తెలంగాణ పంట పొలాల్లో.. పల్నాటి నాగమ్మ పసుపు, కుంకుమలు!
personBuruju Editor date_range2024-07-23
తెలంగాణలోని జగిత్యాల జిల్లా (పూర్వపు కరీనంనగర్ జిల్లా) అరవెల్లి గ్రామంలోని ఆలయంలో నాయకురాలు నాగమ్మ ప్రతిమ
బురుజు.కాం Buruju.com : నాయకురాలు నాగమ్మను ఆంధ్రా ప్రాంతంలో దుష్టశక్తిగా పరిగణిస్తారు. తెలంగాణలో మాత్రం ఆమె ఒక దేవత. పంటలను చీడపీడల నుంచి రక్షిస్తుందనే విశ్వాసంతో.. ఆమె ఆలయంలోని పసుపు, కుంకుమలను తీసుకెళ్లి రైతులు పంట పొలాల్లో జల్లుకొంటుంటారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా పెగడవల్లి మండలం అరవెల్లి గ్రామంలో ఆమెకు శతాబ్ధాలు కిత్రం కట్టిన ఆలయం.. ఇప్పటికీ నిత్యపూజలను అందుకొంటున్న విషయం చాలా మందికి తెలియదు. గ్రామంలో ఇళ్ల నిర్మాణాల సమయంలో బయటపడిన నాగిని తదితర విగ్రహాలను బట్టి.. పురావస్తు శాఖ తవ్వకాలను చేపడితే అక్కడ మరింత చరిత్ర వెలుగు చూసే అవకాశం ఉంది.
అరవెల్లిలో నాయకురాలు నాగమ్మ ఆలయం
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలోని కారెంపూడిలో క్రీ.శ. 1182లో.. అంటే ఇప్పటికి 840 ఏళ్ల క్రితం పల్నాటి యుద్ధం ఉత్పన్నమయ్యింది. పల్నాటి రాజ్యం కోసం ఇద్దరు సవతి సోదరుల మధ్య నెలకొన్న కలహాలే మహా యుద్ధానికి దారితీశాయి. ఆ యుద్ధంలో ఒక వర్గానికి నాగమ్మ, మరో వర్గానికి బ్రహ్మనాయుడు సలహాలు ఇస్తూ వచ్చారు. అప్పటికే నాగమ్మ తన అపార రాజకీయ చాతుర్యంతో రాజ్యంలో ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగింది. కోడి పందాలు ఆడించి రెండో వర్గాన్ని రెచ్చకొట్టిందని.. వంటి కారణాలను చూపిస్తూ.. శ్రీనాధుడు తన ‘పల్నాటి యుద్ధం’ కావ్యంలో ఆమెను దుష్ట శక్తిగా చిత్రీకరించారు. పల్నాటి యుద్ధంపై ఇప్పటికీ ఒళ్లుగగుర్పొరిచే రీతిలో కథాగానం చేసే గ్రామీణ కళాకారులూ నాగమ్మను లోక కంఠకిగానే ప్రచారం చేస్తున్నారు. చాపకూడు పేరుతో అన్ని కులాలవారితో కలసి సహపంక్తి భోజనం చేసిన బ్రహ్మనాయుడిని వారు కీర్తిస్తుంటారు.
నాగదేవత శిల్పాలు చాలా చోట్ల వెలుగు చూస్తూ ఉంటాయి. అరవెల్లిలో ఇళ్ల నిర్మాణ సమయంలో బయటపడిన నాగదేవత విగ్రహం మాత్రం ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. ఆమె ఒక చేతిలో కత్తి, మరో చేతిలో డాలు ఉన్నాయి. నాగమ్మకు ప్రతిరూపంగానే ఇది చెక్కి ఉండొచ్చని భావించొచ్చు
నాగమ్మ స్వస్తలం పల్నాటిలోని గామాలపాడు. ఆమె తెలంగాణలోని అరవెల్లి గ్రామానికి కోడలుగా వచ్చినట్లు ‘పల్నాటి వీరచరిత్ర,’ ‘క్రీడాభిరామం’ కావ్యాలు చెబుతున్నాయి. వివాహమైన కొంతకాలానికే నాగమ్మ భర్త చనిపోవటంతో.. ఆమె తిరిగి పుట్టింటికి వెళ్లిపోయి గుర్రపు స్వారీ, విలువిద్య వంటివాటిలో ఆరితేరి ప్రధానమంత్రి పదవి వరకు వెళ్లగలిగింది. ఆమె సాహసాలను తెలుసుకొంటూ వచ్చిన తెలంగాణలోని అరవెల్లి ప్రాంతీయులు.. ఆమె మరణించిన తర్వాత ఇక్కడ ఆలయాన్ని నిర్మించి ఉండొచ్చు. అది మిగతా ఆలయాలకు భిన్నంగా ఉంటుంది. మెట్లమీదగా కోనేరులోకి దిగినట్టుగా.. మనం దిగవకు వెళ్లాల్సివుంటుంది. అక్కడ చెక్కతో చెక్కిన నాటి నాగమ్మ విగ్రహం మనకు కనిపిస్తుంది. తరతరాలుగా తమ కుటుంబీకులే ఆలయంలో నిత్యం దూపదీప నైవేద్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు అదే గ్రామానికి చెందిన భాగ్యమ్మ.. ‘బురుజు’ ప్రతినిధికి తెలిపారు.
గ్రామంలో వివిధ సందర్భాల్లో బయటపడిన విగ్రహాలు ఆలయం వద్ద గల చెట్టుకొంద కనిపిస్తాయి. నాగమ్మ పేరు ప్రతిఫలించేలా.. నాగిని దేహంతో గల ఒక దేవత విగ్రహం కూడా వాటిలో ఉంది. నాగమ్మ తెలంగాణ కోడలనే కారణంగానో లేక ఇతర కారణాల వల్లనో .. అప్పట్లో కాకతీయులు నాగమ్మ మద్ధతు పలికిన వర్గానికే తమ సేనలను పంపి సహకరించినట్టు చరిత్రపుటల్లో లిఖించి ఉంది. చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆలయ సందర్శన అనంతరం అక్కడి పసుపు, కుంకుమలను తీసుకెళ్లి తమ పొలాల్లో జల్లుకొనే సంప్రదాయం శతాబ్ధాలుగా కొనసాగుతోంది. చరిత్ర పట్ల ఆసక్తి గలవారికి ఆలయ సందర్శన మంచి అనుభూతిని ఇస్తుంది.