ఏపీకి ప్రత్యేక హోదా కోసం.. ఎన్.కె.సింగ్ ఆత్మకథ చదవండి
personBuruju Editor date_range2022-08-27
జాతీయ 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మను ఎన్.కె.సింగ్ రాసిన ‘పోర్టరైట్స్ ఆఫ్ పవర్ ’ పుస్తకం కవర్ పేజీ ఇది. ప్రత్యేక హోదాకు సంబంధించిన పలు విషయాలు దీనిలో ఉన్నాయి
బురుజు.కాం Buruju.com : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను ఇవ్వరాదంటూ 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదు. ఇదే విషయాన్ని 15వ ఆర్ధిక సంఘానికి ఛైర్మన్ గా వ్యవహరించిన ఎన్.కె.సింగ్.. తన ఆత్మకథ ‘పోర్టరైట్స్ ఆఫ్ పవర్ ’ లో కుండబద్దుల కొట్టారు. సాక్షాత్తూ ఒక ఆర్థిక సంఘానికి సారధ్యం వహించినవారే ఇటువంటి విషయాన్ని చెప్పినందున ఏపీలోని ఎంపీలంతా ఈ పాటికి వత్తిడి తెచ్చుంటే కేంద్రంలో ఎంతో కొంత కదలిక ఉండేది. ఆత్మకథ వెలువడి రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు ఏపీలోని ప్రజా ప్రతినిధులెవరూ దానిని చదివిన దాఖలాలైతే కనిపించటంలేదు. ఎందువల్ల నంటే.. దాని గురించి ఎవరూ ఎక్కడా ప్రస్తావించనేలేదు.
హోదాలను ఇవ్వద్దని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదంటూ రాసిన తన ఆత్మకథను ప్రధాని మొదీకి అందజేస్తున్న ఎన్.కె.సింగ్
ప్రత్యేక హోదా special status ఇవ్వొద్దని జాతీయ 14వ ఆర్థిక సంఘం 2015లో స్పష్టం చేసినందున ఆంధ్రప్రదేశ్ కు తాము హోదాను కల్పించలేకపోతున్నామని మోదీ సర్కారు దాదాపు ఏడేళ్లగా చెబుతూ వస్తోంది. ఏపీతో సహా హోదాను అడుగుతున్న రాష్ట్రాల వారంతా ఇదంతా నిజమేకాబోలని భావించారు. ఇటువంటి నేపథ్యంలో.. జాతీయ 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కె.సింగ్ .. తన తుది నివేదికను 2020 నవంబరు నెలలో రాష్ట్రపతికి సమర్చించిన తర్వాత తన ఆత్మకథను ‘ పోర్టరైట్స్ ఆఫ్ పవర్’ అనే పేరుతో వెలువరించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వద్దనే విషయాన్ని 14వ ఆర్థిక సంఘం తన నివేదికలో ఎక్కడా చెప్పలేదని , ఆ నివేదికను తాను క్షుణ్ణంగా పరిశీలించానని ఆత్మకథలో ఆయన తేటతెల్లంచేశారు. ఇలా ఆయన ఏపీ హోదా గురించి ప్రత్యేకంగా చర్చించటానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. ఆర్థిక సంఘం ఛైర్మన్ కావటానికి ముందు ఆయన బీహారులోని జనతాదల్ (యు) పార్టీ నుంచి రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు. బీహారుకు ప్రత్యేక హోదాను ఇవ్వాలంటూ కేంద్రంపై గట్టిగా వత్తడి తెచ్చిన వారిలో ఆయనొకరు. ఆయన 2012లోనే బీహారుకు హోదా గురించి రాజ్యసభలో అడగ్గా.. నిబంధనలు వర్తించనందున హోదాను ఇవ్వటం సాధ్యంకాదని నాటి ఆర్థిక మంత్రి చిదంబరం రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఆర్థిక నిపుణుడైన ఎన్.కె.సింగ్.. N.K. Singh రాజ్యసభ సభ్యత్వం అనంతరం 15 వ ఆర్థిక సంఘం ఛైర్మన్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలకు కేంద్రం నుంచి అందుతున్న పన్నుల్లో వాటాలు, గ్రాంట్లు తదితరాలన్నీ ఆయన సారధ్యం వహించిన ఆర్థిక సంఘం సిఫార్సు చేసినవే.
ప్రత్యేక హోదాగల ఉత్తరాఖండ్ లో ని ప్రగతి ఇది
వెనుకబడిన బీహార్ రాష్రానికి హోదా కావాలని పట్టుపడుతూ వచ్చిన ఆయనకు.. ఆంధ్రప్రదేశ్ కు 2014లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పదేళ్ల పాటు ప్రత్యేక హోదాను ఇస్తున్నట్టుగా ప్రకటించటం ఆకర్షించటం వల్లనే ఈ అంశంపై ఆయన ఎక్కువ దృష్టి సారించినట్టు తన తాజా పుస్తకంలోని అంశాలను బట్టి తేటతెల్లమవుతోంది. అందువల్లనే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా హామీ, విభజన బిల్లును హడావిడిగా రూపొందించటం, హోదాను ఇవ్వలేదనే కారణంతో చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చేయటం వంటి అంశాలను తన ఆత్మకథలో పొందుపర్చారు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఎన్.కె.సింగ్ తన పుస్తకంలో స్పష్టంచేశారు.
ప్రత్యేక హోదా కోసం ప్రజలు తొలుత ఆందోళనలు చేసినా.. ప్రజా ప్రతినిధుల తోడ్పాటు లేకపోవటంతో ఇక వాటిని విరమించుకోకతప్పలేదు
ప్రత్యేక హోదాలు అనేవి అవసరం లేదంటూ 2013లో తాను రిజర్వు బ్యాంకు గవర్నరు కావటానికి ముందు.. రఘురాం రాజన్ ఒక నివేదికను కేంద్రానికి అందజేశారు. దీనిని దగ్గర పెట్టుకొనే.. 2014లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను ప్రకటించినందున రఘురాం రాజన్ కమిటీ సిఫార్సులకూ ఇక విలువలేనట్టే అయ్యింది. అందువల్ల హోదా మంజూరీకి పలనా నివేదికలు అడ్డు తగులుతున్నాయంటూ చెప్పేందుకు కేంద్రానికి ఆస్కారమేలేదు. ఎటొచ్చీ.. ఇటువంటి విషయాలన్నింటినీ ఏపీ ఎంపీలు.. లోక్ సభ, రాజ్య సభల్లో గట్టిగా చెప్పగలగితేనే ఫలితం ఉంటుంది.