personBuruju Editor date_rangeSun Nov 10 2024 00:00:00 GMT+0530 (India Standard Time)
రాచకొండలో ఇప్పటికీ గంభీరంగా కనిపిస్తున్న నాటి కోట సింహద్వారం. ఇటువంటి ద్వారాలు మొత్తం నాలుగు ఉన్నాయి. భక్త పోతన ‘భోగినీ దండకం’లో వీటి ప్రస్తావన ఉంది. ఎత్తయిన ఇటువంటి ద్వారాలను దాటుకొని రాజు వద్దకు వెళ్లటం అసాధ్యమంటూ ఒక వేశ్య.. రాజును ఇష్టపడుతున్న తన కుమార్తెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది.
బురుజు.కాం Buruju.com ( హైదరాబాదుకు దాదాపు 50 కిలో మీటర్ల దూరంలో గల రాచకొండ.. దాదాపు 700 సంవత్సరాల క్రితం అప్పటి తెలంగాణ ప్రాంతాన్ని అంతటిని ఏలిన రేచర్ల పద్మనాయకుల బహ్మాండమైన రాజధాని. అక్కడ కొండపైన శిధిలమైన కోట, దిగువన తుప్పల మాటున ఒదిగిపోయిన ఆలయాలు, మండపాలు, శిల్పాలు.. ఇలా ఎన్నెన్నో అక్కడ కనిపిస్తాయి. వీటిని అభివృద్ధి పరిస్తే ఆ ప్రాంతం పర్యాటకంగా చాల ఆదరణ పొందుతుందని, కర్ణాటకలోని శ్రీకృష్ణ దేవరాయుల రాజధానైన హంపీ విజయనరం అంతటి ఖ్యాతి రాచకొండకు లభించగలుగుతుందని పేర్కొంటూ.. బురుజు.కాం అందిస్తున్న కథనాల్లో ఇది రెండోవది) ముమ్మర దండయాత్రల నడుమ ఏర్పడిన రాచకొండ ( Rachakonda) పాలన కేంద్రంలో.. రహస్యాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి తరతరాలుగా స్థానికులు కథలుగా ఛెప్పుకోవటమే తప్ప ఇంతవరకు వాటిని ఛేదించే ప్రయత్నాలంటూ ఎవరూ చేపట్టలేదు. కేంద్ర,రాష్ట్ర పురావస్తు శాఖలు అటువైపు కన్తెత్తైనా చూడలేదు. Buruju.com ప్రతినిధి రాచకొండలో పర్యటించినప్పుడు పలు విషయాలు వెల్లడయ్యాయి.
రాచకొండలో ఆనాటి ఒక అద్భుత మండపం పరిస్థితి ఇప్పుడిలా ఉంది
రాచకొండ గుట్టలను ఆనుకొని ఉన్న మల్లన్నగుట్ట వద్ద బీరప్ప అనే రైతు పొలంలో ఇటీవల ఒక సొరంగమార్గం వెలుగులోకి వచ్చింది. పొలంలో విద్యుత్ స్తంభం, ట్రాన్సఫార్మర్ ఏర్పాటు కోసం బీరప్ప.. గోతులు తవ్వుతున్నప్పుడు ఈ సొరంగం బయటపడింది. అది ఏకంగా 25 అడుగల లోతు, 15 అడుగుల వెడల్పుతో ఉంది. రాచకొండ కోట నుంచి అవసరమైన సమయంలో తప్పించుకొనేందుకు నాటి పాలకులు ఈ సొరంగాన్ని ఏర్పాటు చేసివుండొచ్చు. దీనిలో పరిశోధన చేపడితే ఆ సొరంగం ఎంత పొడవు ఉన్నదీ వెల్లడవుతుంది. రాచకొండ గుట్టలు.. పొడవుగా చాలా దూరం వ్యాపించి ఉంటాయి. అటువంటి వాటిలో రెండు గుట్టల ఏటవాలు ప్రాంతంలో.. నాటి సైనిక వ్యూహాలకు అనుగుణంగా అప్పట్లో కోట నిర్మితమయ్యింది. రెండు గుట్టల్లోను ఒకటైన ఉత్తరకొండకు గుర్రముల కోనేరు కొండ అనే పేరు ఉండేది. అక్కడ గల పెద్ద కోనేరులో గుర్రాలు, ఏనుగులు నీళ్లు తాగుతుండేవి కనుకనే దానికా పేరు వచ్చింది. అక్కడ గుర్రాలు, ఏనుగులు నీళ్లు తాగుతుండేవంటే అది సైనిక స్థావరం కావచ్చనేది చరిత్రకారుల అంచనా. దీనికే నాగాయకొండ అనే పేరుకూడా ఉండేది. నాగాయకొండపై రెండు గండ శిలల మధ్య ఒక బిలం ఉందని, బిలంలోకి బాగా చూడగలిగితే శిలావిగ్రహాలు కనిపిస్తాయని 1950 ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని సందర్శించిన చరిత్రకారుడు ఆదిరాజు వీరభద్రరావుకు అక్కడి వారు చెప్పగా అదే విషయాన్ని ఆయన తన ‘ ప్రాచీనాంధ్ర నగరములు’ అనే గ్రంధంలో పొందుపర్చారు. అది ప్రవేశింపరాని స్థలమంటూ అక్కడి వారు స్పష్టం చేయటంతో అప్పట్లో ఆ గుట్టలను అధ్యయనం చేసిన వీరభద్రరావు కూడా అక్కడికి వెళ్లే సాహసం చేయలేదు. ‘ ఇక్కడేదో రహస్యం ఉండే ఉండును’ అంటూనే ఆ ప్రదేశాన్ని కనుగొనటం కష్టమనీ తన గ్రంధంలో పేర్కొన్నారు. ఇదే గుట్టపై వడ్లు తదితరాలు దంచుకోవటానికి, నూరుకోవటానికి అనువుగా తీర్చిదిద్దిన రాళ్లు ఉన్నట్టు ఆ ప్రాంతీయులు చెప్పారు.
700 ఏళ్ల క్రితం నాటి రాచకొండ కోట ప్రహారిని ఇప్పుడూ చూడొచ్చు
నాగాయకొండకు దక్షిణంలో ఉన్నదే రాచకొండ. దీనికి కచేరి కొండ అనే పేరు వాడుకలో ఉంది. రాజ్యపాలనకు సంబంధించిన కచేరీలన్నీ చేపడుతుండే ప్రాంతం కనుకనే దానికి కచేరి కొండ అని జనం పిలిచేవారు. రాచకొండకే ‘రాజాద్రి’, రాజుకొండ, రాజాచలం అనే పేర్లూ ఉండేవి. కోట నిర్మాణానికి ముందే రాచకొండ ఒక ముఖ్య పట్టణమని, ఆ కారణంగానే దాన్ని కాకతీయుల అనంతర కాలంలో మొదటి సింగమ నాయకుడి కుమారుడైన మొదటి అనవోతుడి రాజధాని అయ్యిందని ‘ రెడ్డి రాజుల చరిత్ర’లో ప్రఖ్యాత చరిత్రకారులు మల్లంపల్లి సోమశేఖర శర్మ వెల్లడించారు. అంటే.. మొదటి అనవోతుడు సింహాసనాన్ని అదిష్టించిన క్రీ.శ 1361కి ముందుగానే రాచకొండలో ప్రజలు నివసిస్తూ ఉండేవారు.తవ్వకాలను చేపడితే నాటి ఆవాసాల ఆనవాళ్లు వెలుగులోకి వస్తాయి. అనవోతుడు.. వరంగల్, భోనగిరి తదితర ప్రాంతాలను తన ఏలుబడిలోకి తెచ్చుకొంటూ.. మొత్తం తెలంగాణ అంతటినీ రాచకొండ నుంచే పాలించాడు. దీంతో రాచకొండలో ఇంతవరకు వెలుగు చూడని రహస్యాలు చాలానే ఉంటాయి.
రాచకొండ దిగువన.. పొదల మాటున ఒదిగిపోయిన ఆనాటి ఒక ఆలయం. ఇటువంటివి అక్కడ ఇంకా అనేకం ఉన్నాయి
రాచకొండ కోట లోపలకు వెళ్లాలంటే అడ్డదిడ్డంగా ఉండే మార్గాల్లో.. కనీసం నాలుగు సింహ ద్వారాలను దాటుకొని వెళ్లాలి. కొన్ని ద్వారాల పైకప్పులు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. ఒక్కో సింహ ద్వారంలోని రాయి 15 అడుగుల పొడవు, ఒక అడుగు 10 అంగుళాల వెడల్పుతో ఉంటాయి. ఇంతటి పెద్ద రాళ్లను సున్నం, మట్టి వాడకుండా ఒక దానిపై మరొకటి చొప్పున పేర్చటం విశేషం. దేవాలయాలు సైతం అదే విధంగా రూపొందాయి. కొండపైన కచేరి ప్రాంతాన్ని దాటి ముందుకెళ్తే దాదాపు 35 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పుతో ఒక కొండ బీట కనిపిస్తుంది. దీని లోతు ఎంతో చెప్పటం కష్టం. దీనిలో నీళ్లు ఎప్పటికీ నిలిచి పైవరకు ఉంటాయి. దీన్నే సంకెళ్ల బావి అని పిలుస్తుంటారు. రాచకొండ అంటే కేవలం కోట ఉన్న ప్రాంతాన్ని మాత్రమే కాకుండా చుట్టపక్కల ఆరేడు కిలోమీటర్ల మేర కనిపించే వివిధ కట్టడాలను కూడా అధ్యయనం చేయాల్సివుంటుంది. ఎందుకంటే.. ఈ పరిధిలో నాటి మండపాలు, ఆలయాలు, బావులు, కోనేరులు, తోరణాలు చాలానే కనిపిస్తుంటాయి. ఆనాడు మంచినీటి కోసం ఏర్పాటు చేసిన భూ గర్భకాలువలనూ ఇప్పుడు చూడొచ్చు ( మూడో భాగం వచ్చేవారం)