చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. కొమ్మినేనికి ఎంతో ప్రాధాన్యమిచ్చేవారు
personBuruju Editor date_range2023-01-07
ఎంతో అభిమానించిన చంద్రబాబుపైనే గత కొంత కాలంగా కొమ్మినేని ఘాటు విమర్శలు చేస్తున్నారు
పిళ్లా సాయికుమార్ Buruju.com బురుజు.కాం : ఏ పార్టీలోకి మారితే ఆ పార్టీ విధానాలకు అనుగుణంగా వ్యవహరించటం రాజకీయ నాయకులకు సహజం. ఇప్పుడు సీనియర్ జర్నలిస్టులు సైతం రాజకీయ నాయకులు మాదిరిగా రంగులు మారుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి ఛైర్మన్ గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు Kommineni Srinivasa Rao .. నెల్లూరు జిల్లాలోని కందుకూరులో పర్యటించి రాజకీయ వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం అధినేత చంద్రబాబు.. ఇరుకు వీధుల్లో సభను నిర్వహించటం, డ్రోన్లతో జనాన్ని చిత్రీకరించటం కారణంగానే తొక్కిసలాట జరిగి పలువురు చనిపోయినట్టుగా ఆయన తేల్చారు. దీనిలో పోలీసుల తప్పిదం ఏమాత్రం లేదంటూ కితాబు ఇచ్చారు. చంద్రబాబు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. కొమ్మినేని శ్రీనివాస రావుకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. కొమ్మినేని అనుకొన్నదే తడవుగా చంద్రబాబు ఆయనతో ఫోనులోను, ముఖాముఖి మాట్లాడుతుండేవారు. అటువంటి కొమ్మినేని.. ఇప్పుడు రాజకీయ నాయకుడి మాదిరిగా విమర్శలు చేయటం డబ్బు, పదవుల మహిమే అనుకోవాలి.
ప్రస్తుతం కొమ్మినేని.. జర్నలిస్టుల అంశాలకు బదులు రాజకీయ అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు Chandrababu ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు.. హైదరాబాదులో ‘ఈనాడు’ Eenadu పత్రిక పొలిటికల్ బ్యూరో ఇన్ఛార్జిగా ఉండేవారు. అటువంటి సమయంలో.. 1997 - 2000 సంవత్సరాల మధ్య.. మూడేళ్ల పాటు నేను అదే పొలిటికల్ బ్యూరోలో పనిచేశాను. నేను, ప్రస్తుతం ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న భార్గవ.. తెలుగు దేశం పార్టీ వ్యవహారాలను రాస్తుండేవారిమి. విలేకర్లకు బాగా అందుబాటులో ఉండే ముఖ్యమంత్రిగా పేరుపడ్డ చంద్రబాబు.. కొమ్మినేనిని మరింతగా ఆదరించేవారు. ముఖ్యమంత్రే స్వయంగా ఫోను చేసి ఆయనతో మాట్లాడటం.. బ్యూరోలోని నా వంటి మిగతా రిపోర్టర్లకు చాలా ఆసక్తి కలిగించేది. చంద్రబాబు.. ఇతర ప్రాంతాల సందర్శనకు వెళ్లినప్పుడు.. బేగంపేట విమానాశ్రయంలో హెలికాప్టరు దిగి.. అక్కడి నుంచి జూబ్లిహిల్సులోని తన ఇంటికి కారులో వెళ్లేవారు. ఇలా కారులో ప్రయాణిస్తున్నప్పుడు కొమ్మినేనికి ఫోను చేసి రాజకీయ తదితర విషయాలను చెబుతుండేవారు. చంద్రబాబు చనువుగా ఉంటుండటంతో మిగతా మంత్రులు, ఐఏఎస్ అధికారులు కూడా అంతే అభిమానంగా వ్యవహరించేవారు. దీంతో ‘ఈనాడు’లో మంచి కథనాలు వస్తుండేవి. ఇటువంటి సంగతులు అన్నింటిని జోడించి కొమ్మినేని తన పేరుతో ‘ఈనాడు’ ఎడిటోరియల్ పేజీలో అనేక వ్యాసాలను సైతం రాసేవారు. వ్యాసాలను ప్రచురణకు పంపే ముందు వాటిని బ్యూరోలోని నాతో సహా సభ్యులు అందరికీ ఇచ్చి తప్పులు దిద్దించుకొనేవారు. వైఎస్ హయాంలో సమాచార కమిషనరుగా పనిచేసిన దిలీప్ రెడ్డి.. ఇదే బ్యూరోలో కాంగ్రెస్ వ్యవహారాల రిపోర్టరుగా ఉండేవారు.
ఒక విధంగా చంద్రబాబు గౌరవ మర్యాదలను ఇస్తూ రావటం వల్లనే కొమ్మినేనికి కూడా బాగా పరపతి పెరగగలిగిందని చెప్పాలి. ఆ తర్వాత ఆయన కొంత కాలం దిల్లీలో ‘ఈనాడు ప్రతినిధి’గా పనిచేశారు. అనంతరం ఆంధ్రజ్యోతిలోకి, అక్కడి నుంచి ఎన్టీవీ ఛానలులోకి ఆ తర్వాత సాక్షి ఛానల్ లోకి వెళ్లారు. సాక్షి ఛానల్ లో ఆయన నిర్వహించే ముఖాముఖీలన్నీ తెలుగు దేశం పార్టీని, చంద్రబాబును లక్ష్యంగా చేసుకొనే ఉండేవి. ఒకప్పుడు ఎంతో ఆదరించిన చంద్రబాబును ఇలా తూర్పారబడుతున్నారేమిటని మా బోటి జర్నలిస్టులు అనుకొనేవారిమి. ఇటువంటి నేపథ్యంలోనే ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి ఛైర్మన్ అయ్యారు. జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు సజావుగా అమలయ్యేలా చూడటం, విలేకర్లకు అవసరమయ్యే శిక్షణ తరగతులను నిర్వహించటం వంటి విధులను మాత్రమే ఇంతకు ముందటి ప్రెస్ అకాడమి ఛైర్మన్లు నిర్వర్తించేవారు. ప్రస్తుతం తెలంగాణ ప్రెస్ అకాడమి ఛైర్మన్ అల్లం నారాయణ.. అలాగే పనిచేస్తున్నారు.
కొమ్మినేని మాత్రం ఇంకా ఎటువంటి పదవులను ఆశిస్తున్నారో ఏమో కాని.. పత్రికలను సైతం దుయ్యబడుతున్నారు. ‘ పత్రికలు కావాలనే అసత్య వార్తలు రాస్తున్నాయి. కందుకూరు, గుంటూరు సంఘటనలకు పోలీసులు వైఫల్యం కారణమని రాసిన సంపాదకీయంలో అభ్యంతరకర పదాలు ఉన్నాయి’ అని.. జనవరి 6వ తేదీన కందుకూరులో విలేకర్ల వద్ద ఆయన వ్యాఖ్యానించారు. జర్నలిజం పేరుతో ఇలాంటి రాతలు సరికాదని, రాజకీయ పార్టీకి కొమ్ము కాయదలచుకొంటే నేరుగా ముద్ర వేసుకోవాలని సూచించారు. అసలు కొమ్మినేనే అధికార పార్టికి కొమ్ముకాస్తూ.. సాక్షి ఛానల్ లో అనేక ముఖాముఖీలు నిర్వహించటం, వాటిలోని కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలోను కనిపిస్తుండటం చాలా మందికి తెలిసిన విషయాలే . అటువంటి ఆయనే ఇప్పుడు రాజకీయ నాయకుడి మాదిరిగా విమర్శలు చేయటం విడ్డూరం. కొమ్మినేని వంటి సీనియర్లు విలువలకు ప్రాధాన్యమిచ్చినప్పుడే జర్నలిజం పెడదారి పట్టకుండా ఉంటుంది.