మరో మూడు నెలల్లో రెగ్యులర్ ఉద్యోగులుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు
personBuruju Editor date_range2023-02-20
పంచాయతీ కార్యదర్శుల దైనందినిని ఆవిష్కరించిన అనంతరం దానిని చూపుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ముఖ్య కార్యదర్శి సుల్తానియా, డైరక్టర్ జి. హనుమంతరావు తదితరులు
బురుజు.కాం Buruju.com : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషన్ వ్యవధి ఏప్రిల్ నెలలో ముగుస్తుందని, ఆ వెంటనే వారి సర్వీసు క్రమబద్ధీకరణకు చర్యలు చేపడతామని తెలంగాణ పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు స్పష్టం చేశారు. జీవో నెంబరు 317 వల్ల ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించి.. నూతన జోన్ల వారీగా కార్యదర్శుల నియామకాలకూ చర్యలు చేపడతామన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సీనియార్టీ జాబితా ప్రకారం నోషనల్ పదోన్నతుల కల్పన ప్రతిపాదనలను సైతం కొలిక్కితెస్తామని ఆయన వెల్లడించారు . రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం రూపొందించిన 2023 సంవత్సరం దైనందిని (డైరీ)లో కార్యదర్శులకు సంబంధించిన అత్యంత విలువైన సమాచారం పొందుపర్చివుందని మంత్రి ప్రశంసించారు.
మంత్రికి పుష్పగుచ్ఛాన్ని అందజేస్తున్న పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.మధుసూదన రెడ్డి
పంచాయతీ కార్యదర్శులు కష్టించి పనిచేస్తుండటం వల్లనే రాష్ట్రంలోని గ్రామాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి ప్రశంసించారు. కార్యదర్శుల అన్ని రకాల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూల వైఖరినే అవలంభిస్తోందని, సిబ్బంది ఇంకా బాగా పనిచేయాలని ఆయన సూచించారు. తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం రూపొందించిన 2023 సంవత్సరం దైనందినిని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు.. ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. పంచాయతీరాజ్ అంశాలపై నిర్వహించే సమావేశం కోసం అక్కడికి వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, డైరక్టర్ జి. హనుమంతరావు కూడా దైనందిని ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. దైనందినిలో కార్యదర్శులకు సంబంధించిన మార్గదర్శకాలు, జీవోలు, వారి విధులు తదితరాలన్నీ పొందుపర్చి ఉన్నాయని , రాష్ట్రంలోని ప్రతి ఒక్క కార్యదర్శి చేతిలోను ఇది నిత్యం ఉండాల్సిన అవసరం ఉందని డైరక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. సందీప్ సుల్తానియా కూడా డైరీ బాగుందంటూ సంఘ ప్రతినిధులను అభినందించారు. పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు పి.మధుసూదన రెడ్డి.. కార్యదర్శుల ముఖ్యమైన సమస్యలను వివరిస్తూ వేర్వేరు వినతి పత్రాలను మంత్రికి అందజేయగా.. సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని ఆయన హామీ ఇచ్చారు. వినతి పత్రాలను అక్కడికక్కడే ముఖ్య కార్యదర్శి సుల్తానియాకు మంత్రి అందజేసి చర్యలు చేపట్టాలని సూచించారు.
జీవో 317 కారణంగా పలువురు కార్యదర్శులు ఏవిధంగా స్థానికతను కల్పోయిందీ వివరిస్తూ అందజేసిన వినతి పత్రం
రాష్ట్రంలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పొడిగించిన ప్రొబేషన్ గడువు 2023, ఏప్రిల్ నెలతో ముగియనుండటంతో వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సివుంది. గడువు సమీపిస్తుండటంతో కార్యదర్శుల్లో ఉత్కంఠ నెలకొంది. వారి నెలవారీ జీతాలకు 2023-24 వార్షిక బడ్జెట్టులో నిధులను పొందు పర్చటంతో పాటు.. మంత్రి కూడా క్రమబద్ధీకరణ అంశంపై తాజాగా అధికారులకు సూచనలు చేయటంతో రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తింపును ఇచ్చేందుకు ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. మరోవైపు జీవో 317 వల్ల రాష్ట్రంలో దాదాపు 300 మంది కార్యదర్శులు స్థానికతను కోల్పోయి సూదూర ప్రాంతాల్లో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొందని సంఘ ప్రతినిధులు మంత్రికి వివరించారు.
దైనందిని ఆవిష్కరణ కార్యక్రమంలో.. కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.మధుసూదన రెడ్డి, సంఘ ప్రతినిధులు ఎం.ఎస్.ఎస్. వాణి, మార విజయలక్ష్మి, పి.పండరీనాథ్, డి. వెంకట రమణా రెడ్డి, రమేష్, బి.సురేష్, ఎస్.మొగులయ్య, టి.ప్రవీణ్ కుమార్, పరమేశ్వర్ రెడ్డి, ఎస్.రమేష్, జి.రాజలింగం, శశికాంత్ గౌడ్, తిరుపతి రెడ్డి, ఆర్.లక్ష్మణ్, జి.రమేష్, శ్రీనివాస్, ఇంకా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.