అల్లూరిని చంపిన గుడాల్.. సెలవుపై ఎందుకు వెళ్లినట్టు? (మూడో భాగం)
personBuruju Editor date_rangeMon Nov 20 2023 00:00:00 GMT+0530 (India Standard Time)
అల్లూరిని బంధించినట్టు బ్రిటీష్ నివేదిక చెబుతోంది. ఆయన తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేసినట్టూ అదే నివేదిక పేర్కొంటోంది. ఆయన ఎలా తప్పించుకొని పారిపోగలడని ఇప్పటికైనా బ్రిటన్ ను నిలదీయగలగాలి
బురుజు Buruju.com : Hyderabad ( అల్లూరి సీతారామ రాజును Alluri Seetha Rama Raju చెట్టుకు కట్టి కాల్చివేసిన నాటి బ్రిటీష్ అధికారులు.. 1925 మద్రాసు ప్రెసిడెన్సీ పరిపాలన నివేదికల్లో మాత్రం ఆయన తప్పించుకొని పారిపోతుంటే కాల్చివేసినట్టుగా స్పష్టంగా రాశారు. ఇది కట్టుకథ అని నిరూపించేందుకు ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని సూచిస్తూ Buruju.com అందిస్తున్న కథనాల్లో ఇది మూడోవది) అల్లూరి సీతారామ రాజును హతమార్చిన బ్రిటీష్ అధికారులు కొంత కాలం సెలవుపై వెళ్లారు. అనంతరం కొందరు అధికారులకు నాటి బిటీష్ ప్రభుత్వం బహుమతులను అందజేసింది. అల్లూరి .. బ్రిటీష్ సేనల కళ్లుగప్పి పారిపోతుంటే ఆయన్ని 1924 మే 8వ తేదీన కాల్చి చంపినట్టుగా అదే నెల 16వ తేదీన నాటి ప్రభుత్వం ప్రకటించింది. ఆయన నిజంగా పోలీసుల కళ్లు గప్పి పారిపోవటానికి ప్రయత్నిస్తే అందుకు అధికారుల నిర్లక్ష్యం కారణమవుతుంది కనుక వారిపై చర్యలు తీసుకోకుండా బహుమతులు ఇవ్వటమేమిటి? సెలవులు మంజూరు చేయటమేమిటి? నాటి మన నేతలు అప్పట్లోనే గట్టిగా ప్రశ్నించుంటే.. సీతారామ రాజు అసలు పారిపోయే ప్రయత్నం చేయలేదని, ఆయన్ని చెట్టుకు కట్టి కాల్చివేసిన బ్రిటీష్ అధికారులు.. తమ తప్పులు కప్పిపుచ్చుకోవటానికే ఇటువంటి నాటకం ఆడారని బయటపడి ఉండేది. మన నేతలు ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తటానికి రాజు మరణం తర్వాత రెండు నుంచి మూడేళ్ల సమయం పట్టింది.
అల్లూరిని కాల్చివేయటంపై బ్రిటీష్ పాలకులను నిలదీస్తూ 1928లో భోగరాజు పట్టాభిసీతారామయ్య, మద్దూరి అన్నపూర్ణయ్య.. ‘ఆంధ్రభారతి’లో రాసిన వ్యాసాలు
లొంగిపోయిన అల్లూరి సీతారామరాజును చెట్టుకు కట్టి నిర్ధాక్షణ్యంగా కాల్చిచంపిది.. మేజర్ గుడాల్. ఇలా హతమార్చిన తర్వాత ఆయన సెలవుపై వెళ్లిన సంగతి చాలా మందికి తెలియదు. ‘సెలవుపై ఎందుకు వెళ్లినట్టు’ అంటూ స్వాతంత్య్ర సమరయోధులు భోగరాజు పట్టాభి సీతారామయ్య 1928, జూన్ నెల ‘ఆంధ్రభారతి’ పత్రికలో రాసిన వ్యాసం ‘ బురుజు’కు లభించింది. ఆయన మరణం తనను మూడేళ్లగా వేధిస్తోందంటూ బ్రిటీష్ అధికారులపై ఆయన సంధించిన పలు ప్రశ్నలు.. మరికొన్ని వాస్తవాలను తెరపైకి తెచ్చేవిగా ఉన్నాయి. రాజు మరణంపై వ్యక్తమవుతున్న సందేహాలకు సమాధానాలు దొరకకుండా ఉండటం కోసమే గుడాల్, మరికొందరు అధికారులు సెలవుపై వెళ్లిపోయారా? అని పట్టాభి సీతారామయ్య ఆ వ్యాసంలో నిలదీశారు. నిజంగా సీతారామరాజు పారిపోతూ ఉండగా కాల్చి చంపితే ఇలా గుడాల్ తో సహా కొందరు అధికారులు సెలవులపై వెళ్లనవసరం లేదనేది ఆయన భావన. ఇదే వ్యాసంలో ఆయన ఇంకా ఇలా ప్రశ్నించారు.. ‘‘పారిపోవు వానిని తుపాకీతో కొట్టినచో గాయములు కాలిమీద తగులవలసి ఉండెనుకదా? ప్రాణములు ఎట్లా పోయెను? తప్పించుకొని పారిపోయే వానిని ఒకటి రెండు గుండ్లతో అశక్తుడుగా చేయలేని దళమా రాజుతో యుద్ధము సలుపునది? రాజు పట్టుపడిన పిదప పారిపోవ ప్రయత్నించగా తుపాకీతో కాల్చి చంపితిమని విశాఖపట్నంలోని అధికారులు మద్రాసు ప్రభుత్వానికి 1924, మే 16వ తేదీన తెలిపారు. అయితే హత్య జరిగినది ఎప్పుడు? మే 7వతేదీనా? దహనమెప్పుడు? మే 8వ తేదీ కాబట్టి 11 రోజుల్లో ఏమి జరిగి ఉండవలెను? ఈ లోపుగానే ప్రజలలో ఆందోళన కలగకుండా 9,10 తేదీల్లో ఒక సబ్ ఇనస్పెక్టరు.. ఇనస్పెక్టర్ ఆఫ్ పోలీసుకు పలానా విధంగా పట్టుబడి మరణించెనని తంతి వార్త ఇచ్చినట్టు పత్రికా ముఖంగా తెలపబడింది. అతను మృతి చెందిన వార్తను 60 రూపాయల జీతంగల ఉద్యోగి ప్రైవేటు తంతి మూలంగా ఏల ప్రకటించవలసి వచ్చింది? ఇది సరే.. రాజును తుపాకీతో కొట్టి చంపిరి కదా? అతని శవము గూర్చి విచారణ జరిపించారా? సివిల్ లా ప్రకారం ఇట్టి పరీక్ష అనివార్యంకదా? ఇంతవరకు శాసన సభలో ఒక్క ప్రశ్న వేయకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజు సహజ మరణం పొందెనని వీరి తలంపా? లేక సర్ ఆర్ధర్ నాప్ గారి పాలనలో లోటు లేదని వీరి ఊహనా? రాజే విచారించబడి లోతుపాతులను అతని ముఖత: అతను వెల్లడి చేసినచో బ్రిటీష్ ప్రభుత్వం వారి ప్రయత్నం వెల్లడి అయ్యేది’’ అని భోగరాజు పట్టాభి సీతారామయ్య రాశారు.
అల్లూరిని హతమార్చిన 1924లో నాటి గవర్నరు మద్రాసులో పర్యటిస్తున్నప్పటి చిత్రం
అల్లూరిని కాల్చిచంపిన 1924లో పలువురు పోలీసు అధికారులకు బ్రిటీష్ ప్రభుత్వం బహుమతులను అందజేసింది. బహుమతుల విషయాన్ని మన నేతలు 1926లో తేవనెత్తారు. ‘కొందరు అధికారులకు బహుమతులను ఎందుకు ఇచ్చారు? అల్లూరిని పట్టుకొన్నందుకా? లేక కాల్చి చంపినందుకా?’ అంటూ మద్రాసులోని శాసన మండలిలో మన నాయకులు 1926లో ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వ న్యాయశాఖ సభ్యుడు సమాధానం ఇచ్చారని, రాజును పట్టుకొన్నందుకే బహుమతులను ఇచ్చామని ఆయన చెప్పారని అప్పట్లో రాజమహేంద్రవరం నుంచి వెలువడ్డ ‘కాంగ్రెస్’ పత్రిక పేర్కొంది. ‘‘ దీనిని బట్టి సీతారామరాజు పట్టుపడెనని స్పష్టమవుతోంది. మరి నిర్భందంలో ఉన్న వ్యక్తిని కాల్చవలసిన అవసరం ఏమొచ్చింది? దీనికి సమాధానం కావాలి, అలాగే శవపంచనామా ఎవరు చేశారు? దాని ఫలితాలు ఏమిటి? అనేది కూడా ప్రభుత్వం చెప్పాలి’’ అంటూ కాంగ్రెస్ పత్రిక నిలదీసింది. పత్రికలు, కొందరు ప్రజా ప్రతినిధులు ప్రశ్నించినా బ్రిటీష్ పాలకులు మాత్రం సమాధానాలను ఇవ్వలేదు.
స్మారక మందిరాల నిర్మాణంతో పాటు నిజాల నిగ్గు తేల్చాలి
అల్లూరిని కాల్చిచంపిన 1924 నాటి మద్రస్ ప్రెసిడెన్సీ పరిపాలన నివేదికను ‘బురుజు.కాం’ పరిశీలించగా.. ఆ ఏడాది పోలీసు అధికారులకు వివిధ రకాల బహుమతులు, బిరుదులు, నగదు పురస్కారాలు, పదోన్నతులను కల్పించినట్టు వెల్లడయ్యింది. నివేదిలోని వివరాల ప్రకారం.. బ్రిటీష్ ప్రభుత్వం ఆ ఏడాది మద్రాసు ప్రెసిడెన్సీ మొత్తం మీద 3,933 మందికి నగదు పురస్కారాలుగా రూ.26,873 పంచింది. ఎనమండుగురికి కింగ్స్ పోలీస్ మెడల్స్ ను ఇచ్చింది. ఒకరికి బహుదూర్, మరొకరికి ఖాన్ సాహెబ్, ఇద్దరికి రావు సాహెబ్, ఒకరికి ఎంబీఈ బిరుదులను ఇచ్చి సత్కరించింది. పురస్కారాలు అందుకొన్న అందరికీ పదోన్నతులను కల్పించనున్నట్టు అదే నివేదికలో వెల్లడించారు. రాజును పట్టుకొన్నందుకు బహుమతులను ఇచ్చినట్టుగా శాసన మండలిలో న్యాయ శాఖ సభ్యుడు సమాధానం ఇచ్చినందున.. పై పురష్కారాలను అందుకొన్న వారి జాబితాలో నాటి ప్రత్యేక కమిషనర్ రూథరఫర్డ్ , మేజర్ గుడాల్ , ఇనస్పెక్టర్ ఆళ్వారు నాయుడు తదితరులు తప్పక ఉంటారు.