(‘బురుజు’ )
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈసీ (ఎన్కంబరన్స్ సర్టిఫికెట్)ని ఒక గంటలో చేతికి ఇవ్వకుంటే అలస్యమైన ప్రతి గంటకు రూ.10 చొప్పున జరిమానాగా వసూలు చేయొచ్చనే విషయం ఎంతమందికి తెలుసు? స్థిరాస్తి దస్తావేజుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసి, స్కాన్ చేసి 24 గంటల్లోగా దానిని అందజేయకుంటే ఆలస్యమైన ప్రతి ఒక్క రోజుకు సబ్ రిజిస్ట్రారు రూ.50 చొప్పున పరిహారంగా ఇవ్వాలనే విషయమూ తెలియకపోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి నిబంధనలు ఎనిమిదేళ్ల క్రితమే అమల్లోకి వచ్చినప్పటికీ.. వాటి గురుంచి ఏమాత్రం ప్రచారం లేకపోవటం, నిబంధనలు ఎంతవరకు అమలవుతున్నదీ ఉన్నతాధికారులు సమీక్షించిన దాఖలాలు మృగ్యం కావటం వంటి కారణాల వల్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చేవారికి అగచాట్లు తప్పటంలేదు. డాక్యుమెంట్ రైటర్ల పేర్లతో ఆయా పరిసరాల్లో తిష్టవేసి ఉండే వారి ద్వారా వెళ్తే తప్ప అక్కడ ఏ ఒక్క పని పూర్తి కాదన్న విషయం మాత్రం తెలుగు రాష్ట్రాల వారందరికీ బాగా తెలుసు. తెలంగాణలో వ్యవసాయ కమతాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తహశీల్దార్ కార్యాలయా లకు బదిలీ అయ్యి.. సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో పని వత్తిడి తగ్గినందున ఇక నైనా పౌరసేవా పత్రం నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా సర్కారు చర్యలు చేపట్టాలి.
ఆస్తుల లావాదేవీల సమయంలో కొనుగోలుదారులు ప్రప్రధమంగా చూసేది ఈసీనే. ఆస్తి ఎన్ని చేతులు మారిందీ .. ప్రస్తుతం అది ఎవరి పేరుతో ఉన్నదీ ఈసీ ద్వారా సులువుగా తెలుస్తుంది. ఉమ్మడి రాష్ట్రం రిజిస్ట్రేషన్ శాఖలో 1983లో కంప్యూటరీకరణ మొదలు కావటంతో అప్పటి నుంచి కొనసాగిన లావాదేవీల ఈసీని ఇప్పుడు కంప్యూటర్ నుంచి నిముషాల వ్యవధిలోనే దరఖాస్తుదారుడికి అందజేయవచ్చు. ఇంకా దస్తావేజులను, వాటి నకళ్లను కూడా జాప్యంలేకుండానే ఇవ్వొచ్చు. ఇటువంటి కారణంగానే 2013లో.. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి వీకే అగర్వాల్.. పౌర సేవల పత్రాన్ని (సిటిజెన్స్ చార్టర్) రూపొందించారు . దీనిలో 22 రకాల సేవలను పొందుపర్చారు. వీటిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చెందిన సేవలు 7 ఉన్నాయి. చిట్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చెందినవి 5, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలోని సేవలు 8 ఉన్నాయి. మరో 2 సేవలు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ కార్యాలయం పరిధిలోనివి. ఇటువంటి 22 రకాల సేవలను ఎంత వ్యవధిలోగా దరఖాస్తుదారులకు అందజేయాలో వివరించి.. వాటి అమల్లో జాప్యమైనప్పుడు జరిమానాలను చెల్లించాలని ఆనాటి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం.. ఉభయ రాష్ట్రాలు నాటి ఉత్తర్వులను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించాయేతప్ప అవి ఎంతవరకు అమలవుతున్నదీ ఏనాడూ పరిశీలించలేదు. ఈసీ కోసం వెళ్లేవారికి ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోను సర్వర్ డౌన్ అయ్యిందని, ‘మీ సేవ’కు వెళ్లి దానిని తీసుకోవాలనే సమాధానం వస్తుంది. బ్రోకర్ల ద్వారా వెళ్తే మాత్రం సర్వర్ల సమస్య ఉండనే ఉండదు.
పౌరసేవా పత్రం ప్రకారం.. ఈసీ జారీకి అక్కడి సీనియర్ లేదా జూనియర్ అసిస్టెంట్ బాధ్యులు. అంటే జాప్యానికి అతనే జరిమానాను చెల్లించాలి. కంప్యూటరీకరణకు ముందటి ఈసీని చేతితో రాసి ఇవ్వాల్సివుంటుంది కనుక దాని జారీకి మాత్రం 24 గంటల వ్యవధి ఉంటుంది. పాత సర్టిఫైడ్ కాపీలకూ ఇదే వ్యవధిని నిర్ధేశించి.. జాప్యమైతే రోజుకు రూ.50 చొప్పున జరిమానాగా నిర్ధేశించారు. రిజిస్టరులో వధూవరులు సంతకాలు చేశాక ఒక గంటలో ధృవీకరణ పత్రాన్ని జారీ చేయకుంటే అప్పుడూ గంటకు రూ.10 చొప్పున పరిహారాన్ని సబ్ రిజిస్ట్రార్ ఇవ్వాల్సివుంటుంది. సందేహాలు ఉన్న దస్తావేజును ఒక రోజులోగా జిల్లా రిజిస్ట్రారుకు పంపకుంటే సబ్ రిజిస్ట్రారు రోజుకు రూ.100 చెల్లించేందుకు సిద్ధం కావాల్సిందే. దస్తావేజులోని విలువలను తక్కువగా చూపించారనే అనుమానం ఉంటే వారం రోజుల్లోగా ఆ ఆస్తి గల ప్రాంతాన్ని సందర్శించి.. దస్తావేజును జిల్లా రిజిస్ట్రారుకు పంపాలి. పలానా ప్రాంతంలోని భూమి లేదా భవనానికి మార్కెట్ విలువ ఎంతని ఎవరైనా అడిగినప్పుడు వివరాలను చెప్పని సీనియర్ , జూనియర్ అసిస్టెంట్లు ప్రతి గంటకు రూ.10 చొప్పున ముట్టచెప్పాల్సిందే. పౌర సేవా పత్రాన్నితిరిగి 2015,జూలైలో సమీక్షించాలని 2013నాటి ఉత్తర్వులో పేర్కొనగా.. ఇంతవరకు ఆపనిని ఉభయ రాష్ట్రాలు చేపట్టనేలేదు. ఈసీని రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ ద్వారా చూసేందుకు ఇప్పుడు అవకాశం ఉన్నప్పటికీ సబ్ రిజిస్ట్రార్ సంతకం ఉండదు కనుక అధికారికంగా దానికి విలువ ఉండబోదు. అందుకే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి వాటిని తీసుకొనేందుకు అంతా ప్రాధాన్యం ఇస్తుంటారు. సేవల్లో పారదర్శకత, వాటిని వేగంగా అందుబాటులోకి తేవటం, రిజిస్ట్రేషన్ విధులను నమ్మకమైనవాటిగా ప్రజలు పరిగణించటం లక్ష్యాలుగా అప్పటి 2వ పరిపాలన సంస్కరణల సంఘం సిఫార్సులకు అనుగుణంగానే పౌరసేవా పత్రంపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. అవి ఆచరణకు నోచుకోవటం లేదంటే నాటి పరిపాలన సంస్కరణలు ప్రజలకు అందుబాటులోకి రాలేదని స్పష్టమవుతోంది. ఇవన్నీ పౌర సంఘాలు గట్టిగా ప్రశ్నించాల్సిన అంశాలు.