భగవద్గీతపై ‘బురుజు’ కథనానికి ఎంపీ బండి సంజయ్ స్పందన
personBuruju Editor date_range2022-08-18
భగవద్గీతను అంతిమ యాత్రల్లో వినిపించకుండా చట్టాన్ని తేవాలంటూ జూలై 28వ తేదీన బురుజు.కాంలో వెలువడిన కథనం
బురుజు.కాం Buruju.com భగవద్గీతను అంతిమ యాత్రల్లో ఉపయోగించకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలు చట్టాలను తేవాల్సిన అవసరం ఉందంటూ బురుజు.కాం ఇటీవల వెలువరించిన కథనానికి పాఠకుల నుంచి మంచి స్పందన లభించింది. ఒక ప్రధాన అంశాన్ని లేవనెత్తి.. అంతా చర్చించుకొనేలా చేశారంటూ పలువురు పాఠకులు బురుజు.కాంను ప్రశంసిస్తూ సందేశాలను పంపారు. పార్లమెంటు సభ్యులు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఇదే విషయంపై ఘాటుగా వ్యాఖ్యానించారు. భగవద్గీతను వినిపిస్తూ వెళ్లే అంతిమ సంస్కార వాహనాలను ఆపివేసి.. వాటి టైర్లను కోసి వేస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో భాజపా నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా .. ఆగస్టు 18వ తేదీన జనగామ జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. పార్టీ వైఖరిని వెల్లడించారు. ఒక పథకం ప్రకారం భగవద్గీతను అంతిమ యాత్రల్లో వినిపించటం ఇటీవల కాలంలో ఎక్కువయ్యిందని పేర్కొన్నారు. మానసిక ప్రశాంతత, ఆథ్యాత్మిక చింతనకు భగవద్గీత ఆలవాలమని, అటువంటి గ్రంధాన్ని అవమానిస్తే దాడులు తప్పవని ఆయన హెచ్చిరించారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా.. ఆగస్టు 18వ తేదీన జనగామ జిల్లా కేంద్రంలో.. తెలంగాణ భాజపా అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ .. భగద్గీత వినియోగంపై చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రజ్యోతి పత్రికలో వెలువడిన వార్త ఇది
వైకుంఠ రధాల చక్రాల టైర్లను కోసి వేయటం కాకుండా అసలు అటువంటి రధాలకు స్పీకర్లు అంటూ లేకుండా చేయగలిగితే ఉత్తమంగా ఉంటుంది. ఎందువల్ల నంటే.. అంతిమ యాత్ర రధాలను పరిశీలిస్తే.. వాటి తయారీ సమయంలోనే స్పీకర్లను అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. రధాలను ఆపి టైర్లను కోసి వేస్తే అంతిమ సంస్కారాలు ఆలస్యమయ్యి మరికొన్ని రకాల సమస్యలు ఉత్పన్నంకావచ్చు. వైకుంఠ రధాల ద్వారానే కాకుండా.. మరణించినవారి ఇళ్లలోను, ఇటీవల కాలంలో శ్మశానాల్లోను సైతం భగద్గీతను వినిపించటం ఎక్కువయ్యింది. అదే విధంగా పత్రికల్లో ప్రచురించే శ్రద్ధాంజలి ప్రకటనల్లోను భగవద్గీత శ్లోకాలు కనిపిస్తున్నాయి. అటువంటి అన్ని చోట్లా భగద్గీతను ఉపయోగించకుండా కట్టడి చేయాలంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోను ప్రత్యేక చట్టాల ద్వారానే సాధ్యమవుతుంది. చర్యలంటూ లేకపోతే మాత్రం.. భగవద్గీత గ్రంధాన్ని ఇంటిలో ఉంచుకోవచ్చా? అనే ప్రశ్నలు త్వరలోనే వినిపించే ప్రమాదం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టేలా బండి సంజయ్ వంటి ప్రజా ప్రతినిధులు నడుంకట్టాలి.