బురుజు.కాం Buruju.com : Hyderabad: అర్ధ రూపాయి నాణేన్ని భారత ప్రభుత్వం రద్దు చేయనప్పటికీ అది మారకం విలువను మాత్రం కోల్పోయింది. దాంతో అర్ధ రూపాయి నాణేలు ప్రజల వద్ద పెద్ద సంఖ్యలో పోగుపడిపోయాయి. భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తాజా గణాంకాలు ప్రకారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రజల ఇళ్లల్లో ఏకంగా 1,478 కోట్ల అర్ధ రూపాయి నాణేలు ఉన్నాయి. వీటి విలువ 700 కోట్ల రూపాయలు. ప్రజల నుంచి ఇవి బ్యాంకులకు సైతం వెనక్కి రావటం లేదు. నాణేల సేకరణ ప్రియులు పాత వాటిని అధిక ధర పెట్టి కొంటుంటారు కనుక భవిష్యత్తులో అర్ధ రూపాయికి అటువంటి వైభవం రావచ్చన్న భావనతో కొంత మంది వాటిని భద్రపర్చుకొన్నట్టు సమాచారం. ఇప్పటికే కొన్ని సీరీస్ లో వెలువడిన నాణేలు ఆన్ లైన్ విఫణిలో అధిక ధర పలుకుతున్నాయి.
భారత ప్రభుత్వం 2011లో 25 పైసలు (పావలా) నాణేలను రద్దు చేసింది. ఆ తర్వాత ఇక ఏ నాణేలను రద్దు చేయకున్నప్పటికీ 50 పైసలు ( 50 Paise అర్ధ రూపాయి ) నాణెంకు మారకం విలువ లేకపోవటంతో అది తనంత తానుగా చెలామణీ నుంచి వైదొలగింది. అర్ధ రూపాయి నాణేలను వ్యాపారులు నిరాకరించినా బ్యాంకులు మాత్రం తీసుకొంటాయి. అయినప్పటికీ ప్రజలు వాటిని బ్యాంకులకు ఇవ్వటంలేదు.
రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారం అర్ధ రూపాయి నాణేలు ప్రజల వద్ద 2024 మార్చిలో 1,478 కోట్లు ఉండగా 2025, జూన్ నెలలోనూ ఎటువంటి మార్పు లేకుండా అదే సంఖ్యలో వారి ఉద్ద ఉన్నాయి. దేశ జనాభా 140 కోట్లను పరిగణనలోకి తీసుకొని చూస్తే సగటున ఒక్కొక్కరి వద్ద 10 నాణేలు ఉన్నట్టుగా లెక్కతేలుతోంది.