వాల్తేరు వీరయ్య చిత్రం 2023, జనవరి 13వ తేదీన విడుదల కానుంది
బురుజు.కాం Buruju.com : చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య Waltair Veeraiah సినిమా పుణ్యమా అని ‘వాల్తేరు’ పేరు మళ్లీ ప్రచారంలోకి వచ్చింది. సినిమా విజయం సాధిస్తే.. వాల్తేరు పేరు ప్రస్తుత, రానున్న తరాలు మరికొన్నేళ్ల పాటు మననం చేసుకోవటానికి , దాని చరిత్ర మూలాలను తవ్వటానికి వీలవుతుంది. ఒకప్పుడు విశాఖపట్నానికి బదులుగా వాల్తేరు పేరే అధికారికంగా చెలామణిలో ఉండేది. రైళ్లపైనా వాల్తేరు పేరే రాసి ఉండేది.
వాల్తేరు వీరయ్యలోని పాటకు అభియనం
బ్రిటీష్ హయాంలోని 1907 నాటి వైజాగ్ పటం జిల్లా గజెటీర్ ప్రకారం.. కొన్ని రజక కుటుంబాల వలసతో వాల్తేరు గ్రామం ఏర్పాటయ్యింది. అప్పట్లో రజకులకు వేరే చోట చెరువులు ఉండేవి. ప్రస్తుత వాల్తేరు ప్రాంతంలో ప్రవహించే నీళ్లు చాలా స్వచ్ఛంగాను, బట్టలకు మరింత తెలుపుదనాన్ని తెచ్చేవిగాను కనిపించటంతో 1727లో కొన్ని రజక కుటుంబాలు అక్కడ నివాసాలను ఏర్పాటు చేసుకొన్నాయి. అంటే.. వాల్తేరు దాదాపు 300 ఏళ్ల క్రితం ఉనికిలోకి వచ్చింది. వాల్తేరుకు ఆ పేరు ఎలా వచ్చిందనే విషయంపై అంతర్జాలంలో రకరకాల వాదనలు కనిపిస్తున్నప్పటికీ.. అది.. వాలుగా ప్రవహించే ఏరు నుంచి వచ్చిన తెలుగు పదం అని చెప్పేందుకే ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. ఎందువల్ల నంటే.. అక్కడ ప్రవహించే నీళ్లను చూసే రజక కుటుంబాలు తొలుత నివాసాలను ఏర్పాటు చేసుకొన్నట్టుగా బ్రిటీష్ వారి గజెటీర్ చెబుతోంది.
దాదాపు 30 ఏళ్ల క్రితం వరకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ పేరు వాల్తేరు అనే రాసి ఉండేది. అలా రాసి ఉన్నప్పటి ఫొటో ఇది
‘వాలుఏరు’ క్రమేణా వాల్తేరుగాను, అంగ్లంలో వాల్టేరుగాను మారింది. వాల్తేరు పేరును పోలిన మరికొన్ని ప్రాంతాలు ఉండటమే ఇంతకు తార్కాణం. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలో మరో వాల్తేరు ఉంది. పూర్వపు పశ్చిమగోదావరి జిల్లాలోని మార్టేరు , అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గుర్తేడు వంటివి ప్రజల నోళ్లలో నాని వాల్తేరు మాదిరిగా మారిన పేర్లే. వాల్తేరు ప్రాతం సముద్ర మట్టానికి ఎత్తుగా ఉంటుంది కనుక అక్కడి నుంచి నీళ్లు సముద్రంలోకి వాలుగా ప్రవహించేవి.
రైల్వే జోనుకూ వాల్తేరు పేరు ఉండేది
వాల్తేరు రైల్వే స్టేషను 1893లో ఏర్పాటయ్యింది. అప్పటి నుంచి దాదాపు 30 ఏళ్ల క్రితం వరకు రైల్వే పరంగా వాల్తేరు పేరే బహుళ ప్రచారంలో ఉండేది. విశాఖకు వెళ్లే అన్ని రైళ్ల పైనా వాల్తేరు అనే రాసేవారు. రైల్వే టిక్కట్లపైనా అదే పేరును ముద్రించేవారు. ఎక్కడికైనా వెళ్తే విశాఖ నుంచి వచ్చారా? అని కాకుండా వాల్తేరు నుంచి వచ్చారా? అని అడిగేవారు. క్రమేణా వాల్తేరు పేరు పోయి ఆ స్థానాన్ని విశాఖపట్నం ఆక్రమించింది. వాల్తేరు రైల్వే డివిజన్ పేరు కూడా రాయగడ రైల్వే డివిజనుగా మారిపోతోంది. ఇంతకు ముందు ‘కేర్ ఆఫ్ కంచరపాలెం’ సినిమా విజయం సాధించటంతో అప్పటి నుంచి ఊరి పేర్లతో సినిమాలు తీయటం ఎక్కువయ్యింది. కంచరపాలెం కూడా విశాఖలోని ఒక ప్రాంతమే. విశాఖలోని రుషికొండ పేరుతో కూడా ఎవరైనా సినిమాను తీస్తే అప్పుడైనా అది వందల సంవత్సరాల క్రితం బౌద్ధ బిక్షువులు నివసించిన ప్రాంతమనే విషయం అందరికీ తెలుస్తుంది. ప్రస్తుతం రుషి కొండ బోడికొండగా మారిపోతున్న విషయం తెలిసిందే.