personBuruju Editor date_rangeSun Dec 10 2023 00:00:00 GMT+0530 (India Standard Time)
అండమాన్ జైలులో ఆనాడు బ్రిటీష్ వారు ఖైదీలను దారుణంగా హింసేవారని తెలియజెప్పుతున్న ప్రతిమలు
బురుజు Buruju.com : Hyderabad ( అల్లూరి శ్రీరామరాజు Alluri Seetarama Raju తమ అధీనం నుంచి తప్పించుకొని పారిపోతుంటే కాల్చివేశామని 1925 నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ పాలన నివేదికలో బ్రిటీష్ ప్రభుత్వం పేర్కొంది. గిరిజనులపై బ్రిటీష్ పోలీసుల దమనకాండను చూడలేక.. రామరాజే స్వయంగా లొంగిపోగా.. బ్రిటీష్ ప్రభుత్వం మాత్రం కట్టుకథ అల్లింది. పారిపోయాడని రాయటం ఆయనకు తీవ్ర అవమానం. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసి వివిధ రికార్డుల ఆధారంగా నిజాల నిగ్గు తేల్చాలని సూచిస్తూ.. బురుజు.కాం Buruju.com అందిస్తున్న కథనాల్లో ఇది అయిదోవది )
అల్లూరి సీతారామరాజుకే కాదు.. ప్రధాన అనుచరుడైన అగ్గిరాజుకూ మనం తీవ్ర అన్యాయం చేశాం. బ్రిటీష్ సేనలు చిత్రహింసలు పెట్టి.. అతను ఏమయ్యిందీ తెలియకుండా చేస్తే .. ఏళ్ల తరబడి ఎవరూ అతని గురించి పట్టించుకోలేదు. ఏ పత్రికా ఆయన విషయాన్ని లేవనెత్తలేదు. అసలు సీతారామరాజు కంటే ఒక రోజు ముందు చిక్కిన అగ్గిరాజుకు సంబంధించీ పెద్ద మిస్టరీ నెలకొంది. బ్రిటీష్ సేనలకు చిక్కిన తర్వాత అతని గురించి ప్రజలు పట్టించుకోకపోవటానికి కారణం..అతను పోలీసుల గూఢచారిగా వ్యవహరించాడనే అపవాదు. అందుకు తోడు .. దుందుడుకు స్వభావం. ఆయన తొందరపాటు చర్యల వల్లనే మన్యం ప్రజల్లో తిరుగుబాటుదారుల పట్ల విముఖత భావం ఏర్పడిందని ప్రజలు భావిస్తూ వచ్చారని కొందరు గ్రంధకర్తలు రాశారు. అయితే ఇదంతా నిజంకాదని నాటి కొన్ని రికార్డులను బట్టి తేలుతోంది. . దొరికిన వెంటనే అగ్గిరాజును అండమానుకు తరలించారని, అయితే విషయం అత్యంత రహస్యమైనదిగా (క్లోజ్లీ గార్డెడ్ సీక్రెట్ )గా బ్రిటీష్ ప్రభుత్వం రికార్డుల్లో పేర్కొందని ‘ఏపీ పోలీసు హిస్టరీ-1861-1961’ అనే గ్రంధంలో వివరించారు. ఇది 1961లో వెలువడింది.
అగ్గిరాజును నిర్భందించిన అండమాన్ లోని సెల్యూలర్ జైలు. ఆయన అక్కడే చనిపోయాడని బ్రిటీష్ ప్రభుత్వం 1936లో ఎన్.జి. రంగా ప్రశ్నకు సమాధానంగా చెప్పింది
అగ్గిరాజు బ్రిటీష్ సేనలకు చిక్కిన 11 ఏళ్లకు.. అంటే 1936లో నాటి ప్రజా ప్రతినిధి ఎన్జీ రంగా.. చట్ట సభలో ఆయన గురించి ప్రశ్నించారు. అగ్గిరాజు చనిపోయారని ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. చనిపోయిన విషయాన్ని గోదావరి జిల్లా కలెక్టరుకు అప్పట్లోనే తెలియజేశామని పేర్కొంది. అది పచ్చి అబద్దం. ఎందుకంటే.. మరణ వార్తను అగ్గిరాజు స్వగ్రామానికి చెందిన మునుసబుకు కాని, ప్రజలకు కాని చేరనేలేదని అప్పటి పత్రికలు రాశాయి. అసలు అగ్గిరాజు మరణించిన విషయం గ్రామస్తులకు తెలిసుంటే ‘ అగ్గిరాజు ఏమయ్యారు? ’ అంటూ ఎన్జీ రంగా గారు శాసన మండలిలో ప్రశ్న వేసే ఉండేవారు కాదుకదా? అగ్గిరాజు.. అండమాన్ జైలులో చనిపోయినట్టు అల్లూరి అనుచరుడు ఎండు పడాలు 1977లో తన ఆకాశవాణి ఇంటర్వ్యూలోను తెలిపారు. అగ్గిరాజును అండమాన్ జైలుకు తెచ్చినప్పుడు ఆయనకు 40 ఏళ్లు ఉంటాయని ఎండు పడాలు పేర్కొన్నారు. అగ్గిరాజును అరెస్టు చేయటం, అండమాన్ జైలుకు తరలించటం వాస్తవమే అయినప్పుడు ఈ వ్యవహారాలను తొలుత ‘అత్యంత రహస్య’ విషయంగా బ్రిటీష్ అధికారులు పరిగణించాల్సిన అవసరం ఎందుకొచ్చినట్టో ఇప్పుడు తెలుసుకోగలిగితే సీతారామరాజు మరణానికి సంబంధించి కొన్ని కొత్త విషయాలు వెలుగు చూడగలుగుతాయి. సీతారామరాజును నిర్ధాక్ష్యణ్యంగా కాల్చివేసిన విషయం అగ్గిరాజుకు తెలుసని భావించినందునే బ్రిటీష్ అధికారులు అతని అరెస్టును దాచిపెట్టారా? అగ్గిరాజు..1924, మే 6వ తేదీన పోలీసులకు చిక్కగా.. బ్రిటీష్ సర్కారు ప్రకటన ప్రకారం.. ఆ మరుసటి రోజునే సీతారామరాజు పట్టుపడ్డాడు.
1924, మే 6వ తేదీన అల్లూరి శ్రీరామరాజు తదుపరి స్థానంలో ఉండే అతి ముఖ్యమైన తిరుగుబాటు నాయకుడు సూర్యనారాయణ రాజును (అగ్గిరాజు) పట్టుకొన్నట్టుగా మద్రాసు ప్రెసిడెన్సీ నివేదికలో బ్రిటీష్ ప్రభుత్వం పేర్కొంది . ఆ మరుసటి రోజునే శ్రీరామరాజునూ బంధించినట్టూ తెలిపింది
అగ్గిరాజు కూడా యువకునిగానే పోరాటంలోకి వచ్చాడు. సీతారామరాజు వెంట నడిచిన వారంతా గిరిజనులు కాగా.. ఈయన ఒక్కరే గిరిజనేతరుడు. అసలు పేరు.. వేగిరాజు సత్యనారాయణ రాజు అని కొన్ని చోట్ల, పేరచర్ల సూర్యనారాయణ రాజు అని మరికొందరు తమ గ్రంధాల్లో రాశారు. రికార్డులను ప్రస్తావిస్తూ రాసిన ‘మన్యం రెబేలియన్’ గ్రంధంలో.. వేగిరాజు నారాయణ రాజు అని పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం దగ్గర గల కుముదవెల్లి అయిన స్వగ్రామం. చిత్ర హింసలు పెట్టటం వల్లనే ఆయన కొంత కాలానికి మరణించారా? మరేమైనా కారణాలు ఉన్నాయా? అని తెలుసుకోవాలంటే అండమాను జైలులోని నాటి రికార్డులను పరిశీలించాలి. సీతారామ రాజు మరణ కారణాలను తెలుసుకోవటం ఇప్పుడు ఎంత ముఖ్యమో.. మరో నిస్వార్ధపరుడైన అగ్గిరాజు వీరత్వం గురించీ ప్రజలకు తెలియజేయటమూ అంతే ముఖ్యం. ఎందువల్ల నంటే.. ఆయన బ్రిటీష్ వారికి గూఢచారిగా వ్యవహరిస్తూ విప్లవ యోధుల్లో కలహాలు పెట్టేవారని ప్రచారంలోకి వచ్చింది. ఆయన ఏమయ్యిందీ 1936వరకు ఎవరూ పట్టించుకోకపోవటానికి ఇదో కారణం. గ్రంధ కర్తలు సైతం అల్లూరి తల్లిని, సోదరిని, సోదరుడిని కలసి వివరాలను సేకరించేవారే తప్ప అగ్గిరాజు కుటుంబీకులను కలసినట్టుగా ఎక్కడా రాయలేదు. అందుకే ఆయన అసలు పేరును సైతం సరిగ్గా చెప్పలేని దుస్థితిలో ఉన్నాము.
1936లో అగ్గిరాజు గురించి మద్రాసులోని శాసన మండలిలో ప్రశ్నించిన ఆచార్య ఎన్జీరంగా. ఆయన అడగటం వల్లనే అగ్గిరాజు చనిపోయాడన్న విషయం బయటపడింది
అగ్గిరాజు ఏడాది కాలం పాటు సీతారామరాజు వెంట ఉండి బ్రిటీష్ వారిపై పోరాడారు. ఆయన పట్టుపడినప్పుడు అతని వద్ద 303 రైఫిల్, 12 రౌండ్ల మందు గుండు లభించినట్టు బ్రిటీష్ రికార్డులో ఉంది. సీతారామ రాజు అనుచరులు ఒక సారి బ్రిటీష్ పోలీసులను అటకాయించగా.. వారి నుంచి రెండు రొట్టెలను మాత్రం సీతారామరాజు తీసుకొన్నారు. తన సహచరుడు అగ్గిరాజు జ్వరంతో బాధపడుతున్నందునే రొట్టెలను తీసుకొన్నానని, అందుకు ప్రతిగా తాను గంపెడు మామిడి పండ్లను పంపుతున్నానని, పొలీస్ విభాగాధిపతి పీటరుసన్ కు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నాడు. అగ్గిరాజుపై సీతారామరాజుకు ఎనలేని విశ్వాసం ఉండబట్టే పట్టపడే సమయంలో కూడా అతనితోనే ఉన్నాడు. అందువల్ల అగ్గిరాజు బ్రిటీష్ వారికి గూడఛారి అనేది నిజంకాదని తేలుతున్నప్పటికీ దీనిపై మరింత స్పష్టతను అధికారికంగా వెల్లడిచేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆయన నిస్వార్ధ దేశ సేవకు, ప్రాణ త్యాగానికి సార్ధకత ఉంటుంది .