ఆరేళ్ల జైలు శిక్ష పడినా.. రిపోర్టరును మెచ్చుకొన్న రామోజీరావుగారు
personBuruju Editor date_rangeSat Jun 08 2024 00:00:00 GMT+0530 (India Standard Time)
ఎప్పుడూ ఆప్యాయంగా మాట్లాడే రామోజీరావు గారు
పిళ్లా సాయికుమార్ Buruju.com బురుజు.కాం : ( సీనియర్ జర్నలిస్టు పిళ్లా సాయికుమార్.. ‘ఈనాడు’ దిన పత్రిక ప్రతినిధిగా 36 సంవత్సరాల పాటు హైదరాబాదుతో సహా వివిధ జిల్లాల్లో పని చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో పనిచేసినప్పుడు ఆయన రాసిన కొన్ని పరిశోధనాత్మక కథనాలకు సంబంధించి అప్పట్లో చీఫ్ ఎడిటర్ గా రామోజీరావు గారిపై కూడా మూడు క్రిమినల్ దాఖలయ్యాయి. దిగువ కోర్టు సాయికుమార్ తో సహా రామోజీరావు గారికీ జైలు శిక్షలు విధించింది. అటువంటి సమయంలో రామోజీరావుగారు తనకు ఎటువంటి ధైర్యాన్ని కల్పించిందీ సాయికుమార్ ప్రస్తుత కథనంలో వెల్లడిస్తున్నారు) అంకిత భావంతో పనిచేసే రిపోర్టర్లను ‘ఈనాడు’ అధినేత రామోజీరావు గారు అక్కున చేర్చుకొనేవారు. మూడు క్రిమినల్ కేసుల్లో ఏకంగా ఆరు సంవత్సరాల జైలు శిక్ష పడగా.. అందుకు బాధ్యుడైన రిపోర్టరును ఏమీ అనకుండా మెచ్చుకోవటం ఆయన వ్యక్తిత్వానికి మచ్చుతునక . పైగా.. రిపోర్టరుకు ధైర్యం చెప్పి సుప్రీం కోర్టు వరకు వెళ్లి కేసుల అంతు చూద్దామంటూ భరోసా కల్పించారు. సంస్థలో నిజాయితీగా పనిచేసే వారికి ఇంతటి మనో నిబ్బరాన్ని కల్పిస్తూ రావటం వల్లనే ‘ఈనాడు’ పత్రిక సంచలన కథనాలతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోను ఏళ్ల తరబడి అత్యధిక సర్క్యులేషన్ తో పాఠకుల మన్ననలు పొందగలుగుతోంది.
జైలు శిక్ష విధించినట్టుగా 2002, సెప్టెంబరు 16వ తేదీన ‘ఈనాడు’, అంధ్రభూమి పత్రికల్లో వెలువడిన వార్తలు
పత్రికల్లో వచ్చే కుంభకోణాలు అందుకు సంబంధించిన వారికి మింగుడు పడకపోవటం సహజమే. నేను ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో 1993 నుంచి మూడేళ్ల పాటు ‘ఈనాడు’ స్టాఫ్ రిపోర్టరుగా పనిచేసిన కాలంలో అక్కడి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)పై రాసిన వరస కథనాలు అప్పటి బ్యాంకు ఛైర్మన్, కాంగ్రెస్ నాయకులు వట్టి పార్ధసారథికి ( దివంగత మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ తండ్రి) ఆగ్రహం తెప్పించాయి. ఎంత ఒత్తిడి తెచ్చినా నేను కండనలు రాయకపోవటంతో నాపైన, చీఫ్ ఎడిటర్ రామోజీరావు గారిపైన ఆయన మూడు క్రిమినల్ కేసులను దాఖలు వేశారు. డీసీసీబీలో రూ.84 లక్షలు దుర్వినియోగం అయినట్టుగా నేను సాక్ష్యాధారాలతో రాసినప్పటికీ.. తాడేపల్లిగూడెంలోని అదనపు జ్యుడిషియల్ ఫస్టుక్లాస్ మెజిస్ట్రేట్ జనమంచి సాంబశివ్.. 2002, సెప్టెంబరు 15వ తేదీన రామోజీరావుగారికి, నాకు ఒక్కో కేసులోను రెండేళ్ల చొప్పున మొత్తం మూడు కేసుల్లోను ఆరేళ్ల జైలు శిక్షను విధించి అన్నింటినీ ఏక కాలంలో అంటే రెండేళ్లలో అనుభవించాలని తీర్పు చెప్పారు. ఒక్కో కేసులోను రూ.5వేల చొప్పున జరిమానా కూడా విధించి, అది చెల్లించకపోతే అదనంగా ఒక నెల చొప్పున జైలులో ఉండాలని చెప్పారు. జరిమానాలో రూ.5వేలను పార్ధసారథికి పరిహారంగా ఇవ్వాలన్నారు. తీర్పులు వెలువరించిన రోజున రామోజీరావుగారు నాలుగు గంటలకు పైగా తాడేపల్లిగూడెం కోర్టులోనే ఉన్నారు.
2002లో.. జైలు శిక్ష పడిన రోజున రామోజీరావుగారితో రిపోర్టరు సాయికుమార్
కోర్టులో తీర్పులను చెప్పేముందు రామోజీరావుగారిని, నన్ను తన సమీపంలోకి రావాలని మెజిస్ట్రేట్ సాంబశివ్ ఆదేశించారు. అలా వెళ్లి ఇద్దరం నిలబడిన తర్వాత ‘మీరు ఏమైనా చెప్పదలచుకొన్నారా?’ అంటూ తొలుత రామోజీరావుగారిని అడిగారు. ఇటువంటి పరిస్థితి వస్తుందని ‘ఈనాడు’ లీగల్ సెల్ న్యాయవాదులు ఊహించకపోవటంతో అక్కడ ఏ విధమైన సమాధానం చెప్పాలో రామోజీరావుగారికి ముందుగా వారు తెలపలేదు. దాంతో ఆయన పక్కనే ఉన్న నా వంక చూశారు. ‘‘ నేనేమీ నేరం చేయలేదు. ఒక వేళ మీరు నేరం చేసినట్టుగా భావించినట్లైతే అందుకు ఆ వార్తలను రాసిన నేనే పూర్తి బాధ్యుడనవుతాను. పత్రిక చీఫ్ ఎడిటర్ గారు ఎంత మాత్రం బాధ్యులు కారు’’ అని నేను చెప్పాను. మెజిస్ట్రేట్ మళ్లీ రామోజీరావుగారిని అడగ్గా తానేమీ తప్పు చేయలేదంటూ ఆయన సమాధానమిచ్చారు. అనంతరం మెజిస్ట్రేట్ ఒక్కో కేసులోని తన తీర్పును చదువుతూ వచ్చారు. మూడు కేసులు తీర్పులు చెప్పేసరికి దాదాపు గంట సేపు పట్టింది. అంత సేపు రామోజీరావుగారు కోర్టులో మెజిస్ట్రేట్ ముందు నిలబడే ఉన్నారు. శిక్షలపై అప్పీలుకు మెజిస్ట్రేట్ నెల రోజుల గడువు ఇచ్చి అంతవరకు శిక్షను నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
మొత్తం మూడు కేసుల్లోను.. ఒక కేసు తీర్పు కాపీలోని ప్రధానమైన పేరా ఇది
శిక్షను తాత్కాలికంగా నిలుపుదల చేసినప్పటికీ సంబంధిత పత్రాలపై సంతకాల కోసం మరో మూడు గంటల పాటు కోర్టులోని ఒక ఇరుకు గదిలో రామోజీరావుగారు ఉండిపోవాల్సివచ్చింది. విపరీతమైన ఎండవేడిమికి తోడు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, లాయర్లు రావటంతో ఆసలు ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. రామోజీరావుగారు చెమటతో ముద్దైపోయారు. బెయిల్ అనంతరం ఆయన తాడేపల్లిగూడెం ‘ఈనాడు’ కార్యాలయానికి వెళ్లి నాకు కబురు పెట్టారు. నేను అక్కడికి వెళ్లగానే నా భుజంపై చేయి వేసి ‘ సాయి.. నువ్వు రాసిన కథనాలను నేను చూశాను. శిక్ష పడినందుకు నువ్వేమీ భయపడవద్దు. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి కేసుల అంతు చూద్దాం’’ అని నాకు ధైర్యం చెప్పారు. ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు నాకు కళ్లు చెమ్మగిల్లినప్పటికీ నేను ఏక ధాటిగా 36 ఏళ్ల పాటు ‘ఈనాడు’లో రిపోర్టురుగా కొనసాగటానికి ఆయన మాటలు నాకు ఎంతో బలాన్నిచ్చాయి. ఆ తర్వాత అప్పీల్లో జిల్లా కోర్టులో మూడు కేసులను జిల్లా జడ్డి రమేష్ కొట్టి వేశారు. చీఫ్ ఎడిటర్ హోదాలో రామోజీరావు గారు తాడేపల్లిగూడెం , ఏలూరు కోర్టులకు రెండు సార్లు హాజరుకావాల్సివచ్చింది. జిల్లా కోర్టులో వాదనలను వినిపించేందుకు అప్పటి ప్రముఖ క్రిమినల్ న్యాయవాది పద్మనాభ రెడ్డిని నియమించారు. ఆయనకు అప్పట్లో రూ.4 లక్షలకు పైగా ఫీజు రూపేణా చెల్లించారు. రామోజీరావుగారు నావల్ల ఇంత ఇబ్బంది పడినా, పెద్ద మొత్తంలో ఖర్చైనా నన్ను మాత్రం ఏమీ అనలేదు సరికదా.. నాకు పలు సార్లు పదోన్నతులను కల్పిస్తూ వచ్చారు. అంతటి మహనీయుడి పార్దవ దేహాన్ని రామోజీ ఫిల్ముసిటీలోని ఆయన కార్యాలయంలో చూడగానే నాకు దుఃఖం పొంగుకొచ్చింది. ఆయన పాదాలపై పడి రోధించటం మినహా ఇంకేమి చేయలేకపోయాను.