నాటి కాంగ్రెస్ సీఎం అంజయ్యనూ తెలుగుదేశం స్మరించుకోవాలి
personBuruju Editor date_range2023-05-28
40 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి అంజయ్య
బురుజు.కాం Buruju.com : మహానాడును ఆర్భాటంగా నిర్వహించిన తెలుగు దేశం శ్రేణులు.. ఒకప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్యను Tangutoori Anjaiah కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందు వల్లనంటే ఆయన్ని కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ గాంధీ అవమానపర్చి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కించపర్చారంటూ ఎన్టీఆర్ చేసిన ప్రచారం చాలా ప్రభావాన్ని చూపించింది. ఇటువంటి ప్రచారం కారణంగానే తెలుగు దేశం పార్టీని ప్రారంభించిన కేవలం 9నెలల్లోనే ఎన్టీఆర్ అధికారంలోకి రాగలిగారు. అంజయ్యను తెలుగుదేశం నాయకులు మర్చిపోయినప్పటికీ ప్రధాన మంత్రి మోదీ మాత్రం అంజయ్యను అవమానపర్చిన విషయాన్ని 2018, ఫిబ్రవరి 7వ తేదీన పార్లమెంటులో గుర్తుచేయటం విశేషం.
అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానపర్చినప్పటికీ ఆ తర్వాత తాను ప్రధాని అయ్యాక ఆయన్ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. ఇది అప్పటి ఫొటో
తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లా భానూరుకు చెందిన టంగుటూరి అంజయ్య ( కాంగ్రెస్) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1980 అక్టోబరు నుంచి 1982 పిబ్రవరి వరకు 16 నెలల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. అంతకు ముందు కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరించారు. అప్పుడు ఇందిరా గాంధీ ప్రధాని. అంజయ్య సీఎంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నాయకుడైన రాజీవ్ గాంధీ.. విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చినప్పుడు రాష్ట్ర రాజకీయాలనే కుదిపివేసిన సంఘటన చోటు చేసుకొంది. లావుగా ఉండే అంజయ్య.. రాజీవ్ గాంధీకి స్వాగతం చెప్పేందుకు పూలమాలలతో పరుగులు పెడుతూ విమానం సమీపంలోకి రావటం రాజీవ్ గాంధీకి నచ్చలేదు. అంజయ్యను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అంజయ్య చాలా బాధపడ్డారు. అప్పట్లో ఈ సంఘటన సంచలనం సృష్టించింది. రాజీవ్ గాంధీ పైలెట్ గా పనిచేసి ఉన్నందున అంజయ్య తెచ్చిన పూల మాలల్లోని రేకులు విమానం ప్రొఫెల్లర్ లోకి వెళ్తాయని కంగారు పడే ఆయన అలా వ్యవహరించారనే వాదనలూ ఉన్నాయి. ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి జరిగిన అవమానంగా ఎన్టీఆర్ ప్రచారం చేశారు.
అప్పట్లో అంజయ్య కొలువులో ఏకంగా 61 మంది మంత్రులు ఉండేవారు. దీన్ని జంబో మంత్రి వర్గం అనేవారు. ఏపీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు ఇటువంటి జింబో మంత్రివర్గంలో ఉండేవారు. ప్రధాన మంత్రి మోదీ.. 2018లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలను తెలిపే సందర్భంలో ఆనాడు హైదరాబాదులో దళిత ముఖ్యమంత్రి అంజయ్యను రాజీవ్ గాంధీ అవమాన పర్చారంటూ ప్రస్తావించారు. వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిని విమర్శిస్తూ మోదీ ఆనాటి సంఘటనను గుర్తు చేశారు. అంజయ్య దళితుడనే ప్రచారం ఉన్నప్పటికీ జన్మతహా ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారిగా చెప్పేవారూ ఉన్నారు. ఆయన 1986లో చనిపోయారు. అప్పటికి సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నారు.