బురుజు Buruju.com : Hyderabad: అతనో బందిపోటు. దాదాపుగా 200 ఏళ్ల క్రితం హైదరాబాదును దోచుకొందామని సుదూర ప్రాంతం నుంచి అనుచరులతో సహా వచ్చాడు. అనూహ్యంగా ఒక సౌందర్యవతి ప్రేమలో పడ్డాడు. అప్పటికే ఒక వృద్ధుడి చెరలో ఉన్న ఆమెకు విముక్తి కలిగించాడు. తన వెంట తీసుకెళ్లిపోయి వివాహం చేసుకొన్నాడు. ఆమె ప్రమానురాగాలు అతనిలో పరివర్తనను తెచ్చాయి. తన ప్రేమ గాథను గ్రంథస్తం చేసి అది ఎప్పటికీ లోకానికి గుర్తుండిపోయేలా చేసుకొన్నాడు. గోల్కొండ కోట సమీప కుతుబుషాహీల గోరీలు ఇప్పటికీ వారి ప్రేమ కథకు మూగ సాక్ష్యాలుగా ఉన్నాయి. దివంగత ఐఏఎస్ అధికారి నరేంద్ర లూథర్.. తాను రాసిన ‘‘ మహ్మద్ కులీకుతుబ్ షా ’’ అనే గ్రంధంలో ఆ బందిపోటు ఉదంతాన్ని కొన్ని ఆధారాలతో పొందుపర్చారు.
1902లో గోల్కొండ కోట.. అక్కడి నుంచి కనిపిస్తున్న కుతుబ్ షాహీ వంశీకుల సమాధులు
హైదరాబాదుకు 1820 ప్రాంతంలో అమీర్ అలి అనే బందిపోటు దోపిడీ చేయటానికి వచ్చాడు. నగరమంతా కలియతిరుగుతూ.. గోల్కొండ సమీపంలోని కుతుబ్ షాహీ రాజుల గోరీలను ( సమాధులు-tombs) చూడటానికి వచ్చినప్పుడు ఆక్కడికి సమీపంలోని ఒక భవనం బాల్కనీ నుంచి అజీమా అనే యవతి అతన్ని చూసింది. అలా చూసీ చూడగానే మనసు పారేసుకొంది. గోరీల ప్రాంగణంలోకి వెళ్లిన యువకుడి వద్దకు.. తన సేవకురాలైన కల్లును పంపి.. తాను అతన్ని కలవదలచుకొంటున్న విషయాన్ని ఆమె ద్వారా చెప్పించింది. గోరీలకు దగ్గరలోనే గల హజరత్ షా వలి దర్గా వద్దకు మురుసటి రోజు ఉదయం రావాల్సిందిగా అతను ఆ సేవకురాలికి చెప్పి పంపించాడు.
ఆధునీకరణ అనంతరం విద్యుత్ కాంతుల్లో మెరుస్తున్న కట్టడాలు
ఆ మరుసటి రోజు.. అత్యంత సౌందర్యవతి అయిన అజీమాను చూడగానే అమీర్ అలి సైతం ప్రేమలో పడిపోయాడు. తనను క్రూరుడైన ఒక వృద్ధుడు వివాహం చేసుకొని నరకాన్ని చూపిస్తున్నాడని, తనను ఎక్కడికైనా తీసుకెళ్లిపోవాలని ఆమె కోరటంతో అతను అలాగే చేశాడు. ఆమెను హైదరాబాదు నుంచి తీసుకెళ్లిపోయి వివాహం చేసుకొన్నట్టుగా అమీర్ అలి ఒక పుస్తకంలో రాసుకొన్నాడు. అప్పటి హుస్సేను సాగర్, చార్మినార్ తదితర ప్రాంతాలు ఎంత అద్భుతంగా ఉన్నదీ దానిలో వివరించాడు. అతను పేర్కొన్న విషయాలు ఆధారంగా.. 1839లో మెడోస్ టేలర్ అనే చరిత్రకారుడు ‘‘ కన్ఫెషన్స్ ఆప్ ఏ థగ్ ’’ పేరుతో ఒక గ్రంధాన్ని వెలువరించాడు. దానిలోని విషయాలనే దివంగత ఐఏఎస్ అధికారి నరేంద్ర లూథర్.. 1997లో వెలువరించిన తన ‘
మహమ్మద్ కులీకుతుబ్ షా’లో పొందుపర్చారు.
అజీమా.. తాను రాజుల సమాధుల మధ్య తొలుత ఎలా గడిపిందీ అమీర్ వర్ణించాడు. ‘‘ గోరీల ప్రాంగణంలో అంతా నిశ్శబ్ధం, నిర్మాణష్యం. మేము ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోకుండా.. రాజవంశీకుల గోరీలను ఒక్కో దాన్ని చూసుకొంటూ ముందుకు కదిలాం. సమాధుల్లోని కొన్ని గదులైతే గబ్బిలాలు, అడవి పావురాలతో నిండివున్నాయి. వాటి కూతలు గుమ్మటాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. మరికొన్ని గదుల విశాలమైన ఆర్చీల జాలీలు.. పగటి వెలుగులను లోనికి ప్రసరింపజేస్తున్నాయి. మేము ఆ కాంతిలో ఒకరినొకరం చూసుకొని ఆనందించాం’’ అని వర్ణించాడు. ఇటీవల కాలంలో గోరీల ప్రాంగణాన్ని ఆధునీకరించారు. సినిమాల చిత్రీకరణకు అది నిలయంగా మారింది. వీటికి సెవన్ టూమ్స్ seven tombs అనే పేరు ప్రచారంలో ఉంది.