ఏటీఎంలను ఏర్పాటు చేయటమేకాదు.. అవి నిత్యం పనిచేసేలా చూడటమూ చాలా అవసరం
బురుజు.కాం Buruju.com : ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ల ( ఏటీఎం ATM ) పై ఉభయ రాష్ట్రాల్లోని బ్యాంకులు కాకిలెక్కలు చెబుతున్నాయి. అవి.. రాష్ట్ర బ్యాంకర్ల సమితికి అందజేసే గణాంకాలు ఒక మాదిరిగాను, రిజర్వు బ్యాంకుకు చెప్పే లెక్కలు మరో రకంగాను ఉంటున్నాయి. దీంతో.. అసలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నేసి ఏటీఎంలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయనే సమాచారం కొరవడినట్టు స్పష్టమవుతోంది. ఏటీఎంల వివరాలను.. రెండు రాష్రాల్లోని బ్యాంకులు, ఆర్బీఐ నుంచి Buruju.com సేకరించి పరిశీలించినప్పుడు కాకిలెక్కల విషయం బయటపడింది. ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం.. 2022, జూన్ నాటికి తెలంగాణలో వివిధ బ్యాంకులు నిర్వహించే ఏటీఎంలు 9,986 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ( ఎస్ ఎల్ బి సి ) మాత్రం జూన్ నాటికి 9,690 ఏటీఎంలు ఉన్నట్టు పేర్కొంటోంది. అంటే రెంటి నివేదికల మధ్య 296 ఏటీఎంలు తేడా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులు ఇచ్చిన వివరాలనే తాము క్రోడీకరించినట్టు తెలంగాణ బ్యాంకర్ల సమితి అధికార వర్గాలు చెబుతున్నాయి.
కార్డు లేకున్నా సులువుగా నగదును పొందే ఏటీఎంలను అందుబాటులోకి తేవాలని ఆర్బీఐ ఇటీవల అన్ని బ్యాంకులను ఆదేశించింది. నూతన విధానం అమల్లోకి వస్తే ఇక కేవలం స్మార్టు ఫోనులోని ఓటీపీని నమోదు చేసి నగదును పొందవచ్చు
అంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అక్కడా రెంటి నివేదికల మధ్య అంతరం కనిపించింది. 2022, జూన్ నాటికి ఏపీలో 10,269 ఏటీఎంలు పనిచేస్తున్నాయని ఆర్బీఐ తాజా నివేదిక చెబుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి మాత్రం.. జూన్ నాటికి 10,187 ఏటీఎంలు ఉన్నట్టుగా ఇటీవల నిర్వహించిన ఒక సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ కు అందజేసిన నివేదికలో వెల్లడించింది. అంటే ఆర్బీఐ, బ్యాంకర్ల సమితి లెక్కల మధ్య 82 ఏటీఎంలు తేడా ఉంది. రాష్ట్ర విభజన అనంతరం.. ఏపీలో 2014 సెప్టెంబరు నాటికి 10,990 ఏటీఎంలు సేవలు అందిస్తున్నట్టు ఆర్బీఐ నివేదికలో పొందుపర్చివుంది. అదే ఆర్బీఐ తాజా నివేదిక మాత్రం అక్కడ ప్రస్తుతం 10,269 మాత్రమే ఏటీఎంలు ఉన్నట్టు పేర్కొంటున్నందున .. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఏటీఎంల సంఖ్య పెరగటానికి బదులు 721 మేర తగ్గిపోవటమేమిటనే ఉత్పన్నమవుతుంది. మరో విశేషమేమిటంటే.. 2014, సెప్టెంబరు నాటికి ఆర్బీఐ లెక్క ప్రకారం తెలంగాణలో కేవలం 4,187 ఏటీఎంలు ఉండగా ఇప్పుడవి 9,986కు చేరాయి. అంటే ఇక్కడ ఏకంగా 5,799 ఏటీఎంలు పెరిగిపోయాయి.
ఐక్య రాజ్య సమితికి చెందిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే.. ఏటీఎంల సంఖ్యను ఇప్పటి కంటే బాగా పెంచాల్సివుంటుంది
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ( ఎస్.డి.జి ) సాధించాలంటే 2030 నాటికి ప్రతి ఒక లక్ష జనాభాకు 42 ఏటీఎంలు ఉండాలని ఐక్య రాజ్య సమితి ఇప్పటికే నిర్ధేశించింది. పైన పేర్కొన్న గణాంకాలను బట్టి చూస్తే.. ప్రస్తుతం ప్రతి ఒక లక్ష జనాభాకు ఏపీలో 23, తెలంగాణలో 29 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అభివృద్ధిలో ఏటీఎంల పాత్రను ఐక్య రాజ్య సమితి నొక్కి చెబుతున్నందున కనీసం సరైన లెక్కలనైనా పొందుపర్చుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాంకర్ల సమితి సమావేశాలకు ఎంపీలు, మంత్రులు హాజరయ్యి ఇటువంటి అంశాలను సమీక్షించినప్పుడే బ్యాంకులు అప్రమత్తంగా వ్యవహరిస్తాయి.