బురుజు.కాం Buruju.com : అర్ధ రూపాయి నాణేలు భవిష్యత్తులో కాసులు కురిపించొచ్చు. ఇప్పటికే కొన్ని రకాల డిజైన్లతో ఉండే ఒక్కో నాణెం ఖరీదు రూ.60వేలుగా ఆన్ లైన్ బజారు వెబ్ సైట్లలో కనిపిస్తోంది. అందువల్ల ఎవరివద్దనైనా ఇవి ఉన్నట్లైతే.. రానున్న రోజుల్లో వారే.. ఓఎల్ఎక్స్ వంటి వాటి ద్వారా మంచి ధరకు విక్రయించుకోవచ్చు. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఇటీవల బ్యాంకులకు వెలువరించిన ఉత్తర్వులను పరిశీలిస్తే.. త్వరలో 50 పైసల నాణేలు అధికారికంగా రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
1985 నాటి 50 పైసల నాణెం ఇటువంటి డిజైనుతో ఉన్నవి చాలా అరుదట. అందుకే దీని ధర రూ.60వేలుగా ఒక వెబ్ సైటులో కనిపిస్తోంది.
అర్ధ రూపాయి నాణెం 50 paise coin తొలుత 1957లో వెలువడింది. 2016 తర్వాత వాటి తయారీ, పంపిణీ నిలిచిపోయాయి.
ప్రజల వద్ద గల 50 పైసల నాణెంతో సహా ఒక రూపాయి, రెండు రూపాయిల నాణేలు, నోట్లు చెల్లుబాటులో ఉన్నట్టుగా రిజర్వు బ్యాంకు ఇటీవల ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ఎవరైనా 50 పైసల నాణేలను తీసుకొస్తే వాటిని బ్యాంకులు తీసుకోవాలని సూచించిందే తప్ప.. తిరిగి వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పలేదు. దీంతో 2011లో రద్దయిన 25 పైసలు నాణెం మాదిరిగానే త్వరలో అర్ధ రూపాయి సైతం చెలామణీ నుంచి అధికారికంగా వైదొలగవచ్చని స్పష్టమవుతోంది. ప్రజలు ఒక రూపాయి, రెండు రూపాయిల నాణేలను తెచ్చినప్పుడు మాత్రం వాటిని వంద చొప్పన కవర్లలో వేసి తూకం పద్దతిలో తీసుకొని, తిరిగి వాటిని అవసరమైన వారికి ఇవ్వాలని ఆర్బీఐ చెప్పింది.
50 పైసల నాణేలు ఉంటే.. వాటిని బ్యాంకులకు ఇచ్చేయకుండా ఇంటి అటకలపై దాచుకొంటే అవీ పిల్లలకు ఆస్తిగా మారవచ్చు
చెలామణీ నుంచి వైదొలగిన నాణేలను భద్రపర్చుకొంటే భవిష్యత్తులో అవి అమూల్యమైనవాటిగా మారవచ్చు. నాణేల సేకరణపై ఆసక్తిగల వారు వాటిని అపురూపంగా పరిగణిస్తారు. కొన్నేళ్ల క్రితం వరకు మనుగడలో ఉన్న ఒక పైస, రెండు పైసలు, మూడు పైసలు, అయిదు పైసలు, పది పైసలు, 25 పైసలు నాణేలు ప్రస్తుతం మంచి ధరలకు అమ్ముడవుతున్నాయి. విశేషమేమిటంటే.. అర్ధ రూపాయి ఇంకా అధికారికంగా రద్దు కాకున్నా.. వాటి తయారీ సంవత్సరం, డిజైన్ వంటి వాటి ఆధారంగా నాణేల ప్రియులను బాగా ఆకట్టుకొంటున్నాయి. 1972 నాటి సిల్వర్ రంగు నాణేన్ని రూ.30 వేలకు అమ్ముతానంటూ ఒకాయన ఓఎల్ఎక్స్ లో పెట్టగా.. 1979 నాటి నాణెం ఫ్లిప్ కార్టులో రూ.15వేలు పలుకుతోంది. 2015లో కలకత్తా మింట్ లో తయారైన 50పైసల నాణేలు వంద గల ప్యాకెట్టును రూ. 879 కి ఇస్తామని కాయిన్ బజారులో ఒక సంస్థ ప్రకటించింది. 1974 నాటి బి మింట్ మార్కుతో ఉన్న నాణెం ధర ఒక్కోటి రూ.1,750 గా కాయిన్ బజారులో కనిపిస్తోంది. అందువల్ల 50 పైసల నాణేలను సేకరించి భద్రపర్చుకొంటే భవిష్యత్తులో అవి కాసులు కురిపించొచ్చు.