దేశ భక్తిని చాటి చెప్పి.. ప్రేక్షకుల్ని మంత్ర ముగ్గుల్ని చేసిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కాదని.. సినిమాలను చూసేందుకు ఒక కుర్రవాడు కష్టపడే కథతో కూడిన చలో షో ( లాస్ట్ ఫిల్ము షో) .. భారత చలన చిత్ర సమాఖ్యకు ఎలా నచ్చిందో ఎవరికీ అర్ధం కావటంలేదు
బురుజు.కాం Buruju.com : ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకొన్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వేరే మార్గాల్లో ఆస్కారు బరిలోకి పంపాలని ఆ చిత్ర నిర్వాహకులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. భారత చలన చిత్ర సమాఖ్య మాత్రం.. గుజరాతీ సినిమా ‘ చలో షో ’ ను ఆస్కారు పోటీకి ఎంపిక చేసి అందరినీ నివ్వెర పర్చింది. చిత్రాలను పంపుకోవటానికి నవంబరు 15వ తేదీ వరకు వ్యవధి ఉనప్పటికీ సమాఖ్య తొందరపడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత దేశానికి ఇంతవరకు అయిదు ఆస్కారు అవార్డులు వ్యక్తిగత విభాగాల్లో అందినప్పటికీ.. ఉత్తమ కథా చిత్రం వర్గీకరణలో ఒక్కసారీ పురస్కారం లభించలేదు.
చలో షో లోని సన్నివేశాలు ఇలా ఉంటాయి
ఆస్కారు పురస్కారాలు 1929లో మొదలు కాగా.. గడచిన 93 ఏళ్ల వ్యవధిలోను మన దేశం నుంచి ఉత్తమ కథా చిత్రం విభాగంలో మొత్తం 54 సినిమాలు వాటిని ఆశించి బంగపడ్డాయి. వీటిలో.. 1957లో మదర్ ఇండియా, 1988లో సలాంబొంబే, 2001లో లగాన్ చిత్రాలు.. ఆస్కారు ప్రక్రియలోని నామినేషన్ దశ వరకు మాత్రమే వెళ్లి తదుపరి దశలకు చేరుకోలేకపోయాయి.
మూడు దశల్లో అదికంగా ఓట్లను సాధించిన చిత్రమే ఆస్కారు పురస్కారాన్ని అందుకోగలుగుతుంది
తెలుగు సినిమాల్లో ఇంతవరకు కమలహాసన్ నటించిన ‘స్వాతిముత్యం ’ ఒక్కటే ఆస్కారు కోసం వెళ్లి.. ప్రాధమిక దశలోనే వీగిపోయింది. ప్రపంచంలో అత్యధికంగా.. ఇటలీ దేశం 14 ఉత్తమ కథా చిత్రాల అవార్డులను పొందగలిగింది. ఇక్కడి నుంచి మొత్తం 68 సినిమాలు వెళ్లగా.. వాటిలో 32 సినిమాలు నామినేట్ కావటం విశేషం. ఆస్కారు కోసం ప్రాధమిక స్థాయిలో ఎంపిక చేసేందుకు ప్రస్తుతం వివిధ రంగాలకు చెందిన 9,427 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో దర్శక ఓటర్లు.. ఉత్తమ దర్శకుడిని, నటులు.. ఉత్తమ నటులను.. ఇలా ఏ రంగానికి చెందిన వారు ఆరంగంలోని ఉత్తములను ఎన్నుకొంటారు. ఉత్తమ చిత్రాన్ని మాత్రం వీరంతా కలసి ఎన్నుకొంటారు. ఇలా వీరు ఎంచిన వ్యక్తిగత విభాగాలు, చిత్రాలను ఆ తర్వాత ఆస్కారు సభ్యులు వీక్షించి.. కొన్నింటిని తమ రహస్య ఓట్ల ద్వారా నామినేషన్ దశకు తీసుకెళ్తారు. నామినేట్ అయిన వాటిని మరికొందరు సభ్యులు తమ ఓట్ల ద్వారా ఎంపికచేస్తారు .
ప్రపంచ వ్యాప్తంగా ఇంతవరకు 133 దేశాలు ఉత్తమ చిత్రం విభాగంలో కనీసం ఒక్కో చిత్రానైనా పంపాయి. వీటిలో 62 దేశాలు నామినేషన్ దశకు వెళ్లగా.. వాటిలో 28 దేశాలు అవార్డులను కైవశం చేసుకోగలిగాయి.
చలో షో దర్శకుడు నలీన్ చిన్ననాటి ముచ్చట్లే సినిమాగా రూపొందింది. ఆయన చిన్నప్పుడు తన ఊరిలోని సినిమాలను చూసేందుకు ఎంతగా కష్టపడిందీ దీనిలో చూపించారు. గుజరాతి గ్రామీణ వాతావరణాన్ని దీనిలో బాగా చూపించినట్టు సినిమాను ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై ( సినిమాకు అక్కడి పేరు లాస్ట్ ఫిల్ము షో) వీక్షించిన వారు వెల్లడించారు. ఇటువంటి కథాంశాలతో ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయని, దీనిని చలన చిత్ర సమాఖ్య ఏ విధంగా ఎంపిక చేసిందో తెలియటం లేదని ప్రముఖ దర్శకుడు శంకర్ వ్యాఖ్యానించారు. ఆస్కారు అవార్డులకు ప్రాధమిక ఓటింగు ప్రక్రియ డిసెంబరు 12న మొదలవుతుంది. తుది ఓటింగు 2023, మార్చి 2వ తేదీన మొదలయ్యి 7వ తేదీన ముగుస్తుంది. నామినేట్ అయిన చిత్రాలు ఏవనేది జనవరి 24న వెల్లడవుతుంది.