తెలంగాణ ద్రవ్యోల్భణంపై చిదంబరం చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత?
personBuruju Editor date_range2022-07-11
వంద నోటుకూ ఇప్పుడు విలువ లేకుండా పోతోంది
బురుజు.కాం Buruju.com: Hyderabad: ద్రవ్యోల్భణంలో తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు దేశంలో ఏడో స్థానంలో ఉంది. తెలంగాణ గత ఏడాది మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితి మెరుగు పడింది. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నాయకులు చిదంబరం మాత్రం ఇప్పటికీ తెలంగాణాది మొదటి స్థానమని చెప్పటంలో వాస్తవం లేదు. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన 2023, అక్టోబరు నెల వివరాల ప్రకారం తెలంగాణ ద్రవ్యోల్భణం రేటు 5.37 శాతం ఉండగా రాజస్థాను 6.25 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. జాతీయ సగటు 4.62 శాతం కంటే మాత్రం తెలంగాణ ద్రవ్యోల్భణం అధికంగా ఉంది.
రోజురోజుకు మారిపోతున్న ధరలతో బెంబేలెత్తుతున్న సగటు జీవి
ధరల పెరుగుదలను చెప్పేదే ద్రవ్యోల్భణం రేటు. అంటే.. తెలంగాణలో 2022, అక్టోబరులో రూ.100కు లభించిన ఒక వస్తువును 2023, అక్టోబరులో రూ. 104.62 పెట్టి కొనుక్కోవాల్సివస్తోంది. రాష్ట్రంలో 2022లో కొన్ని నెలల పాటు ద్రవ్యోల్భణం రేటు ఏకంగా 10 శాతానికి పైగా ఉంటూ వచ్చింది. అప్పుడు దేశంలో తెలంగాణాదే ప్రధమ స్థానం . మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అప్పటి గణాంకాలను దృష్టిలో పెట్టుకొన్నారే తప్ప తాజా వివరాలను తెలుసుకోలేదని నవంబరు 16వ తేదీన ఆయన హైదరాబాదులో విలేకర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది.
పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించటం పాలకుల విధి.
అన్ని రాష్ట్రాల్లోను కొన్ని ముఖ్యమైన వస్తువుల ధరలను జాతీయ గణాంకాల శాఖ ప్రతినెలా సేకరించి వినియోగదారు ధరల సూచీని , ద్రవ్యోల్భణం రేటును లెక్కగడుతుంది . పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), విశ్రాంత ఉద్యోగులకు కరవు భృతి (డీఆర్) ఇవ్వటానికి ద్రవ్యోల్భణం రేటే ప్రామాణికం. రాష్ట్రాల్లోని జీవన వ్యయం అంచనాకూ ఇది తోడ్పడుతుంది.