బురుజు.కాం Buruju.com : Hyderabad : కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పాదుకుల కొలతలను తీసి పోలిస్తే అవి నటుడు ఎన్టీ రామరావు పాదాలకు సరిపోయాయి. బ్రహ్మంగారి ఉంగరం ఎన్టీఆర్ వేలికి సరిగ్గా సరిపోయింది. అంతేకాదు.. బ్రహ్మంగారి తరంలోని వారికి, ఎన్టీఆర్ కు రూపాల్లో సారూప్యం ఉన్నట్టు తేలింది. ఇవన్నీ ‘ వీర బ్రహ్మేంద్ర స్వామి’ సినిమాను తీస్తున్నప్పుడు వెల్లడయ్యాయి. ఇటువంటి విషయాల కారణంగా బ్రహ్మంగారి అపర అవతారంగా ఎన్టీఆర్ ను అంతా భావిస్తున్నారని అప్పట్లో వెలువడిన ఎన్టీఆర్ జీవిత చిత్ర గ్రంథం శ్లాఘించింది. సినిమా విడుదలయ్యి 40 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని Buruju.com అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా కందిమల్లాయపల్లిలోని బ్రహ్మంగారి మఠం ఆలయం
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆరాధించేవారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో బాగా పెరుగుతోంది. భవిష్యత్తులో ఉత్నన్నమయ్యే సంఘటనల గురించి బ్రహ్మంగారు ముందుగానే వెల్లడించారని బాగా ప్రచారంలో ఉండటమే ఇటువంటి ఆదరణకు కారణం. ప్రముఖ హీరో ఎన్.టి. రామారావు N.T. Rama Rao.. 1981లో ‘ శ్రీ మద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ పేరుతో సినిమాను తీశారు. దీనిలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలంటూ సెన్సారు బోర్డు ఆంక్షలు విధించటంతో ఎన్టీఆర్ హైకోర్టుకు వెళ్లి అనుకూల ఉత్తర్వులు తెచ్చుకోవటానికి మూడేళ్లు పట్టి.. సినిమా 1984, నవంబరులో విడుదలయ్యింది. సినిమాకు జనం నీరాజనాలు పలికారు. ఇది ప్రస్తుతం యూట్యూబులో అందుబాటులో ఉంది. ప్రతి సన్నివేశాన్ని కన్నార్పకుండా చూడాలన్నంతగా ఇప్పటికీ అనిపించటం సినిమా గొప్పతనం. దీనిలో 23పాటలు, శ్లోకాలు ఉండగా అవన్నీ ఆలోచింపజేసేవిగానే ఉంటాయి.
దళితులను అక్కున చేర్చుకొన్న బ్రహ్మేంద్ర స్వామి
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు Pothuluri Veera Brahmendra Swamy క్రీ.శ. 1750 ప్రాంతంలో జీవించినట్టుగా ప్రముఖ రచయిత ఆరుద్ర Aurudra కొన్ని లెక్కలు వేసి తన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’లో వెల్లడించారు. బ్రహ్మంగారు అప్పట్లో సంచరించిన కడప జిల్లాలోని ప్రాంతాల్లోనే సన్నవేశాలను చిత్రీకరించటంతో సినిమాకు మరింత నిండుదనం చేకూరింది. ఇలా చిత్రీకరణ సమయంలో ఆయన వారసులతోను ఎన్టీఆర్ కు అనుబంధం ఏర్పడింది. అప్పటికి పీఠాధిపతిగా వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఆయన నాయనమ్మ పేరు పిచ్చమ్మ. ఆమె మామ అచ్చం పోతులూరి వీరబ్రహ్మంగారికి మల్లే ఉంటారని ప్రచారం ఉండేది. సినిమా షూటింగు సమయంలో ఎన్టీఆర్ ను చూసిన పిచ్చమ్మ.. అచ్చం ‘జేజి నాయనను సూస్తున్నాను’ అంటూ తన మనవుడి వద్ద ఆనందాన్ని వ్యక్తం చేశారు .
1989లో వెలువడిన ‘విజేత’ సంకలనంలో బ్రహ్మంగారి ఉంగరం , పాదుకల కొలతలు ఎన్టీఆర్ కొలతలు ఒకేలా ఉన్నాయని వివరించిన పేరా ఇదే
కడపకు 60 కి.మీ దూరంలోని కందిమల్లాయపల్లిలో బ్రహ్మంగారి జీవ సమాధి ఉంది. అక్కడికి దగ్గరలోనే గల సిద్ధయ్య మఠంలో బ్రహ్మంగారి చేతి ఉంగరం (అయ్యగారి ముద్ర) ఇప్పటికి భద్రంగా ఉంది. అది ఎన్టీఆర్ వేలికి సరిగ్గా అతికినట్టుగా సరిపోయిందని, పాదుకల కొలతలు ఎన్టీఆర్ పాదాలకు సరిపోయాయని 1989లో వెలువడిన ‘విజేత’ అనే సంకలనంలో వివరించారు. దీనిలో ఎన్టీఆర్ కుటుంబానికి, సినిమాలకు చెందిన అరుదైన పలు చిత్రాలను ముద్రించారు. బ్రహ్మంగారి సినిమాకు, ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన అత్యంత ఆసక్తి కలిగించే అంశాలు కొన్ని ఉన్నాయి. సినిమాను తీస్తున్న సమయంలోనే (1981) ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయాలనే యోచనకు వచ్చారు. సినిమా విడుదలైన 1984, నవంబరు నాటికి .. అంటే మూడేళ్ల వ్యవధిలోనే తెలుగుదేశం పార్టీని నెలకొల్పటం, ముఖ్యమంత్రి కావటం, నాదెళ్ల భాస్కరరావు తిరుగు బాటు కారణంగా పదవిని కోల్పోయి తిరిగి నెలరోజుల్లోనే ముఖ్యమంత్రి కావటం వంటి పరిణామాలు చకచకా చోటు చేసుకొన్నాయి. మొత్తం మీద బ్రహ్మంగారి సినిమా విడుదల సమయానికి ఆయన రెండో సారి ముఖ్యమంత్రిగా ఉన్నారు.