తెలంగాణ మంత్రివర్యా..అల్లూరిపై ఇదేం ప్రకటన? (11వ భాగం)
personBuruju Editor date_range2022-12-21
తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
బురుజు.కాం Buruju.com : ( అల్లూరి శ్రీరామరాజు తమ అధీనం నుంచి తప్పించుకొని పారిపోతుంటే కాల్చివేశామంటూ 1924 నాటి మద్రాసు ప్రెసిడెన్సీ నివేదికలో బ్రిటీష్ ప్రభుత్వం పేర్కొంది. ఇది తప్పని , ఆ యోధుడిని చెట్టుకు కట్టి కాల్చివేసి బ్రిటీష్ పాలకులు కట్టుకథ అల్లారని నిరూపించేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పుడొక కమిషన్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తూ.. బురుజు.కాం అందిస్తున్న కథనాల్లో ఇది పదకొండోవది) ఆనాడు తెలంగాణ సాయధ పోరాట సమయంలో ఎంతో మంది పోరాట యోధులకు అల్లూరి సీతారామరాజు Alluri Sitarama Raju గాథలు స్పూర్తిని రగిలించాయి. అటువంటి కారణంగానే 1941లో తెలంగాణ ప్రజల వీరోచిత తిరుగుబాటును చిత్రించే ‘మా భూమి’ Maa Bhumi నాటక ప్రదర్శనతో పాటు అల్లూరి సీతారామరాజు బుర్రకథను కూడా ప్రభుత్వం నిషేధించింది. అటువంటి సీతారామరాజు కేవలం ఆంధ్రప్రదేశుకు చెందినవాడనే అర్దం వచ్చేలా తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. ‘‘అల్లూరి సీతారామరాజు కనుక తెలంగాణకు చెంది ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్.. 24 ఎకరాల్లో మ్యూజియం నిర్మించి ఉండేవారు’’ అని 2022, జూలై 2వ తేదీన హైదరాబాదులోని అల్లూరి జయంతి వేడుకల సభలో ఆయన పేర్కొన్నారు. మంత్రుల స్థాయిలో ఉన్నవారు ప్రకటనలు చేసే ముందు చరిత్రను అధ్యయనం చేయాలి.
కమ్యునిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య
ఆనాడు అల్లూరి తిరుగాడిన ప్రాంతంలో తెలంగాణ సాయుధ యోధులు ఏ విధంగా తర్ఫీదును పొందిందీ మహానేత పుచ్ఛలపల్లి సుందరయ్య.. 1973లో వెలువడిన ‘‘ వీర తెలంగాణ విప్లవ గుణపాఠాలు’’ అనే గ్రంధంలో విశీదీకరించారు. ఆయన ఇలా రాశారు.. ‘‘ పూర్వం.. 1922-24 మధ్యకాలంలో బ్రిటీష్ జులుంకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలకు చెందిన ఏజెన్సీ ప్రాంతాల కోయ ప్రజలకు అల్లూరి సీతారామరాజు నాయకత్వం వహించిన చోటనే తెలంగాణ యోధులకు ఒక రకమైన సాయుధ శిక్షణ ఇవ్వబడింది. అక్కడి పేరింతపల్లి సాధు సింగరాజు.. కోయజాతి ప్రజల కోసం ఒక ఆశ్రమం నడుపుతుండేవారు. అనేక మంది కోయ యువకులు అక్కడికి ఆకర్షింపపడ్డారు. తాము కోయజాతి పాలనను ఏర్పరచుకోవచ్చని , తమ కష్టాలన్నీ అంతమవుతాయని వారిలో ఆశలు రేకిత్తించబడ్డాయి. అల్లూరి గాధలింకా అక్కడి ప్రజల స్మ్రతిపథంలో కదులుతూనే ఉన్నాయి. కమ్యునిస్టుపార్టీ ఈ కోయ యువకులతో సంబంధాలను పెట్టుకొని వారి కోసం తరగతులు నడిపింది. చర్చలను నిర్వహించింది. వారిలో అనేక మందిని తనలోకి రాబట్టుకోగలిగింది’’ అని సుందరయ్య రాశారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధులు శిక్షణ. వీరికి అల్లూరి స్పూర్తి అని సుందరయ్య పేర్కొన్నారు
అల్లూరి నడయాడిన చోట తెలంగాణ సాయుధపోరాట యోధులు శిక్షణ పొందినట్టుగా పుచ్ఛలపల్లి సుందరయ్య ఎంతో గర్వంగా తన గ్రంధంలో పేర్కొనగా.. అల్లూరి తెలంగాణ వాడు కాదనే ధోరణిలో మంత్రి మాట్లాడటం త్యాగధనులను చులకనచేసిట్టే భావించాలి. ప్రజా పరిశోధకుడు జయధీర్ తిరుమల రావు 1998లో వెలువరించిన ‘ తెలంగాణ రైతాంగ పోరాటం: సాహిత్యం’ అనే గ్రంధంలో.. తెలంగాణ పోరాట సమయంలో అల్లూరి ఎటువంటి స్పూర్తిని రగిలించిదీ గొప్పగా రాశారు. పోరాటాల్లో పాల్గొనే ప్రజలకు అల్లూరి పేరు విప్లవ భావస్పోరకంగా మారిందని, రానురాను ఉద్యమాలు పెరుగుతున్నకొద్దీ అతని మీద ఎన్నో పాటలు, బుర్రకథలు వెలువడ్డాయని ఆయన విశ్లేషించారు.
అల్లూరికి ఇలా పూలమాలలు వేయటంతో సరిపెట్టకుండా.. ఆ మహావీరుడి మరుగున పడిన చరిత్రను వెలికితీసే ప్రయత్నాలను ఇక నైనా చేపట్టాలి
అల్లూరి సీతారామరాజు ఎంతో మందికి ఇప్పటికీ ఉద్యమ స్పూర్తిని రగిలిస్తూనే ఉన్నారనే సత్యాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వంటివారు గుర్తెరిగి ఇలా ప్రాంతీయతను అటువంటి మహనీయులకు ఆపాదించం మానుకోవాలి. పార్లమెంటులో అల్లూరి విగ్రహాన్ని నెలకొల్పటానికి చొరవతీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ .. అదే సభకు హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సూచించారు. అల్లూరి విగ్రహం ఏర్పాటునకు కేవలం కిషన్ రెడ్డి మాత్రమే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల ఎంపీలంతా పాటు పడాల్సిన అవసరం ఉంది. సీతారామ రాజు పోరాట కాలం నుంచి గిరిజనుల పోడు వ్యవసాయం సమస్య అలాగే ఉండిపోయింది. తెలంగాణలో ఇటీవల ఒక అటవీ అధికారి హత్యకు సైతం పోడు సమస్య దారితీసింది. సమస్య పరిష్కారానికి ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవచూపాలి ( మిగతా వచ్చేవారం)