బురుజు.కాం Buruju.com : ఒకప్పుడు తెలుగు వారి మెడలోను, చేతులకు నల్లటి కాశీ తాళ్లు కనిపించేవి. ఇప్పుడు అవన్నీ కనుమరుగయ్యాయి. ఇటీవల ప్రధాన మంత్రి మోదీ.. తెలుగు వారికి కాశీతో గల చిరకాల బంధాన్ని తెలిపేందుకు కాశీతాడును ప్రస్తావించారు. నిజానికి ప్రధాన మంత్రి చెప్పినదాని కంటే చాలా ఎక్కువ అనుబంధమే తెలుగు వారికి కాశీతో ముడిపడి ఉండేది. ఒకప్పుడు.. కాశీకి వెళ్లిన వారు తిరిగి వస్తుంటే ఆ ఊరి ప్రజలు ఎదురెళ్లి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లేవారు. బొమ్మలతో గల కాషాయి వస్త్రాలు ధరించిన జాన పద కళాకారులు ‘కాశీ కావడి’ని మోస్తూ, కాశీ ప్రయాణం అనుభవాలను ప్రజలకు గేయాల రూపంలో విడమర్చి చెప్పేవారు. కావడికి అటుఇటు అమర్చిన బిందెలపై కాశీ విశ్వనాథుని విగ్రహాలు, పసుపు కుంకుమలు తదితరాలు ఉండేవి.
ఒకప్పుడు కాశీతాళ్లు చేతులకు ఇలా కనిపించేవి
ఒకప్పుడు కాశీ kasi యాత్ర చాలా కష్టంగా ఉండేది. ఏనుగుల వీరాస్వామి అనే పండితుడు 1830లో చెన్నై నుంచి కాశీకి కుటుంబ సమేతంగా కాలినడకన ఆంధ్ర, తెలంగాణల మీదగా వెళ్లి రావటానికి 15నెలల 15 రోజుల సమయం పట్టింది. ఆయన తన రోజువారీ అనుభవాలన్నింటినీ ‘కాశీయాత్ర’ అనే గ్రంధం ద్వారా వెల్లడించారు. ‘కాశీకి పోయిన వాడు, కాటికి పోయినవాడు సమానమని అనేవారు’ అని మల్లంపల్లి సోమ శేఖర శర్మ తన ‘ తెలుగు విజ్ఞాన సర్వస్వము’ లో తెలిపారు. ఇప్పుడు హైదరాబాదు నుంచి విమానంలో రూ. 8,000 టిక్కెట్టుతో కేవలం రెండు గంటల వ్యవధిలోనే కాశీకి వెళ్లగలిగే సౌలభ్యం అందుబాటులో ఉంది. దీంతో కాశీకి వెళ్లినవారు గతంలో మాదిరిగా అక్కడి నుంచి కాశీ తాళ్లను ( కొన్ని ప్రాంతాల్లో కాశీదారం అనేవారు) , గంగా జలంతో సీలు వేసి ఉండే చిన్నసైజు రాగి చెంబులను తెచ్చి బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టటం తగ్గిపోయింది. అసలు.. మాటల సందర్భంగా చెబితే తప్ప ఇంటి పక్కవారు సైతం కాశీకి వెళ్లి వచ్చిన విషయమే తెలియటం లేదు.
కాశీ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు
‘అప్పుచేసి పప్పుకూడు’ సినిమాలోని ‘కాశీకి పోయాను రామా హరి’ ఒకప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన గీతం. తెలుగు నేలపై ప్రచారంలో ఉన్న జానపద గేయాన్ని అలా పాటగా సినిమాలో పెట్టారు. అప్పట్లో కాశీ విశిష్టతను తెలిపే జానపద కళాకారులతో పాటు నిజంగా కాశీకి వెళ్లి వచ్చిన భక్తులు కూడా ‘కాశీ కావడి’తో కనిపించేవారు. ఇటువంటి సమయంలోనే అసలు కాశీకి వెళ్లకుండానే కొంత మంది కాల్వలోని నీళ్లను తెచ్చి కాశీ జలం అంటున్నారని హాస్యంతో పాడే జానపద గేయాలు కూడా పుట్టాయి. అప్పటి కొన్ని సంగతులను మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి తన ‘జానపద కళారూపాలు’ అనే గంధ్రంలో వివరించారు. కాశీకి వెళ్లి వచ్చినవారు ‘కాశీ సమారాధన’ నిర్వహించి భోజనాలు పెట్టేవారని, కాశీకి వెళ్లినవారిని గౌరవిస్తే తాము అక్కడికి వెళ్లినంత పుణ్యమనే భావనతో వారికి బట్టలను పెట్టేవారని నేషనల్ ఇన్సూరెన్సు కంపెనీ విశ్రాంత డిప్యూటీ మేనేజర్ కొత్తమాసు వెంకట సుబ్బయ్య Buruju.com కు తెలిపారు. ఇవన్నీ తెలుగు వారికి కాశీతో గల అవినాభావ సంబంధాలను తెలియజేస్తున్నాయి.
182 ఏళ్ల క్రితం ఏనుగుల వీరస్వామి కాశీయాత్ర ఊహా చిత్రం ఇది. ఆయన తన గ్రంధంలో తెలుగు ప్రాంతాల వివరాలను పొందుపర్చారు
తెలుగువారి పెళ్లిళ్లలో కూడా పెళ్లి కుమారుడు తాను కాశీకి వెళ్లి పోతాను అని అనటం, వార్ధక్యంలో భార్యతో కలిసి వెళ్దూవుగానిలే అంటూ అమ్మాయి తరపు వారు బుజ్జగించి పెళ్లి పీటలపైకి తీసుకెళ్లటం అనే తంతు ఉండేది. రెండు వందల సంవత్సరాల క్రితమే కాశీయాత్ర అత్యంత సంక్లిష్టంగా ఉండగా 600 ఏళ్ల క్రితం ఇంకెలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. అప్పట్లో అంటే.. క్రీ.శ 1402-1420 మధ్యలో శ్రీనాథుడు నాటి ప్రభువు పెదకోమటి వేమారెడ్డితో కలిసి కాశీకి వెళ్లాడని, అందువల్లనే కాశీ గురించి ఆయన ‘భీమేశ్వర పురాణం’, ‘కాశీ ఖండం’ కావ్యాల్లో బాగా రాయగలిగారని ‘ కొండవీటి ప్రాభవం’ అనే గ్రంధంలో పోలవరపు కోటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రస్తుతం కాశీతాళ్లు లేవుకాని.. వాటిని పోలిన వాటిని యువకులు అమెజాన్ లో కొనుగోలు చేసి చేతులకు ధరిస్తుండటం విశేషం.