ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గ కేంద్రం పులివెందుల
బురుజు.కాం Buruju.com : ఆంధ్రప్రదేశ్ లోని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన ‘ పులివెందుల’ Pulivendula అంటే అదొక జాతి మొక్కల స్థావరం. అంతే తప్ప అది పులుల మందలు సంచరించిన ప్రాంతం కానే కాదు. దాదాపు 1400 సంవత్సరాల క్రితం పులకేసి అనే రాజు తన పేరు మీదగా ‘ పులకేశి విండుల’ అనే పట్టణాన్ని నిర్మించగా అదే క్రమేణా పులివెందులుగా మారిందనే మరో వాదనా చరిత్రకారుల్లో ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన అసెంబ్లీ నియోకవర్గ కేంద్రాల చారిత్రక అంశాలను వివరిస్తూ Buruju.com అందిస్తున్న కథనాల్లో ఇది మొదటిది.
పులివెందులలోని పార్కు
వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని పులివెందుల నాలుగు దశాబ్ధాలుగా వైఎస్ YS కుటుంబీకులకు కంచుకోటలా ఉంటూ వస్తోంది. నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలూ ఎక్కువే. ఇటువంటి పరిస్థితుల కారణంగానే కాబోలు.. పులివెందుల అంటే పూర్వం ‘పులుల మందలు’ సంచరించిన ప్రాంతమంటూ గూగుల్ లోని వికీపీడియా పేర్కొంటోంది. పులుల మందల పేరే క్రమేణా పులివెందుల అయినట్టుగా సూత్రీకరించింది. పులివెందుల, పులి చింతల పేర్లలోని ‘పులి’ అనేది జంతువుకు చెందినది కాదని, పులి అంటే ఒక రకం మొక్క అని యార్లగడ్డ బాల గంగాధరరావు తన ‘ఒక ఊరి కథ’ గ్రంథంలో విశ్లేషించారు. శాసనాల్లో ‘పులివిందుల’ అని ఉందని, అదే పులివెందులుగా మారిందని తెలిపారు. పుల్లేరులోని పులి అంటే మాత్రం మెుక్క అని కాకుండా మురికి అని ఆర్ధమని, మురుగు కాలువనే పుల్లేరుగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల పుల్లేరు పేరుతో సహజ ప్రవాహాలు కనిపిస్తాయన్నారు.
వాగ్గేయకారుడు అన్నమయ్య సందర్శించిన పులివెందులలోని రంగనాయక ఆలయం ఇదే. ఇక్కడే అన్నమయ్య ఒక శృంగార కీర్తనను రాసి ఆలపించాడు
పులివెందులలోని పులి అంటే మొక్క అని బాల గంగాధరరావు చెప్పిన దానిని సమర్ధించే అంశమొకటి మామిడిపూడి వెంకట రంగయ్య రచించిన ‘ సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము’లో ఉంది. ‘‘ పులివెందుల తాలుకా యందు దాణగుట్ట అను స్థలమున నేటికిని సిద్ధులు సిద్ధపరిచిన అనేక రసములు.. కుండల యందు నిక్షిప్తమై కలవు . వాటి గురించి తెలుసుకోవటం సాధ్యం కానిదయిఉన్నది’’ అని పేర్కొన్నారు. రసములు.. అక్కడ లభించే ఆయుర్వేద మొక్కల నుంచి తీసినవిగా భావించవచ్చు. గోపీకృష్ణ అనే చరిత్రకారుడు పులివెందుల గురించి తన ‘శ్రీనివాస మంగాపురము మరియు మన ఆలయాలు’ అనే గంథ్రంలో వివరిస్తూ.. ఇది క్రీ.శ. 616లో రెండవ పులకేసి పేరుతో ఏర్పడిన ‘పులకేసి విండుల’ పట్టణమని తెలిపారు. అప్పట్లో చాళిక్యుడైన రెండవ పులకేసి.. వేముల కోటను ఆక్రమించి తన దిగ్విజయ యాత్రకు చిహ్నంగానే ‘పులకేసి విండుల’ పట్టణాన్ని నిర్మించాడని వెల్లడించారు. మోపూరు కాలభైరవ ఆలయ ద్వారంపై గల శాసనం ప్రకారం పులివెందుల 800 సంవత్సరాలకు పూర్వమే ఉన్నట్టుగా స్పష్టమవుతోందని విద్యాన్ రాయరే అనే ఆయన తన ‘మోపూరు కాలభైరవుడు’ అనే గ్రంధంలో రాశారు .
తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య పులివెందులలోని రంగనాయక స్వామి ఆలయాన్ని సందర్శించి ఇక్కడొక శృంగార కీర్తనను ఆలపించినట్టుగా ‘ తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనల్లో గ్రామీణ జీవితం’ అనే గ్రంథంలో డా.బి. శ్రీరాములు తెలిపారు. కాటమ రాజు పులివెందుల సమీప మల్లెల కొండకు తన ఆపార పుశుగణంతో వచ్చినట్టుగా జానపద గేయాల ఆధారంగా తంగిరాల వెంకట సుబ్బారావు ‘ తెలుగు వీరగాథ కవిత్వము’లో వెల్లడించారు. పులివెందుల ప్రాంతంలో చారిత్రక ప్రాంతాలు చాలానే ఉండటంతో అందుకు తగ్గట్టుగానే అక్కడ చెక్కభజన వంటి కళారూపాల బృందాలు చాలానే ఉండేవి. ఇక్కడి నృత్యాలకు సబంధించిన 85వరకు గేయాలను తాను సేకరించినట్టు చిగిచర్ల కృష్ణా రెడ్డి 1985 నాటి ‘భారతి’ మాస పత్రికలో వెల్లడించారు.