కేంద్ర ప్రభుత్వ వాహనం బాగున్నా ఇక తుక్కుగా మారాల్సిందే
personBuruju Editor date_range2022-12-25
బురుజు.కాం Buruju.com : కేంద్ర మంత్రిత్వ, ఇతర శాఖలకు చెందిన వాహనాల వయస్సు 15 ఏళ్లు దాటగానే అవి ఇక తుక్కుగా మారిపోనున్నాయి. అటువంటి వాహనాలు.. చూడటానికి బాగా ఉన్నప్పటికీ వాటిని ఆయా శాఖలు ఇక ఎంత మాత్రం వేలం ద్వారా విక్రయించకూడదు. వాయు కాలుష్యాన్ని, నిర్వహణ ఖర్చులను తగ్గించటం, ఇంధన సామర్ధ్యాన్ని పెంచటం లక్ష్యాలుగా ఇటువంటి నిర్ణయాన్ని తీసుకొన్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు ‘బురుజు’కు వెల్లడించాయి. రిజిస్టెర్డు వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ ( ఆర్.వి.ఎస్.ఎఫ్) అనే విభాగం.. వాహనాలను తుక్కుగా మార్చే ప్రక్రియను చేపడుతుంది. తెలుగు రాష్ట్రాల్లోను ప్రభుత్వ డొక్కు వాహనాలు రోడ్లపై తిరగకుండా ఇటువంటి కటిన నిర్ణయాలను తీసుకోవాల్సివుంది.
వాహనం బాగున్నప్పటికీ దానికి ఇక వేలం వేయకుండా ఇలా తుక్కుగా మార్చివేాయాల్సిందే
వాహనాలను రోడ్లపై నుంచి ఎప్పుడు తొలగించాలో వివరించే ఉత్తర్వులు ఇప్పటికే కేంద్రంలో అమల్లో ఉన్నాయి. వీటిలో.. వాహనాల వయస్సు లేదా అవి తిరిగిన కిలో మీటర్లు వంటి నిబంధనలు పొందుపర్చివుండగా.. కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల నీతిఅయోగ్ తోను, కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖతోను సంప్రదించి ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని నిర్ణయించింది. తాజా నిర్ణయం ప్రకారం.. ఇక వాహనాల వయస్సును మాత్రమే పరిగణనలోకి తీసుకొంటారు. వాహనాన్ని కొని 15 ఏళ్లు కాకపోయినా అది తిరగటానికి వీలుగా లేదని అధికారులు భావిస్తే దాన్నీ తుక్కుగానే మార్చివేస్తారు.
15 ఏళ్లు దాటినప్పటికీ వాహనాన్ని మరికొంతకాలం మనుగడలో ఉంచాలని ఏ శాఖవారైనా భావించినట్లైతే అప్పుడు కేంద్ర సంయుక్త కార్యదర్శి హోదాకు తగ్గని అధికారికి దరఖాస్తు చేసి అక్కడి నుంచి అనుమతిని పొందాలి. దేశంలోని ఏదైనా మారుమూల ప్రాంతంలో తిరుగుతున్న వాహనాన్ని వెనక్కిరప్పించటంలో కొంత ఆలస్యమవుతుందని భావించినప్పుడు వంటి సందర్భాల్లోనే ఇలా దరఖాస్తు చేసుకోవాలి. వాహనాలను తుక్కుగా మార్చటంపై త్వరలో మార్గదర్శకాలు వెలువడతాయని అధికార వర్గాలు వెల్లడించాయి.