బ్యాంకులు సహకరిస్తే గ్రామగ్రామానా ఇటువంటి సుందర దృశ్యాలు కనిపిస్తాయి
బురుజు.కాం(Buruju.com): వ్యవసాయ రుణాల పంపిణీకి సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఇచ్చే ఉత్తర్వులు తెలంగాణలో ఏమాత్రం అమలు కావటంలేదు. పంట ఖర్చులు ఏటా పెరిగిపోతుండగా.. ఇక్కడి బ్యాంకులు మాత్రం అందుకు ధీటుగా రుణాలను ఇవ్వటంలేదు. బ్యాంకుల మొత్తం రుణాల్లో వ్యవసాయ రంగం వాటా 18 శాతం మేర ఉండాలనే నిబంధన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఏడాది కూడా అమలకు నోచుకోలేదు. దీంతో 2024 నాటికి వ్యవసాయంతో సహా ప్రాధాన్యత రంగాల వాటా మొత్తం రుణాల్లో 75 శాతం మేర ఉండాలనే ఆర్బీఐ సూచనలు.. తెలంగాణలో ఎంతమాత్రం ఆచరణలోకి రాబోవని తేటతెల్లమవుతోంది. పరిస్థితి ఇంత స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ జిల్లా, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశాల్లో ప్రజా ప్రతినిధులెవరూ దీనిపై గట్టిగా ప్రశ్నించిన దాఖలాలైతే లేనేలేవు.
ఆర్బీఐ చెప్పినట్టు చేస్తేనే ఇటువంటి చోట రైతుకు ఆదరణ లభించేది
తెలంగాణలోని బ్యాంకులన్నీ కలిపి 2021, జూన్ నాటికి రూ. 6.67 లక్షల కోట్ల రుణాలను ఇవ్వగా.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం దానిలో వ్యవసాయ రుణాల వాటా 18 శాతం అంటే.. రూ.1.20 లక్షల కోట్ల మేర ఉండాలి. ఇందుకు భిన్నంగా.. రైతుల వద్ద రూ. 93,525 కోట్ల (14శాతం) మేర మాత్రమే రుణాల రూపేణా ఉన్నాయి. రైతులకు అందజేసే పంట రుణాలు, ట్రాక్టర్లు వంటి వంటివాటికిచ్చే టెర్మ్ రుణాలు, పాడి వంటి వ్యవసాయేతర రుణాలు తదితరాలు వీటిలో కలసి ఉన్నాయి. అంటే.. ఆర్బీఐ చెప్పిన దానిలో రూ. 27వేల కోట్లు రైతులకు అందలేదు. ఏటా ఇదే పరిస్థితి. ఇక రాష్ట పరిధిలో అన్ని బ్యాంకులు కలిపి ఇచ్చిన మొత్తం రుణాల్లో వ్యవసాయంతో సహా ప్రాధాన్యత రంగాల వాటా 40 శాతం ఉండాలని ఆర్బఐ చెబుతూ వస్తోంది. తక్కువ ఆదాయాల వారికి గృహ నిర్మాణం, విద్య , చిన్నతరహా పరిశ్రమలు వంటివి ప్రాధాన్యత రంగం పరిధిలోకి వస్తాయి. ఇటువంటి ప్రాధాన్యత రంగాలకు ఆర్బీఐ నిబంధన ప్రకారం 2021, జూన్ నాటికి తెలంగాణలో రూ.2.66 లక్షల కోట్ల మేర వెళ్లాల్సివుండగా.. రూ. 62,815 కోట్ల మేర తక్కువగా.. కేవలం రూ. 2.03 లక్షల కోట్లు మాత్రమే వాటికి సమకూరాయి. అంటే.. బ్యాంకులు అన్ని రంగాలకు కలిపి ఇచ్చిన మొత్తం రుణాల్లో అతిముఖ్యమైన ప్రధాన్యత రంగాల రుణ వాటా కేవలం 32 శాతానికి పరిమితమయ్యింది. ఆర్బీఐ చెప్పిన దానికంటే ఇది 8 శాతం తక్కువ. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ప్రాధాన్యత రంగాల వాటా ఏకంగా 64 శాతం మేర ఉంటోంది. ఇందులో వ్యవసాయానికి 42 శాతం వెళ్తోంది. పక్క రాష్ట్రంతో సహా కొన్ని రాష్ట్రాల్లో ప్రాధాన్యత, వ్యవసాయ రుణాల వాటాలు బాగానే ఉంటుండగా తెలంగాణాలో మాత్రం అంత తక్కువ ఎందుకు ఉన్నట్టనే కోణంలో బ్యాంకర్లు చర్యలు చేపట్టటమేలేదు. వ్యవసాయానికి ఆర్బీఐ నిబంధనలకు ధీటుగా రుణాలను ఇవ్వాలనే మొక్కుబడి సూచనలు మాత్రమే ప్రతి బ్యాంకర్ల సమావేశంలోను బ్యాంకుల, ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి వస్తుంటాయి. మరో ముఖ్యవిషయం ఏమిటంటే.. 2021, జూన్ నాటికి తెలంగాణలోని బ్యాంకుల వద్దగల డిపాజిట్లు రూ. 6.02 లక్షల కోట్లు కాగా.. అన్ని రంగాలకు కలపి ఇచ్చిన రుణాలు రూ. 6.67 లక్షల కోట్లు. అంటే తమ వద్దగల డిపాజిట్లనే కాకుండా.. ఇంకో 10శాతానికి పైగా అదనంగా ఇతర రాష్ట్రాల్లోని బ్యాంకుల నుంచీ డిపాజిట్లను తెచ్చి తెలంగాణలో ఇచ్చాయి.
మరో వైపు.. వ్యవసాయం, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు వంటి ప్రాధాన్యత రంగాలకు ఆర్బీఐ చెప్పినా వినకుండా బాగా తక్కువగా రుణాలను అందజేశాయి. అంటే ..బ్యాంకులు బడా పరిశ్రమలు , నిర్మాణ రంగ సంస్థలు వంటి ప్రాధాన్యేతర రంగాల వారిపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్టు స్పష్టమవుతోంది. తెలంగాణలో ప్రాధాన్యత రంగాలవాటా 32 శాతానికే పరిమితమై పోతుండగా.. ఆర్బీఐ మాత్రం అన్ని రాష్ట్రాల్లోను ఈ రంగాల వాటాను ఏటా పెంచుకొంటూ వెళ్తూ 2024 నాటికి అది 75 శాతానికి చేరుకోవాలని చెబుతోంది. ఆర్బీఐ సూచనల ప్రకారమైతే.. 2021, మార్చినాటికి ప్రాధాన్యత రంగాల వాటా 45 శాతం, 2022 మార్చినాటికి 50శాతం, 2023, మార్చినాటికి 60 శాతం ఉండాలి. తెలంగాణలో ప్రస్తుతం ఈ వాటా 32 శాతానికే పరిమితమై ఉన్నందున మరో మూడేళ్లలో 75 శాతానికి చేరుకోవటం అసాధ్యమని స్పష్టమవుతోంది. వ్యవసాయ రంగాలకు ఆర్బీఐ చెప్పిన 18 శాతానికి ఎంత తక్కువైతే బ్యాంకులు ఇస్తాయో ఆవ్యత్యాసానికి సరిపడా మొత్తాన్ని ఆయా బ్యాంకులు నాబార్డు వద్ద ఉండే ఆర్ ఐ డి ఎఫ్ ( గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి )కి జమచేయాలి. నాబార్డు ఈ సొమ్మును రాష్ట్రాల్లోని మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలుగా ఇస్తుంది. దీనిపై వడ్డీ రేటును ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ప్రాధాన్యత రంగాలకు వెళ్లాల్సిన సొమ్మును ఇలా ప్రత్యామ్నాయంగా మౌలిక వసతుల కోసం మళ్లిస్తున్నప్పటికీ.. అది తొలి దశలోనే రైతులకు నేరుగా వారి అవసరాలకు రుణాల రూపేణా వెళ్తుంటే వ్యవసాయం మరింతగా పుంజుకోవటానికి వీలవుతుంది.