చక్రకేళి అరటిపళ్లు (2) రత్నదీప్ సూపర్ మార్కెట్టులో ప్యాక్ చేసి పెట్టిన చక్రకేళి అరటి పళ్లు
బురుజు.కాం Buruju.com: Hyderabad: మార్కెట్టులో లభించే వివిధ రకాల అరటి పళ్లలో ‘చక్రకేళి’ది ప్రత్యేక స్థానం. రుచి, పోషక విలువలు ఉండే దీని ధర మామూలు అరటి పళ్ల ధర కంటే చాలా ఎక్కువ. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల వారు ముఖ్యంగా .. కోస్తా ప్రాంతాల వారు దీనిని అమితంగా ఇష్టపడతారు. ఇటీవల హైదరాబాదులోను చక్రకేళి Chakrakeli, అమృతపాణి Amruthapani రకాలు విరివిగా అమ్ముడవుతున్నాయి. ఆ పేర్లకు అర్ధాలు ఆసక్తి కలిగిస్తాయి. కొన్ని గ్రంథాల ఆధారంగా చక్రకేళిపై బురుజు.కాం అందిస్తున్న కథనం ఇది.
హైదరాబాదులో విక్రయించే సాధారణ అరటి పండుతో పోలిస్తే చక్రకేళి పండు చిన్నదిగా ఉంటుంది. దీనిలో తియ్యదనం (శర్కర) ఎక్కువ. శర్కరే క్రమేణా చక్కర, చక్ర అయ్యిందని ‘మన తెలుగు తెలుసుకొందాము’ అనే గ్రంథంలో ద్వానా శాస్త్రి పేర్కొన్నారు. కేళి అనే పదానికి గల అర్ధం విషయంలో మాత్రం గ్రంథాల్లో భిన్నమైన అర్ధాలు కనిపించాయి. కదళీ నుంచి నుంచి కేళీ వచ్చిందని ద్వానా శాస్త్రి అభిప్రాయపడ్డారు. సంస్కృతంలో కదళీ ఫలం అంటే అరటి పండు. ‘‘చక్రకేళికి తొలుత ‘శర్కరా కదళ్ ’ గా పేరు ఉండేది. తర్వాత ప్రాకృతంలో ‘సక్కరా కమళ్’ అయ్యింది. తెలుగులో ‘చక్కెరకేళి’ కావాల్సింది ‘చక్రకేళి’ అయ్యింది’’ అని ద్వానా శాస్త్రి వివరించారు.
రకరకాల అరటి పళ్ల గెలలు
చక్రకేళిలోని ‘కేళి’ అనే మాట కేలు అనే పదం నుంచి వచ్చిందని ‘నామ విశ్లేషణ’ గ్రంథంలో రచయిత యార్లగడ్డ బాల గంగాధర రావు విశ్లేషించారు. కేలు అంటే చేయి అని అర్ధం. తన వివరణకు మద్దతుగా అరటి గెలలోని మరో మాటను ఆయన ప్రస్తావించారు. గెలలోని ఒక్కో అరటి పళ్ల గుత్తును హస్తం అని అంటారు. చెయ్యి, హస్తం ఒకే రకం మాటలు కనుక తన విశ్లేషణ సరైనదనే భావనను అయన వ్యక్తం చేశారు. చక్రకేళిలో ఇంకా కర్పూర చక్రకేళి, తెల్ల చక్రకేళి, ఎర్ర చక్రకేళి రకాలు కూడా ఉన్నాయి.
దశాబ్ధాల క్రితం కూడా చక్రకేళి ధర ఎక్కువగానే ఉండేది. ఆహార విజ్ఞానం అనే 1959 నాటి గ్రంథంలో అమృతపాణి ధర ఒక కాని కాగా చక్కెరకేళి శ్రేష్టమైనది కావటంతో దాని ధర అణా అని రాశారు. ఇప్పుడు హైదరాబాదులో ఒక్కో చక్కెరకేళి ధర రూ.15 పైనే ఉంటోంది. మొత్తం మీద చక్కర (తియ్యదనం) అధికంగా ఉండే పండుగా ఇది పేరుపడింది. అరటి పండ్లలో బూడిద బొంద, పచ్చఅరటి , కొమ్ము అరటి, మలబారు అరటి వంటి మరికొన్ని రకాలూ ఉన్నాయి. హైదరాబాదులో గతంలో పొడవు, ఒంపు ఉండే పచ్చఅరటి పళ్లు విరివిగా కనిపించేవి. అప్పుడు వాటి స్థానంలోని పసుపు రంగు అరటి వచ్చింది. వాటి మధ్య చక్రకేళి గెల మహారాణిలా కనిపిస్తుంది.