భారీ సంఖ్యలో ఉన్న వయోధికులకు పింఛను ఇస్తే సరిపోతుందా?
personBuruju Editor date_range2023-03-10
పెద్దాయన ఎప్పుడో వెళ్లిపోగా.. నా అనే వారు లేక ఇలా దీనంగా చూస్తున్న వృద్ధులెందరో పలు చోట్ల కనిపిస్తుంటారు
బురుజు.కాంBuruju.com: వివిధ రాాష్ట్రాల్లో వయోధికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా వారికి సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక శాతం వయోధికులు గల రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకొన్న కేరళలో వారి కోసం చాలా చేయాల్సివుందంటూ 15వ ఆర్థిక సంఘం సూచించగా.. 76 శాతం మందికి వివిధ రకాల పింఛన్లు అందుతున్నాయంటూ అక్కడి ప్రభుత్వం కేంద్రానికి ఇటీవల సమాధాన మిచ్చింది. ఉభయ తెలుగు రాష్రాల ప్రభుత్వాలను అడిగినా ఇటువంటి జవాబే వస్తుంది. కేవలం పింఛన్లను ఇవ్వటంతోనే వారి సమస్యలన్నీ పరిష్కారమైపోవు. వయోధికులు పోషకాహారలోపంతో బాధపడుతున్నారని, చూసుకొనే వారు లేక గ్రామీణ వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంటోందని వంటి ఎన్నెన్నో చేదు నిజాలను పలు సర్వేలు వెల్లడిస్తున్నప్పటికీ వాటికి పరిష్కారాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు యోచించటమేలేదు. వయోధికులపై Buruju.com అందిస్తున్న మొదటి కథనం ఇది.
పిల్లలు వలస వెళ్లిపోతుండటంతో గ్రామాల్లో ఒంటరిగా మిగిలి పోతున్న వయోధికులు. సమీప భవిష్యత్తులో గ్రామాల్లో 70 శాతం మేర ఇటువంటి వృద్దులే కనిపించనున్నట్టు సర్వేలు చెబుతున్నాయి
కేరళ మొత్తం జనాబా 2011 నాటికి 3.34 కోట్లు కాగా వారిలో 64.46 లక్షల మంది ( 19శాతం) వయోధికులు ఉన్నారు. దీంతో వీరిపై కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలంటూ 15వ ఆర్థిక సంఘం కొన్ని నెలల క్రితం సూచించింది. తమ రాష్ట్రంలోని వయోధికుల్లో 76 శాతం మందికి వివిధ రకాల పింఛన్లు నెలవారీ అందుతున్నట్టుగా అక్కడి ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి సమాధానమిచ్చినట్టుగా రిజర్వు బ్యాంకు తాజాగా విడుదల చేసిన ‘రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి’ నివేదికలో వెల్లడించింది. కేవలం నెలకు రూ. రెండు వేల పింఛను ఇవ్వటంతోనే వయోధికుల సమస్యలన్నీ పరిష్కారమైపోయితున్నట్టుగా తెలుగు రాష్ట్రాలు సైతం భావిస్తుండట వల్ల కాబోలు.. ఇక్కడా వారికోసం ప్రత్యేక పథకాలంటూ ఏవీ కనిపించటమేలేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోను 2026 నాటికి మొత్తం జనాభాలో వయోధికులు 14.2 శాతం మేర ఉంటారని అంచనా. వీరి సంఖ్య 2011లో 10.5 శాతం ఉండేది.
వయోధికులు ఇలా వైద్యం తదితర వసతులను కల్పించాలంటూ ప్లకార్డులను పట్టుకొని రోడ్లపైకి రావాల్సిన దుస్థితి ఉత్పన్నం కాకుండా ప్రభుత్వాలు వివిధ పథకాలను అమల్లోకి తేవాలి
వయోధికులకు ఆర్థిక భద్రత, ఆహారం, ఆరోగ్యం, గౌరవం వంటి అంశాల మేళవింపుతో జాతీయ కార్యాచరణ ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం ఏటా రూపొందిస్తున్నప్పటికీ వాటికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు స్పందించటమే లేదు. జాతీయ ప్రణాళికను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రాలూ సొంత ప్రణాళికలు తయారు చేసుకోవాలని కేంద్రం చెబుతోంది. వృద్ధాశ్రమాల నిర్వహణ వంటి వాటికి కొంత మేర గ్రాంటులను కేంద్రం ఇస్తున్నా తెలుగు రాష్ట్రాలు వాటినీ పూర్తి స్థాయిలో వినియోగించుకోవటంలేదు.
వయోధికుల సేంక్షేమం కోసం ముందుకొచ్చే స్వచ్ఛంద సేవా సంస్థలను రాష్ట్రాలు ప్రోత్సహించాలి
కేంద్ర 2020-21 కార్యాచరణ ప్రణాళిక ప్రకారం.. వివిధ వర్గాల వారి నుంచి ఔషధాలను సేకరించి వాటితో మెడికల్ బ్యాంకులను రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి. అవసరమైన వయోధికులకు ఆయా బ్యాంకుల నుంచి మందులను ఉచితంగా అందజేయాలి . వయోధికుల్లో 80 ఏళ్లు దాటినవారి పరిస్థితి మరీ దయనీయంగా ఉండబోతోంది. వృద్దులు.. వాహనాల్లో ప్రయాణించి పట్టణాల వరకు రావటం చాలా కష్టం కనుక వారి కోసం సంచార వైద్య శాలల్ని ఏర్పాటు చేయాలి. సంచార వైద్య శాలల్లో హోమియోపతి, ఆయుర్వేదం వైద్యాలకూ స్థానం కల్పించాలి. వీటిని నిర్వహించేవారికి గ్రాంటులను అందజేయాలి. రోజువారీ (డే కేర్) సంరక్షణ, ఆరోగ్య రక్షణ కేంద్రాల కోసం నిధులను మంజూరు చేయాలి ( రెండో భాగం వచ్చేవారం)