అంతిమ యాత్రలో భగవద్గీత: మాజీ ఎంపీ ఉండవల్లి వింత వాదన
personBuruju Editor date_range2023-01-19
భగవద్గీత ఎల్లప్పుడు ఇలా యువత చేతుల్లో ఉండాలంటే దానిని అంతిమయాత్రలు, శ్మశానాలకు దూరంగా ఉంచాలి
బురుజు.కాం Buruju.com : అంతిమ యాత్రల్లో.. భగవద్గీతను వినిపించుకోవచ్చంటూ పార్లమెంటు మాజీ సభ్యులు ఉండవల్లి అరుణ కుమార్ vundavalli Arunakumar చెబుతున్నారు. అటువంటి సమయంలో గీతను వింటే భయం పోతుందని ఆయన అంటున్నారు. భగవద్గీతను వినిపించే అంతిమయాత్ర వాహనాల టైర్లను కోసి వేస్తామంటూ భారతీయ జనతా పార్టీ (భాజపా) తెలంగాణ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు అయిన బండి సంజయ్.. చేసిన హెచ్చరికను ఉండవల్లి తప్పుపట్టారు. భగవద్గీత ఉన్నది ఫ్రిజ్ లో పెట్టుకోవటానికా? అంటూ ఆయన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. భగవద్గీత ప్రస్తుత పరిణామాలను ఆయన తెలుసుకొని ఉంటే ఇలా మాట్లాడి ఉండేవారు కాదేమో?
ఏదో ఒక విషయంపై మాట్లాడుతూ.. తరచు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్
అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్ర లెఫ్టెనెంటు గవర్నరు అరుణా మిల్లర్.. జనవరి 18వ తేదీన బాధ్యతలను స్వీకరించేటప్పుడు భగవద్గీతపై Bhagavatgita ప్రమాణం చేశారు. అటువంటి గీత.. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో శవయాత్రల్లోను, శ్మశానాల్లోను వినిపించటం ఎక్కువయ్యింది. దీంతో.. భగవద్గీత గ్రంధాన్ని ఇళ్లల్లో ఉంచుకోవచ్చా? అనే ప్రశ్నలు ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నాయి. భగవద్గీత ఇలా దుర్వినియోగం కావటం పట్ల ప్రముఖ భాష్యకారులు గరికపాటి నరసింహారావు.. Garikapati Narasimha Rao చాలా కాలం క్రితమే తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. హైదరాబాదులోనైతే ..రోడ్లపై భగవద్గీత వినిపించిందంటే చాలు.. అంతిమ యాత్ర వాహనం వస్తుందని నిర్ధారించుకొని.. ముందు వెళ్తున్నవాహనాల వారంతా బాగా పక్కకు వెళ్లిపోతుంటారు.
ప్రజా సంగ్రామ యాత్రంలో.. తెలంగాణ భాజపా అధ్యక్షులు బండి సంజయ్
ఒకప్పుడు భాజాలు మొత చేసిన పనిని ఇప్పుడు ఘంటశాల ఆలపించిన భగవద్గీతతో చేయిస్తున్నారని వివరిస్తూ ‘బురుజు.కాం’ Buruju.com 2022, జూలై 28వ తేదీన ఒక కథనాన్ని వెలువరించింది. భవద్గీతను దుర్వినియోగం చేయకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చట్టాలను తేవాలని సూచించింది. కథనాన్ని చూసిన ఎంపీ బండి సంజయ్ Bandi Sanjai తీవ్రంగా స్పందించారు. ఆయన తన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా.. 2022, ఆగస్టు 18వ తేదీన తెలంగాణలోని జనగామ జిల్లా కేంద్రంలో ప్రసంగిస్తూ.. ఇక ముందు శవయాత్రల్లో భగవద్గీతను వినిపిస్తే ఊరుకొనేది లేదని అన్నారు. ఒక పథకం ప్రకారం అంతిమ యాత్రల్లో భగవద్గీతను వినిపించటం ఎక్కువయ్యిందని, ఇక ముందు అటువంటి అంతిమ యాత్ర వాహనాల టైర్లను కోసివేస్తామని ఆయన హెచ్చరించారు.
భగవద్గీతను వినిపించటం కోసం అంతిమ యాత్ర రధంపై అమర్చివున్న స్పీకరు
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్.. తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్.. ‘వీకెండ్ విత్ నాగేశ్వర్’ పేరుతో 10టీవీలో నిర్వహించిన కార్యక్రమంలో ఉండవల్లి పాల్గొన్నారు. ‘ శవం దగ్గర భగవద్గీత విపిస్తే శవవాహనాన్ని కాల్చేస్తారట. అలా అయితే భగవద్గీత ఉన్నది ఫ్రిజ్ లో పెట్టటానికా? అది భయం నుంచి ఎలా బయటపడాలో చెబుతుంది’ అని ఉండవల్లి పేర్కొన్నారు. ఇలా చెబుతున్నప్పుడు ఆయన్ని సమర్ధిస్తున్నట్టుగా నాగేశ్వర్ కూడా వ్యంగ్యంగా నవ్వులు చిందించారు. ఉండవల్లి వంటి వారి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు వస్తాయని ముందుగా పసిగట్టే.. గరికపాటి నర్సింహారావు.. ఒక చోట తన ప్రసంగంలో తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. శ్రీకృష్ణడు గీతను అంత్యకాలంలో స్మరించమన్నాడే తప్ప చనిపోయిన తర్వాత వినిపించాల్సిందిగా చెప్పలేదని స్పష్టంచేశారు. చనిపోయిన తర్వాత గీతను వినిపిస్తే శవం ఎలాగు వినదు. ఎవరి పనుల్లో వారు ఉంటూ అక్కడికొచ్చే బంధువులూ వినరు. మరి ఉండవల్లి చెబుతున్నట్టుగా ఆ సమయంలో ఎవరి భయాన్ని అది పోగొడుతుంది?