్చి ఆమె మరణిస్తుంది. అమితంగా ప్రేమించిన భార్య అర్ధాంతరంగా తనవు చాలించటంతో మాంజీ తీవ్రంగా కలత చెందుతాడు. కొండను తొలచి గ్రామానికి రహదారిని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొంటాడు. కేవలం ఒక సుత్తి, గునపంతో 1960లో పనిని మొదలు పెట్టినప్పుడు అంతా అతన్ని పిచ్చివాడు అంటూ అవహేళన చేస్తారు. దాదాపు 22 ఏళ్ల పాటు కేవలం సుత్తి, గునపంతో అదే పనిని చేస్తుంటాడు. అతను 25 అడగుల ఎత్తులో గల కొండను 30 అడుగుల మేర దొలుస్తాడు. దాని పొడవునా 360 అడుగుల మేర దారిని ఏర్పాటు చేస్తాడు.
మాంజీ సినిమాలో మాంజీగా నటించిన నవాజుద్ధీన్ సిద్ధిఖీ
కొండను దొలుస్తూ వెళ్తుండటాన్ని స్థానిక విలేకరి ఒకరు తెలుసుకొని అతని గురించి తన పత్రికలో రాస్తాడు. మాంజీకి కొంత గుర్తింపు రావటంతో ఇదే అదనుగా గ్రామ పెద్ద, అవినీతి బీడీవో కలసి రోడ్డు నిర్మాణం పేరుతో మాంజీతో వేలిముద్ర వేయించుకొని సొమ్మును తినేస్తారు. చివరికి అతని సేవలను ప్రజలు, పాలకులు గుర్తిస్తారు. మాంజీ 2007లో క్యాన్సరుతో చనిపోయాడు. అతను చనిపోయిన నాలుగేళ్లకు .. 2011లో ప్రభుత్వం అక్కడ కంకర రోడ్డును ఏర్పాటు చేసింది. ముంతాజుపై గల అపార ప్రేమాభిమానాలకు చిహ్నంగా ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా భాసిల్లుతున్న తాజ్ మహల్ ను షాజహాను కట్టించాడు. దాని నిర్మాణ సమయంలో ఎన్నో వేల మంది కార్మికులు పనిచేసి ఉంటారు. అందువల్లనే.. తాజుమహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరు? అంటూ మహాకవి శ్రీశ్రీ ప్రశ్నించారు. దశరథ్ మాంజీ మాత్రం.. తన భార్యపైగల అపార ప్రేమతో ఏకంగా ఒక పర్వతాన్నే రోడ్డుగా మరల్చి షాజహాన్ అంతటి కీర్తిని ఒంటి చేత్తోనే సంపాదించాడు. ముందడుగు వేస్తే సాధించలేనిది ఏదీలేదని తన కఠోర సంకల్పంతో లోకానికి చాటి చెప్పాడు.