దశ కంఠుడి విమానం ఇలా ఉండొచ్చని ఊహించి గీసిన చిత్రం ఇది
బురుజు.కాం Buruju.com : రావణుడు భారత భూ భాగం నుంచి సీతను ఎత్తికెళ్లి పోయినప్పుడు వినియోగించినట్టుగా ప్రచారంలో ఉన్న పుష్పక విమానం pushpaka vimana కోసం.. శ్రీలంక sri lanka ప్రభుత్వం ప్రస్తుతం అన్వేషిస్తోంది. దాని ఆచూకీతో పాటు అది తిరిగిన దారినీ ఖచ్చితంగా వెల్లడిస్తామని ప్రభుత్వం చెబుతోంది. శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ.. విమాన అన్వేషణ విభాగానికి మాత్రం నిధులను బాగానే సమకూరుస్తోంది. విమానాన్ని కనుగొనటంలో భారత్ సాయాన్నీ కోరుతున్నట్టు సమాచారం. విమాన ఆచూకీని, అది తిరిగిన దారిని అయిదేళ్లలో బహిర్గతం చేస్తామని అన్వేషణ విభాగానికి సారధ్యం వహిస్తున్న శశి దనతుంగే ఇటీవల శ్రీలంకలోని పత్రికల వారికి తెలిపారు. ఆయన తొలుత చెప్పిన గడువు రెండేళ్లే. ప్రఖ్యాత చరిత్రకారులు సురవరం ప్రతాప రెడ్డి మాత్రం.. ఆనాడు సీతను తీసుకెళ్లింది గాడిదలు లాగిన రథంపైన మాత్రమేనని, ఇదే విషయం రామాయణ శ్లోకాల్లో స్పష్టంగా ఉందని తేల్చి చెప్పటం విశేషం.
రామాయణంలోని రావణ బ్రహ్మ విశ్వరూపం
ఎక్కవ మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం రావణుడు Ravana.. సీతను అపహరించి ఇప్పటికి అయిదు వేల సంవత్సరాలు అయ్యింది. రాముడు జన్మస్థలి అయోధ్య Ayodhya లో రామ మందిర నిర్మాణాన్ని చేపట్టటంతో రావణుడిపై శ్రీలంక దృష్టి సారించింది. అక్కడి విమానయాన సంస్థ మాజీ అధికారి శశి దనతుంగే సారధ్యంలో నిపుణులతో ఒక అన్వేషణ విభాగాన్ని ఏర్పాటు చేసింది. తొలి విమానాన్ని నడిపింది అత్యంత మేధావి అయిన రావణుడేనని త్వరలోనే నిరూపిస్తామని దనతుంగే గట్టిగా చెబుతున్నారు. విమాన ఆచూకీ కోసం ఆయన అక్కడ అడవులు, కొండల్లోను తిరుగుతున్నారు. సీతను అపహరించింది భారత దేశంలోనే కావటంతో ఆయన ఇక్కడా పరిశోధనలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని భద్రాచలం సమీపంలోని పర్ణశాల వద్దనే సీతను రావణుడు అపహరించినట్టు ప్రచారంలో ఉన్నందున దనతుంగే ఇక్కడకూ రావచ్చు.
కొన్ని శిల్పాల్లో.. రావణుడు సీతను రధంపై తీసుకెళ్లినట్టుగానే చెక్కారు
విమానం అంటే గోపురమే తప్ప ఆకాశంలో విహరించేది కానేకాదంటూ చరిత్రకారులు సురవరం ప్రతాప రెడ్డి.. 1943లో వెలువరించిన ‘రామాయణ విశేషములు’ అనే గ్రంధంలో స్పష్టం చేశారు. రామాయణంలోని శ్లోకాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఆయన తన గ్రంధంలో విశ్లేషించారు. విమానమంటే ఒక రకమైన రథమని, దేవాలయాలపై నిర్మించే గోపురాలను కూడా విమానమని అంటారని ఆయన పేర్కొన్నారు. రథంపై అలా గోపురం ఉన్నందున దాన్ని విమానం అని పిలిచివుండొచ్చని, రావణుడికి పది తలలు ఉన్నవని చెప్పినట్టుగానే ఆయన ఆకాశ మార్గంలో వెళ్లాడనేదీ కల్పనేని ఆయన తేల్చారు. ‘పుష్పక’ అనేది రావణుడిని తొమ్మిది అంతస్తుల మేడ అని, దానినే పుష్పక విమానం అనేవారని, హనుమంతుడు లంకు వెళ్లినప్పుడు తొలుత చూసింది దీనినేనని ప్రతాప రెడ్డి వివరించారు. గాడిదలు లాగే రథంపై రావణుడు సీతాపహరణానికి వెళ్లినట్టుగా పేర్కొనే శ్లోకాలు కూడా రామాయణంలో ఉన్నాయని తెలిపారు.
శ్రీలంక కొండ ప్రాంతాల్లో విమాన అవశేషాల కోసం కొనసాగుతున్న అన్వేషణ
నాసిక్ వద్ద గల పంచవటి.. సీతను అపహరించిన ప్రాంతంగా మహారాష్ట్ర వారు భావిస్తుండగా.. తెలంగాణలోని భద్రాచలం సమీపంలో గల పంచవటే అసలైనదని ప్రతాపరెడ్డి వివిధ అంశాల ఆధారంగా నిర్ధారించారు. అందువల్ల.. శ్రీలంక ప్రభుత్వం కనుక రావణుడు విమానాన్ని వాడటం నిజమేనని తేల్చినట్లైతే.. 5వేల సంవత్సరాల క్రితమే ఆయన విమానంలో మన తెలుగు నేలపైకి వచ్చి వెళ్లినట్లవుతుంది.