బురుజు.కాం Buruju.com : Hyderabad: శ్రీకాంత్ నటించిన ‘కోట బొమ్మాళి’ Kota bommali చిత్రం నవంబరు 24న థియేటర్లలో విడుదలయ్యి సినిమా బాగుందనే మెచ్చుకోళ్లను సొంతం చేసుకొంది. దీంతో చాలా రోజుల తర్వాత శ్రీకాంత్ విజయాన్ని చవి చూశారనే చెప్పాలి. మలయాళంలో విజయవంతమైన ‘నయట్టు’ను రేమేక్ చేసి కోటబొమ్మాళి అనే పేరు పెట్టటంతోనే దానికి స్థానికత వచ్చింది. సినిమా పేరు వెలువడింది మొదలు కొని అసలు కోట బొమ్మాళి ఎక్కడుంది? దానికి ఆ పేరు ఎలా వచ్చింది తెలుసుకోవాలనే ఆసక్తి సినీ అభిమానుల్లో ఏర్పడింది. అనుష్క నటించిన ‘అరుంధతి’ సినిమా ద్వారా బొమ్మాళి అనే పదం బాగా ప్రచారంలోకి రావటం కూడా ఇందుకోకారణం. కోట బొమ్మాళికి ఊరుకు సంబంధించి Buruju.com అందిస్తున్న కథనం ఇది.
శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి గ్రామం
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళానికి దాదాపు 40 కిలో మీటర్ల దూరంలో గల మండల కేంద్రమే కోటబొమ్మాళి. గ్రామ నామాల పరిశోధకులు ఎ.విజయ దత్తాత్రేయ శర్మ 1983లో ‘ భారతి’ పత్రికలో రాసిన వివరాల ప్రకారం.. టెక్కలి రాజుల్లో ఒక రైన వనమాలి పేరుతో ఏర్పాటయ్యిందే ప్రస్తుత కోట బొమ్మాళి. అదెలా అంటే.. తన రాజ్యంలో ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసి దానికి ‘వనమాలి కోట’ అని పేరు పెట్టాడు. క్రమేనా అది గోట వనమాలి అయ్యింది. ఇది ఒడిశాకు దగ్గరగా ఉంటుంది కనుక అక్కడ ఒరియా భాష ప్రభావం ఎక్కువ. తెలుగులోని ‘ప’కారం ఒరియాలో ‘బ’కారం అవుతుంది. అందువల్ల వనమాలి కాస్త బనమాలి అయ్యి.. క్రమేనా ప్రజల ఉచ్ఛారణలో అది ‘బొమ్మాళి’గా మారింది. అలా కోట బొమ్మాళిగా స్థిరపడింది. మరో విశేషమేమిటంటే ఇదే జిల్లాలో సంత బొమ్మాళి అనే మరో మండల కేంద్రం ఉంది. దీనిని కూడా నాటి రాజు వనమాలే నిర్మించాడు. అప్పట్లో ఈ గ్రామం మంచి వ్యాపార ప్రాంతంగా ఉండేది. అన్ని రకాల వస్తువులు లభించే సంత జరిగేది కనుక అది సంత బొమ్మాళి అయ్యిందని దత్తాత్రేయ శర్మ తన వ్యాసంలో విశ్లేషించారు.
మలయాళ సినిమా నయట్టు.. తెలుగు సినిమా కోట బొమ్మాళి చిత్రాలు
ఘన విజయం సాధించిన 2009 నాటి ‘అరుధంతి’ కారణంగా బొమ్మాళి పదానికి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో విశేష ప్రచారం ఉంది. ఆ సినిమాలోని ‘నిన్నొదల బొమ్మాళి’ అనే డైలాగు తెలుగులో ఒక జాతీయంగాను మారిపోయి పత్రికల శీర్షికల్లో తరచు అది కనిపిస్తూనే ఉంది. ‘ బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ అనే సినిమా కూడా వచ్చింది. ప్రభాస్ నటించిన బిర్లా చిత్రంలోని ‘బొమ్మాళి.. బొమ్మాళి.. నిన్నొదలవొదల బొమ్మాళి’ అనే పాట సూపర్ హిట్ గా నిలిచింది.
మళయాల చిత్రం నయట్టు కథను రాసింది అక్కడి పోలీసు శాఖలోనే పనిచేస్తున్న షాహీ అనే ఉద్యోగి. ముగ్గురు పోలీసు ఉద్యోగులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవ శాత్తు ఒక రాజకీయ పార్టీకి చెందిన దళిత కార్యకర్తను ఢీకొనటం, అతను చనిపోగా అది తీవ్ర వివాదానికి దారితీసి ఆ ముగ్గురు పోలీసు ఉద్యోగులు తప్పించుకొని పారిపోవాల్సిన పరిస్థితులు ఉత్నన్నం కావటం సినిమా ఇతివృత్తం. పోలీసు, రాజకీయనాయకులకు మధ్య ఉండే సంఘర్షణను సినిమాలో చూపించారు.