భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు పాకిస్థాన్ పంపిస్తున్న దొంగ నోట్లను అరికట్టడమూ పెద్ద నోట్ల రద్దుకు ఒక కారణం. చిన్న నోట్లైతే పెద్ద వాటికి మాదిరిగా రద్దు చేయలేరన్న ధీమాతో ఇప్పుడు వాటినీ తయారు చేస్తున్నట్టుగా భావించొచ్చు
బురుజు.కాం Buruju.com : దొంగ నోట్లు అనేవి అధిక విలువతో కూడిన నోట్లలోనే ఉంటాయనేది పాత మాట. పది, ఇరవై రూపాయల నోట్లలోకి సైతం అవి చొచ్చుకొస్తున్నాయి. తెలంగాణలో ఇటువంటి తక్కువ విలువతో కూడిన దొంగనోట్లు Fake currency బయటపడుతుండగా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దొంగనోట్లు ఎక్కువగా రెండు వేల రూపాయల నోట్లలో కనిపిస్తుండటం ఆశ్చర్యపరిచే విషయం. ఇలా ఎందుకు జరుగుతున్నదీ ఎవరైనా పరిశోధన చేస్తే కొంగ్రొత్త సంగతులు వెల్లడికావచ్చు.
దొంగ నోట్లను పసిగట్టటం అంత సులువేంకాదు. దొంగ నోట్లను గుర్తించటంపై బ్యాంకులు అవగాహన శిబిరాలను నిర్వహించాల్సిన అవసరం ఉంది
తెలంగాణలో 2021లో.. 9,851 దొంగ నోట్లు దొరికాయి. వీటిలో పది రూపాయల దొంగనోట్లు 7 ఉండగా.. రూ.20 నోట్లు 47 ఉన్నాయి. ఇంకా.. రూ.50 విలువ గలవి 412 బయట పడగా.. వంద రూపాయల నోట్లు 546 ఉన్నాయి. జాతీయ నేర రికార్డుల విభాగం ( ఎన్.సి.ఆర్.బి) తాజాగా వెలువరించిన గణాంకాల్లో ఇటువంటి పలు విషయాలు కనిపిస్తున్నాయి. పెద్ద వైన అయిదు వందలు, రెండు వేల రూపాయల నోట్లను కొంత మంది వ్యాపారులు పైకెత్తి పరిశీలించి, వాటిని ఇచ్చిన వారి ముఖాన్ని కూడా చూసి తీసుకొంటూ ఉంటారు. అదే చిన్ననోట్లైతే ఎటువంటి పరిశీలన లేకుండా గల్లాపెట్టెల్లో వేసేసుకొంటారు. అందువల్లనే.. దొంగ నోట్ల తయారీ దారులు చిన్న నోట్లనూ పంపిణీలోకి తెస్తున్నట్టుగా భావించొచ్చు. తెలంగాణలో బయట పడ్డ మొత్తం 9,851 నోట్ల విలువ రూ.67 లక్షలు .
దొంగ నోట్లను పట్టుకొన్నతర్వాత పూర్తి స్థాయిలో దర్యాప్తును జరిపి.. ఆసలు ఆ నోట్లు ఎక్కడి నుంచి ఏవిధంగా వచ్చిందీ కూడా పోలీసులు వెల్లడించగలగాలి
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఇక్కడ 2021లో మొత్తం 20,704 దొంగ నోట్లు వెలుగులోకి వచ్చాయి. వీటిలో రెండు వేల రూపాయల నోట్లే ఏకంగా 5,012 ఉన్నాయి. ఇలా పెద్ద దొంగ నోట్ల కేసుల్లో దేశం మొత్తం మీద ఏపీది నాలుగో స్థానం. తెలంగాణలో రెండు వేల రూపాయల నోట్లు 1,634 మాత్రమే బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లో రూ.10, రూ.20 విలువ గల నోట్ల అసలు లభించకపోవటం విశేషం. ఇక్కడ రూ.50 విలువ గలవి 3,004 నోట్లు, వంద విలువ గలవి 3,902 నోట్లు వెలుగు చూశాయి. ఏపీలో బయట పడ్డ దొంగ నోట్ల మొత్తం విలువ రూ. ఒక కోటి 24వేలు.
ప్రస్తుతం రెండు వేల నోట్ల ముద్రణ నిలిచిపోయి.. ఆ విలువ గల కొత్త నోట్లు అరుదుగా మాత్రమే కనిపిస్తున్నాయి. అందువల్ల ప్రస్తుతం రూ.500 నోటు హవా నడుస్తోంది. జోరుగా చేతులు మారుతున్న ఇటువంటి నోట్లలోకి దొంగవి బాగానే చొరబడుతున్నాయి. ఏపీలో 2021లో రూ.500 నోట్లు నకిలీవి 7,999 బయట పడగా.. తెలంగాణలో ఇవి 6,547 లభించాయి. బయట పడనివి ఇంకా ఎన్నొన్నాయో.. !