పవన్ కల్యాణ్ చెప్పినవి కొన్నే.. భార్యకు పర్యాయ పదాలు 50కి పైనే..
personBuruju Editor date_range2024-04-17
బురుజు.కాం Buruju.com : భార్యకు పర్యాయ పదాలు తెలుగు నిఘంటువుల్లో 50కి పైనే కనిపిస్తున్నాయి. తెలుగు కవుల కావ్యాల్లోని వర్ణనలను కూడా లెక్కలోకి తీసుకొంటే పర్యాయ పదాలు అసంఖ్యాకం. ఇన్ని పదాలు ఉన్నందునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ‘ పెళ్లాం ’ అని ఉచ్ఛరించటాన్ని జనసేన Jana Sena అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా తప్పు పడుతున్నారు. దానికి బదులు వేరే పదాలు వాడితే హుందాగా ఉంటుందని సూచిస్తూ కొన్ని ఉదాహరణలను సైతం ఇచ్చారు. ఇటువంటి నేపథ్యంలో వివిధ నిఘంటువులను Buruju.com పరిశీలించినప్పుడు ఆసక్తి కలిగించే పర్యాయ పదాలెన్నో కనిపించాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర
జనసేన Jana Sena అధినేత పవన్ కల్యాణ్ Pavan Kalyan 2023, జూలై 12వ తేదీన తాడేపల్లిగూడెంలో వారాహి యాత్ర సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ తరచు తన భార్యను ఉద్దేశించి పెళ్లాం..పెళ్లాం అని అంటున్నారని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు అనాల్సిన పదం ఇది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి బదులుగా భార్య, సహ ధర్మచారిణి, సతీమణి వంటి ఎన్నో పదాలు వాడుకలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. అయినప్పటికీ జగన్ లో AP CM Jagan మార్పు రాలేదు. పెళ్లాలు అని ఉచ్ఛరిస్తూనే ఉన్నారు. దీంతో తాజాగా.. 2024, ఏప్రిల్ 17వ తేదీన మచిలీపట్నంలో నిర్వహించిన ఎన్నికల సభలో జగన్ పై పవన్ కల్యాణ్ మరో సారి మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పేర్కొన్నట్టుగానే వివిధ నిఘంటువులు భార్య అనే పదానికే ఎక్కువ వివరణలు ఇచ్చాయి. పెండ్లాము పదం కొన్ని నిఘంటువుల్లోనే dictionaries కనిపిస్తోంది.
భార్య అంటే భరింపబడునది అని ‘ఆంధ్ర సాహిత్య సర్వస్వం’ చెబుతోంది. భార్యకు పర్యాయ పదాలుగా సహధర్మిణి, పత్ని, సహచరి, గృహిణి, సహధర్మచారిణి, ఇంతి, ఇల్లాలు, పాణిగ్రహీతి, ఆలు, రాణి, కులకాంత, దయిత, దేవేరి, ధని, నాతి, నాయిక , ఇంటిగరిక, ఇంటియాలు , ఇల్లుటాలు, ఇంటావిడ, ఊఢ, సభృత్రిక, ప్రోయాలు తదితరాలను నిఘంటువులు పేర్కొంటున్నాయి. వేమన ఒక చోట భార్యను ‘ఇంటియాలి’ అని సంబోధిస్తూ.. ‘ ఇంటియాలి విడిచి ఇల జార కాంతల వెంట తిరుగువాడు వెర్రివాడు’ అని మందలించాడు. ఆలు అంటే భార్య, జవరాలు, ధీరురాలు అని ‘శబ్ధరత్నాకరం’ వివరిస్తూ.. ఇల్లు+ఆలు= ఇల్లాలు అన్నా భార్యేనని పేర్కొంది. ‘తల్పము’ అంటే దూదిపరుపుతో పాటు భార్య అనే అర్ధం కూడా ఉన్నట్టుగా ఇది చెప్పటం విశేషం.
కలిసి ధర్మకార్యాలను ఆచరిస్తుంది కనుక సహ ధర్మచారిణి అని అంటారని ‘సూర్యాంధ్ర నిఘంటువు’ వివరిస్తోంది. పత్ని అంటే పతిలో యోగం కలదనేది ‘ఆంధ్రసాహిత్య సర్వస్వం’ విశ్లేషణ. తెలుగు కవులు తమ కావ్యాల్లో నాయకుల భార్యలకు తామరకంటి వంటి వివిధ పేర్లను ఉపయోగించారు. ఇంద్రుడి భార్యను ఇంద్రాణి అని, రుద్రుడి భార్యను రుద్రాణి అని వాడారు. శ్రీమతి అనే పర్యాయపదం పాత నిఘంటవుల్లో కనిపించకపోవటాన్ని బట్టి ఇది ఇటీవల కాలంలోనే వాడుకలోకి వచ్చినట్టుగా భావించవచ్చు. ఇంకా అర్ధాంగి వంటి పదాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో మిసెస్, వైఫ్ వంటి ఇంగ్లీషు పదాలే ఎక్కువగా చెలామణీ అవుతున్నాయి. పెళ్లాంకు బదులు వాటిని ఉపయోగిస్తే ఇక వివాదమే ఉండదు కదా?