విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయులు, ఆయన రాణులు చిన్నాదేవి, తిరుమలదేవి
బురుజు.కాం Buruju.com : తిరుమల ఆలయం అభివృద్ధికి కృషి చేసిన నాటి రాజులను, రాణులను చూడాలని ఉందా? ఆలయంలో శ్రీకృష్ణ దేవరాయలు, ఆయన ఇద్దరు పట్టపు రాణుల నిలువెత్తు రాగి శిల్పాలు ఉండటం చాలా మందికి తెలిసిందే. వీరితో పాటు.. మరికొందరు రాజులు, వారి కుటుంబ సభ్యుల శిల్పాలు అక్కడ కొలువుతీరి ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఇప్పుడు ఎల్ఈడీ కాంతుల్లో సందర్శకులు వీక్షించవచ్చు.
తిరుమల ఆలయంలోని మండప స్థంభాలపై గల నాటి శిల్పాలు
దాదాపు రెండేళ్ల క్రితం.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రతిమను యాదాద్రి Yadaadri (యాదగిరి గుట్ట) ఆలయంలోని ఒక చోట శిల్పులు చెక్కి.. తీవ్ర విమర్శలు రావటంతో ఆ తర్వాత దాన్ని తొలగించారు. ఆలయ అభివృద్ధికి నడుం కట్టిన వారి శిల్పాలను తీర్చిదిద్దటం రాజుల కాలం నుంచీ ఉన్నదేనని తెలుగు రాష్ట్రాల్లోని వివిద ఆలయాల్లో గల ప్రతిమలను బట్టి స్పష్టమవుతోంది. కొన్ని ఆలయాల్లో.. వందల ఏళ్ల క్రితం చెక్కిన కొందరు రాజులు, రాణుల శిల్పాలపై Buruju.com కథనాలను అందివ్వనుంది. శిల్పాల్లో కనిపించే ఆనాటి ఆహార్యం.. చూపరులకు తప్పక ఆసక్తిని కలిగిస్తుంది.
విజయనగర రాజు అచ్యుత రాయులు, ఆయన భార్య వరదాంబిక
తిరుమల Thirumala ఆలయానికి ఆనాడు ఎందరో రాజులు విరివిగా కానుకలను సమర్పించేవారు. వారిలో కొందరి ప్రతిమలను అప్పట్లోనే ఏర్పాటు చేశారు. విజయనగర సామ్రాజ్య సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయలు ఏడు సార్లు స్వామివారిని దర్శించినట్టు చారిత్రిక ఆధారాలు ఉన్నాయి. ఆలయంలో మహాద్వారానికి అనుకొని ఉన్న కృష్ణరాయ మండపంలో.. శ్రీకృష్ణ దేవరాయలు, ఆయన రాణులైన తిరుమలదేవి, చిన్నాదేవిల నిలువెత్తు రాగి ప్రతిమలు ఉన్నాయి. వీటికి ఎడమవైపు కనిపించేవి.. చంద్రగిరి రాజైన వెంకటపతి రాయల రాణి ప్రతిమ. ఆ పక్కన నమస్కార బంగిమలో ఉన్న నిలువెత్తు శిల్పాలు.. విజయనగర ప్రభువైన అచ్యుతరాయులు, ఆయన రాణి వరదాంబిక రూపాలు. తిరుమలరాయ మండపంలో రాజా తొడరమల్లు, అతని తల్లి మోహనా దేవి, భార్య పిటా బీబీ లోహ విగ్రహాలు ఉన్నాయి. కృష్ణ రాయ మండపంలోని 16 స్థంభాలపై సింహంపై కూర్చుని స్వారీ చేస్తున్న వీరులు కూడా నాటి రాజవంశీకులే. వీరెవరనేది తెలియాల్సివుంది.
తిరుమల మండపాల్లో ఎల్ఈడీ లైట్ల కాంతిలో కనిపిస్తున్న శిల్పాలు
కొందరు రాజులకు ప్రతిమలు లేనప్పటికీ.. రంగరాయ మండపం, ఐనా మహల్ (అద్దాల మండపం) వంటివాటికి ఇప్పటికీ వాటిని కట్టించిన రాజుల పేర్లే కొనసాగుతున్నాయి. వివిద స్ధంభాలపై గల శిల్పాలు స్పష్టంగా కనిపించేలా ఎల్ఈడీ లైట్లను దశల వారీగా ఏర్పాటు చేయాలని దేవస్థానం ఇప్పటికే నిర్ణయించి.. కొన్ని చోట్ల అటువంటి ఏర్పాట్లను పూర్తిచేసింది. వాటి కాంతిలో ఆ నాటి, రాజులు, రాణుల రూపాలను ఇప్పుడు మనం స్పష్టంగా చూడొచ్చు ( వరంగల్ స్వయంభూ ఆలయ శిధిలాల్లో రాణి రుద్రమ దేవి శిల్పం-వచ్చేవారం Buruju.com లో..)