personBuruju Editor date_rangeThu Nov 30 2023 00:00:00 GMT+0530 (India Standard Time)
అల్లూరిని హతమార్చిన కేడీ పేట వద్ద స్మారక చిహ్నం
బురుజు Buruju.com: Hyderabad అల్లూరి సీతారామరాజు Alluri Seetha Rama Raju మరణంపై ఏపీ ప్రభుత్వం ఒక కమిషన్ ను ఏర్పాటు చేసి నిజాల నిగ్గుతేల్చాలని సూచిస్తూ బురుజు అందిస్తున్న కథనాల్లో ఇది రెండోవది) సీతారామరాజు.. పోలీసు కస్టడీ నుంచి 1924, మే 8వ తేదీన తప్పించుకొని పారిపోతుంటే కాల్చివేసినట్టు బ్రిటీష్ ప్రభుత్వం అదే నెల 16వ తేదీన అధికారికంగా ప్రకటించింది. అల్లూరి మరణించారంటేనే విశ్వసించని ప్రజానీకం.. ఆయన తప్పించుకొని పారిపోతుండగా కాల్చివేశామంటూ చెప్పటంతో అల్లూరి నిజంగానే తప్పించుకొని ఎక్కడో సజీవంగా ఉన్నారేమోనని కొందరు భావించారు. అల్లూరికి బదులుగా బ్రిటీష్ సైనికులు వేరొకరిని కాల్చివేసి ఉండొచ్చనే అంచనాకు వచ్చి.. ఏనాటికైనా అల్లూరి తిరిగి ప్రత్యక్షమవుతాడని మరికొందరు ఎదురు చూస్తూ వచ్చారు. ఆయన మరణంపై నాటి కొన్ని పత్రికలు లేవనెత్తిన సందేహాలకు బ్రిటీష్ ప్రభుత్వం సమాధానాలు ఇవ్వలేదు. నాటి బ్రిటీష్ అధికారుల ఇటువంటి వైఖరి కారణంగానే బ్రిటీష్ వారు బయటపెట్టిన మృత దేహం ఫొటో అసలు అల్లూరి సీతారామరాజుది కానేకాదంటూ అప్పట్లో రాజమండ్రీ నుంచి వెలువడిన ‘కాంగ్రెస్’ ప్రతిక ఘాటుగా రాయగలిగింది.
పట్టుబడిన తర్వాత పారిపోతుండగా అల్లూరిని కాల్చివేసినట్టుగా 1924 నాటి మద్రాస్ ప్రెసిడెన్సి పరిపాలన నివేదికలో నాటి ప్రభుత్వం పేర్కొంది. అల్లూరి 1924, మే7వ తేదీన పట్టుపడ్డాడని వెల్లడించినప్పటికీ ఎప్పుడు పారిపోయే ప్రయత్నం చేసింది, ఎప్పుడు కాల్చివేసిందీ ఈ నివేదికలో తెలపలేదు. నివేదికలోని 145వ పేజీలోని 10వ లైను నుంచి కేవలం నాలుగు లైన్లలోనే ఆయన గురించి చెప్పి ఆయన మరణం తర్వాత గ్రామస్తులంతా తమకు సహకరిస్తూ వచ్చినట్టు రాసుకొన్నారు.
బ్రిటీష్ వారు విధించే జైలు శిక్షలను ఏమాత్రం లెక్కచేయకుండా స్వాతంత్య్ర ఆంకాక్షను నిర్భయంగా బహిర్గతం చేస్తూ వచ్చిన యువకిశోరం మద్దూరి అన్నపూర్ణయ్య.. ఆ ఫొటో రామరాజుది కానేకాదంటూ అప్పట్లో పేర్కొన్నారు. ఆయన ‘కాంగ్రెస్’ పత్రికకు సంపాదకులుగా ఉండేవారు. కాకినాడ పీఆర్ హైస్కూలులో. . సీతారామరాజు చదువుకొన్న సమయంలోనే ఆయనా చదివారు. పోలీస్ అధికారులు వెల్లడించిన ఫొటో రామరాజుది కాదంటూ అప్పటికే తన వద్ద గల ఆయన చిన్ననాటి ఫొటోతో సరిపోలుస్తూ అన్నపూర్ణయ్య 1926, జూలై 16వ తేదీ ప్రత్యేక సంచికలో కథనం రాశారు. అంతేకాదు.. కొందరు ప్రముఖుల అభిప్రాయాలనూ తన వాదనకు బలం చేకూరేలా ప్రచురించారు. ఆ సంచికను అల్లూరి సీతారామ రాజు జయంతి ప్రత్యేక సంచికగా వెలువరించారు. సీతారామ రాజుపై ప్రత్యేక సంచిక వెలువడుతున్నట్టుగా తెలుసుకొన్న పోలీసులు దానిని బయటకు రాకుండా చేయటానికి చాలా ప్రయత్నించారు. పత్రిక కార్యాలయంలో సోదాలను నిర్వహించారు. అనాడు ఏమి జరింగిందీ అదే పత్రికకు కొన్ని పర్యాయాలు సంపాదకుడిగా వ్యవహరించిన క్రొవ్విడి లింగరాజు తన ‘గౌతమి సత్యాగ్రహ ఆశ్రమం’ అనే గ్రంధంలో వెల్లడించారు. ‘‘ ఆ సంచికలో అల్లూరి చిన్ననాటి బొమ్మను, ప్రభుత్వం తాము చంపినట్టుగా ప్రకటించిన బొమ్మను అచ్చువేశాము. ఆ రెండు బొమ్మలు ఒకరివి కావని రుజువు చేసే శాస్త్రజ్ఞుల అభిప్రాయాలను ప్రకటించాము’’ అని పేర్కొన్నారు. అల్లూరి చనిపోయిన రెండేళ్లకు ఈ సంచిక వెలువడింది.
అల్లూరి జన్మించిన విశాఖ జిల్లా పాండ్రంగిలో నిర్మించిన స్మారక మందిరం గోడపై ఆయన జీవితంలోని ప్రధాన ఘట్టాలను ఇలా వివరించారు.
అల్లూరి పిరికి పందలా పారిపోతుంటే కాల్చిపడేశామనే ధోరణిలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటన ఉండటం వల్లనే అన్నపూర్ణయ్య ఇటువంటి కథనాలను రాయవలసి వచ్చినట్టుగా స్పష్టమవుతోంది. ఈ సంచిక వెలువడిన తర్వాత అన్నపూర్ణయ్యపై బ్రిటీష్ పాలకులు వివిధ రకాల కేసులను నమోదు చేసి కొంత కాలం ఖైదు చేశారు.అప్పట్లోనే ‘శారద’ పత్రిక ఇలా రాసింది.. ‘‘ సీతారామరాజు మరణం గురించి ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వం అతన్ని 7వ తేదీన పట్టుకొనినను 16వ తేదీ వరకు ఆవిషయాన్ని తెలపలేదు. అప్పుడైననూ.. పారిపోవుటకు ప్రయత్నించగా 8వ తేదీన కాల్చివేయబడెనని ప్రకటించారు. ఆ ఆలస్యానికి కారణం ఏమిటి? ఈ 9 రోజుల వ్యవధిలో కార్యరంగంలో ఉన్న అధికారులకు , ప్రభుత్వానికి మధ్య ఏమి ఉత్తర ప్రత్యుత్తరములు జరిగినవి? రాజు వంటి పెద్ద పితూరి నాయకుడు ప్రభుత్వ వశములో ఉండగా పోలీసు నిర్భందం నుంచి అతను ఎలా తప్పించుకొనుటకు ప్రయత్నించెను? ’’ అని నిలదీసింది.
హిందూ పత్రిక 1924, జూలై 24వ తేదీన ‘‘ సీతారామరాజు మరణించినాడా? అని గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అనుమానించుచున్నది’ అనే శీర్షికతో ఒక కథనం రాసింది. దీని ప్రకారం.. నాటి జిల్లా కాంగ్రెస్ కమిటీ సీతారామరాజు పోరాట మార్గాన్ని వ్యతిరేకిస్తూనే.. ఆయన దేశభక్తిని ప్రశంసిస్తూ ఒక తీర్మానం చేసి.. అంతలోనే అసలు ఆయన మరణించనేలేదని ప్రజలు అనుకొంటుంన్నందున తీర్మానం అనవసరమని భావించింది. చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకొంది. రాజు మరణంపై శాసన మండలిలో కొందరు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం గోడమీద పిల్లి వాటం మాదిరిగా జవాబు ఇచ్చిందని ‘హిందు’ పత్రిక విమర్శించింది. ప్రస్తుతం రాజు బతికి ఉన్నాడా? మరణించాడా? అనేది ముఖ్యం అని పేర్కొంది. రాజు పోరాటం చేసిన కాలంలో ఆయన పంథాను విమర్శించిన పత్రికలు.. ఆ తర్వాత మాత్రం కొంత గట్టిగానే ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నంచేసినా.. పాలకుల నుంచి సరైన సమాధానం లభించలేదు.