రవితేజ ‘ఆటోగ్రాఫ్’ సినిమాలోని విమల ఇప్పుడు ఏం చేస్తోందంటే..
personBuruju Editor date_range2025-01-29
1) నా ఆటోగ్రాఫ్ చిత్రంలో తన పిల్లలతో విమల (మల్లిక) (2) సినిమాలకు స్వస్తి పలికి నిజజీవితంలో తన ఇద్దరు పిల్లలు, భర్తతో మల్లిక
బురుజు.కాం Buruju.com : Hyderabad: రవితేజ హీరోగా నటించిన ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ సినిమా విజయాన్ని చవిచూడనప్పటికీ దానిలోని పాటలు, కొన్ని దృశ్యాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. కథలోని ఏదో ఒక పాత్ర ప్రతి ఒక్కరి నిజజీవితంలో పలకరించి ఉండటమే దీనికి కారణం. సినిమాలోని రవితేజ చిన్నప్పటి స్నేహితురాలు విమల (మల్లిక) పాత్రను గుర్తుకు తెచ్చుకొన్నవారు ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. నటి మల్లిక Mallika మాత్రం తాను స్వస్తి పలికిన సినీ రంగం జ్ఞాపకాలను నెమరవేసుకొంటూ ఇప్పుడు కేరళలో గృహిణి పాత్రను విజయవంతంగా పోషిస్తున్నారు . ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ Naa Autograph Sweet Memories విడుదలయ్యి 20 ఏళ్లు అయిన సందర్భంగా Buruju.com అందిస్తున్న ఆసక్తికర కథనం ఇది.
1) నా ఆటోగ్రాఫ్ సినిమాలో విమల పాత్రలో మల్లిక (2) తమిళ, మళయాల నటిగా
సినిమాలో హీరో రవితేజ Ravi Teja తాను పదో తరగతిలో ప్రేమించిన విమలను కూడా తన పెళ్లికి ఆహ్వానించేందుకు గోదావరి జిల్లాలోని గ్రామానికి తన స్నేహితుడితో కలసి వెళ్తాడు. అప్పటికే ఆమెకు వివాహమయ్యి ముగ్గురు పిల్లల తల్లిగా ఉంటుంది. రవితేజ ఆమెను ఉద్దేశించి ‘ ఏమిటి? నువ్విలా..’ అంటూ ప్రశ్నించగా ‘నాకేమిటి? చూడు నాకు ముగ్గురు పిల్లలు’ అంటూ గర్వంగా చెబుతుంది. ఇప్పుడు అచ్చంగా నిజ జీవితంలోను ఆమె అలాగే చెబుతుండటం విశేషం. సినిమాలో విమలగా నటించిన మళయాల నటి మల్లిక.. సినిమాలకు స్వస్తిపలికి కేరళలోని త్రిస్సూర్ లో భర్త, ఇద్దరు పిల్లలతో హాయిగా జీవిస్తున్నారు.
రవితేజను విమల గుర్తుపట్టిన కొంత సేపటికి ఆమె భర్త వస్తాడు. తమ ఇంటికి వచ్చిన ఇద్దరూ తనకు పదో తరగతి క్లాస్ మేట్స్ అని , వారికి కూల్ డ్రింక్స్ ఏవైనా తెమ్మని భర్తకు చెబుతుంది. ఆ సన్నివేశంలో ఇంటి గోడపై చంద్రబాబు పొటో గల పొస్టర్ ఒకటి కనిపిస్తుంది. అప్పటికి చంద్రబాబు రెండో సారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లో కుటుంబ నియంత్రణకు ఆయన ప్రాధాన్యం ఇచ్చేవారు. అయినప్పటికీ తనకు ముగ్గురు పిల్లలని రవితేజతో విమల గర్వంగా చెబుతుంది. ఇప్పుడు చంద్రబాబు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనాల్సిందిగా ప్రచారం చేస్తుండటం విశేషం
‘నా ఆటోగ్రాఫ్’ (2004) తర్వాత తెలుగులో ఇక ఏ చిత్రంలోను అమె కనిపించనప్పటికీ 28 తమిళ, మళయాల చిత్రాల్లో నటించారు. రెండు తమిళ బుల్లితెర సీరియళ్లలోను నటించి 2013లో వెండి, బుల్లితెరల నుంచి వైదొలగారు. ఇప్పుడు మల్లిక జగదీష్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో తన కుటుంబ ఫొటోలను పోస్టు చేస్తున్నారు. వికిపేడియా ప్రకారం ఆమె క్రైస్తవ మతానికి చెందిన వారు. అసలు పేరు రీజా జాన్సన్ Reeja Johnson. తొలిసారిగా 2002లో తమిళ సినిమాలో నటించినప్పుడు పేరును మల్లికగా మార్చుకొన్నారు. తమిళంలో 2002లో ఆటోగ్రాఫ్ పేరుతో వచ్చిన సినిమాకు ‘ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ రేమేక్. రెండు సినిమాల్లోను హీరో స్నేహితురాలిగా మల్లికే నటించారు.
1) తమిళ ఆటోగ్రాఫ్ లోని దృశ్యం (2) తెలుగు ఆటోగ్రాఫ్
నిజానికి తమిళ ఆటోగ్రాఫ్ కంటే తెలుగు ఆటోగ్రాఫ్ చాలా బాగుంటుంది. పలు సన్నివేశాల్లోని భావోద్వేగాలు ప్రేక్షకుల హ్రుదయాలను కట్టిపడేస్తాయి. ‘ గుర్తుకొస్తున్నాయి’ పాట వింటున్నప్పుడు దానిలోని ప్రతి సంఘటన తాము చవిచూసిందేననే భావన కలుగుతుంది. ‘మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది’ పాట జీవితంలోని ఒడుదిడుగులను ఎలా అధిమించాలో తెలియజేస్తుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రవితేజ అభిప్రాయపడినట్టుగా ఈ సినిమా కనుక 20 ఏళ్ల క్రితం కాకుండా ఇప్పుడు విడుదలై ఉంటే మంచి విజయాన్ని అందుకొని ఉండేది. ఎందువల్ల నంటే ఇదే తరహాకు చెందిన ‘జాను’, ’సీతారామం’ వంటి చిత్రాలు ఘన విజయం సాధించాయి. ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన మార్పునకు తార్కాణం ఇది. ఆనాడు ‘నా ఆటోగ్రాప్’ కనుక బాగా ఆడి ఉంటే తెలుగు చిత్రసీమలోను మల్లికకు పలు అవకాశాలు వచ్చుండేవి.