బురుజు.కాం Buruju.com : సెల్ ఫోను ఒక్క నిముషం పక్కన లేకపోతే ప్రాణం విలవిల్లాడి పోయే కాలం ఇది. ఇటీవల విడుదలయ్యి ప్రేక్షకాదరణ పొందిన ‘18 పేజెస్ ’ 18pages సినిమాలోని హీరోయిన్ (అనుపమ పరమేశ్వరన్) మాత్రం సెల్ ఫోనును అసలు వాడదు. ప్రకృతికి దగ్గరగా.. మానవ విలువలకు ప్రాధాన్యమిచ్చే రీతిలో బతుకుతానంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో.. ‘ కూర్మ ’అనే గ్రామం ఒకటి అచ్చంగా సినిమాలోని హీరోయిన్ భావాలకు అనుగుణంగానే ఇటీవల రూపొందింది. అక్కడివారెరూ సెల్ ఫోనును కాదుకదా.. అసలు విద్యుత్తును కూడా వాడరు. అన్ని అవసరాలకు ప్రకృతికి పైనే ఆధారపడతారు. భగవద్గీతలోని అంశాలకు అనుగుణంగా నాలుగేళ్ల క్రితం ఏర్పడిన కూర్మ గ్రామం గురించి తెలుసుకొనే.. సినిమాలోని హీరోయిన్ పాత్రను రచయిత సుకుమార్ తీర్చిదిద్దారా? అనిపిస్తుంది. పైగా.. సినిమాలోని ఆ పాత్ర స్వగ్రామం కూడా శ్రీకాకుళం జిల్లాకు పక్కనే గల విజయనగరం జిల్లాలో ఉంటుంది. నితిన్ హీరోగా నటించిన 18 పేజెస్ సినిమా.. ప్రస్తుతం ‘ఆహా’లో అందుబాటులో ఉంది.
శ్రీకాకుళం జిల్లా హిరమండలం పరిధిలోని కూర్మ గ్రామంలో ప్రస్తుతం 56 మంది నివసిస్తున్నారు. వీరు సెల్ ఫోన్లనే కాదు.. విద్యుత్తునూ వాడరు. అన్ని పనులు ఇలా దీపాల వెలుతురులోనే..
ఆంధ్రప్రదేశ్ లో 2001 లెక్కల ప్రకారం.. ప్రతి వంద మంది వద్ద 86 సెల్ ఫోన్లు ఉన్నాయి. తెలంగాణలోనైతే 110 ఉన్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య ఇంకా బాగా పెరిగే ఉంటుంది. సినిమా కథ మంచి పట్టు ఉన్నదే అయినప్పటికీ.. హీరోయిన్ సెల్ ఫోనును వాడకపోవటాన్ని కూడా ప్రేక్షకుడిని బాగానే కట్టిపడేసింది. ఇప్పుడు ఎవరు ఎక్కడికెళ్లాలన్నా గూగుల్ మ్యాప్ పెట్టుకొని సులువుగా వెళ్లిపోతున్నారు. సినిమాలోని అనుపమ పరమేశ్వరన్ మాత్రం.. ఇలా గూగుల్ మ్యాపులు చూసి కాకుండా గమ్య స్థానానికి పది మందినీ అడుగుతూ వెళ్తేనే పలు విషయాలు తెలుస్తుంటాయని భావిస్తుంది. ఇది నిజమే.. కొంత మంది ఎంతో అభిమానంగా చిరునామాను చెబుతుంటారు. అప్పుడు మనకెంతో సంతోషం కలుగుతుంది.
కూర్మ గ్రామంలో సెల్ ఫోన్ల తాకిడి లేదు కనుక అన్ని పనులు ఇలా సామూహింగానే కొనసాగుతుంటాయి
ప్రతి ఒక్కరూ రోజు డైరీని రాసుకోవాలనే మరో అతి ముఖ్యమైన సందేశాన్ని కూడా సినిమా మనకు అందిస్తుంది. సినిమాలో అనుపమ పరమేశ్వరన్.. ఇలా ముఖ్యమైన సంఘటనలను రాసిన డైరీ ఒకటి హీరోకు దొరకటం వల్లనే ఆమెను అతను విలన్ నుంచి కాపాడగలుగుతాడు. ఆ డైరీలో ఆమె ప్రస్తావించిన వాటన్నింటిని అతను అమలు చేసి ఆమె ప్రేమను పొందుతాడు. ప్రస్తుతం డైరీల్లో రాసుకోవటమనేదే కనుమరుగై పోయి ప్రతిదీ సెల్ ఫోనుతో వీడియోలుగా తీసుకోవటం ప్యాషన్ గా మారిపోయింది. ఆటువంటి వీడియోలు ఒకటి, రెండు రోజుల్లోనే పక్కకు వైదొలగి.. వాటి స్థానంలో కొత్తవి వస్తుంటాయి. ఆ వీడియోలోని సమాచారాన్నే కనుక డైరీలో రాసుకొంటే.. కొంతకాలానికి ఆ రాతలు మనల్ని ఎంతో ఆహ్లాదపరుస్తాయి.
సినిమాలోని ఒక లోపం ఏమిటంటే.. డైరీని చదువుతూ హీరో ఊహించుకొన్న హీరోయిన్ రూపమే చివరికి అతని ముందు ప్రత్యక్షం కావటం. నిజానికి ఇలా జరగకూడదు కదా? పోనీ.. అలా ప్రత్యక్షం కాగానే అతను అమెను గుర్తుపడతాడా? అంటే అదీ లేదు. ఆమెవరో తెలియనట్టే ఉంటాడు. పిడతకింద పప్పును కలిపే సంఘట ద్వారానే వారు ఒకరినొకరు గుర్తుపడతారు. మంచి పట్టు ఉన్న కథనం కావటాన దానిలో నిమగ్నమైపోయే ప్రేక్షకుడు ఇటువంటి లోపాలను పసిగట్టలేడు. అందువల్ల సినిమాను చూసి.. దానిలో హీరోయిన్ అనుసరించిన పద్ధతులను కనీసం వారానికి ఒక రోజైనా ఆచరించగలిగితే.. మానవ సంబంధాలు మరీ తెగిపోకుండా ఉంటాయి.