గుజరాత్ ఊపుతో.. ఇక తెలంగాణలో వ్యూహాలను మార్చనున్న భాజపా
personBuruju Editor date_range2022-12-07
బురుజు.కాం Buruju.com : గుజరాత్ ఎన్నికల్లోని భారీ విజయంతో మంచి ఊపు మీద ఉన్న భారతీయ జనతాపార్టీ అగ్ర నాయకత్వం.. ఇక తెలంగాణపై మరింతగా దృష్ట్రి సారించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడి అధికార పార్టీ నాయకులను తిప్పలు పెట్టే అవకాశాలూ లేకపోలేదు. ఇప్పటికే ఈడీ, ఐటీ , సీబీఐ సంస్థలు చేస్తున్న దాడులు.. వ్యాపార రంగంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) నాయకులను కలవరపెడుతూనే ఉన్నాయి. గుజారాత్ అసెంబ్లీ ఎన్నికల్లోని భాజపా విజయం వల్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇంతకు మందటి మాదిరిగా కేంద్రాన్ని గట్టిగా ఢీకొనగలరా? అనే సందేహాలు రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతున్నాయి.
గుజరాత్ భాజపా శ్రేణుల ఆనందోత్సవాలు
కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు బ్రస్టుపట్టిపోయిందని, తమ రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించిందని ముఖ్యమంత్రి కేసీఆర్.. చేసిన ప్రచారం గుజరాత్ ఎన్నికలపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. పైగా అక్కడి భాజపా బలం మరింత పెరిగి మొత్తం 182 స్థానాలకు గాను 156 చోట్ల ఆ పార్టీ విజయకేతనం ఎగరవేయగలిగింది. ఏకంగా ఏడో పర్యాయం భాజపా అధికార పగ్గాలను చేపట్టటమంటే అదేమీ సామాన్య విషయం కానేకాదు. సొంత రాష్ట్రమైన గుజరాత్ లో నరేంద్ర మోదీకి తాజా అఖండ విజయం ఎంతో ప్రేరణ ఇవ్వటం సహజం. ప్రస్తుతానికి దేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే ఆయనపై కాలుదువ్వుతున్నందున కేంద్రం సైతం ధీటుగానే ప్రతిస్పదించే అవకాశం ఉంది.
భాజపాకు ధీటుగా ఇక తెరాస అధినేత కేసీఆర్.. వ్యూహాలను మార్చుకోకతప్పదు
ఇటీవల వరకు భాజపా నాయకత్వం కేవలం తమ పార్టీని తెలంగాణలో బలోపేతం చేసుకొనే కోణంలోనే పావులు కదిపేది. తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎప్పుడైతే కేసులను పెట్టించారో.. అప్పటి నుంచి భాజపా వ్యూహం మారింది. రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు బదులుగా కేంద్ర సంస్థలు రంగంలోకి దిగాయి. ఏకంగా కేసీఆర్ కుమార్తె కవిత.. డిల్లీ మద్యం కుంభకోణంలో ఉన్నట్టుగా సీబీఐ చెబుతుండటంతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. తెరాసకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను భాజపా కొనుగోలు చేయబోయందంటూ కేసులు పెట్టి హడావిడి చేస్తున్నప్పటికీ.. ప్రజల్లో స్పందన కొరవడిందనే చెప్పాలి. ఎందువల్ల నంటే ఇతర పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలను కేసీఆర్.. తెరాసలో చేర్చుకొని ఉండటమే. ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు తెరాస తీర్ధం పుచ్చకోవటం, ఆ పార్టీ నుంచి వచ్చేవారికి కేసీఆర్.. పదవులను ఇవ్వటం వల్ల కాంగ్రెస్ నిర్వీర్యమవుతూ వచ్చింది. దీంతో గట్టి పోటీ ఇచ్చే స్థానంలోకి భాజపా రాగలిగింది.
భారత్ రాష్ట్ర సమితి మిగతా రాష్ట్రాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపించనుందో తేలాల్సివుంది
కేంద్రంలో అధికారంలో ఉండటంతో.. భాజపాకు ఇటువంటి అవకాశం బాగా కలిసొచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లో ఓటమి.. మోదీని వ్యతిరేకించే వారికి ప్రస్తుతానికి ఊరటను ఇచ్చే విషయమే అయినప్పటికీ.. ప్లాన్ ‘బి’ తో అక్కడా త్వరలో భాజపా అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరంలేదన్నది రాజకీయ పరిశీలకుల భావన. మొత్తం మీద కేసీఆర్.. తెరాస పేరును భారత రాష్ట్ర సమితి (భారాస) గా మార్పు చేసి.. జాతీయ పార్టీగా తీర్చిదిద్దేందుకు సంకల్పించినప్పటికీ.. వెంట నడిచే ఇతర జాతీయ నాయకులంటూ ప్రస్తుతానికి పెద్దగా లేకపోవటంతో భవిష్యత్తు కార్యాచరణ ఏరీతిలో ఉంటుందో తెలియాల్సివుంది.