తోడేలు నుంచి బిడ్డను కాపాడుకొన్న తల్లి.. అచ్చం ఆ సినిమాలో మాదిరిగానే..
personBuruju Editor date_range2022-07-02
సాహస నారి హిరకాని
బురుజు.కాం Buruju.com : Hyderabad: దాదాపు రెండేళ్ల క్రితం విడుదలైన హిరకాని Hirakani అనే మరాఠా చిత్రంలో ఒక తల్లి తోడేలును చీల్చిచెండాడి తన బిడ్డను కాపాడుకొంటుంది. అచ్చంగా ఇటువంటి సంఘటనే 2024, సెప్టెంబరు 1వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని హర్ది ప్రాంతంలో చోటు చేసుకొంది. అక్కడి పరాస్ అనే మహిళ తోడేలు నోటి నుంచి తన బిడ్డ కింద పడేవరకు దాని మెడను తన చేతులతో గట్టిగా బిగించి పట్టుకొని ఔరా అని పించింది. స్పూర్తిదాయకమైన చిత్రాలను కనుక నిర్మించగలిగితే వాటి ప్రేరణతో ఇటువంటి సాహస కృత్యాలు చోటు చేసుకోగలుగుతాయి. హిరకాని సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఛత్రపతి శివాజీ పాలన కాలంలో ఒక తల్లి తన పసి బిడ్డకు పాలు ఇవ్వటం కోసం రాత్రి వేళ.. దారితెన్ను తెలియని ఒక ఎత్తైన కొండ పైనుంచి దిగటమే సినిమా ఇతివృత్తం.
మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లా మహడ్ లోని ఎత్తైన కొండపై గల కోట నుంచి శివాజీ క్రీ.శ 1650 ప్రాంతం నుంచి పాలించాడు. కోట దిగువలోని ఒక గ్రామానికి చెందిన హిరకాని అనే పాలను అమ్మే మహిళ ప్రతిరోజు కోటలోకి మెట్లమీదగా వెళ్లి పాలను పోస్తూ ఉంటుంది. ఛత్రపతి శివాజిని చూడాలనేది ఆమె చిరకాల వాంఛ. దీని కోసం ఒక రోజు.. కోటలోపలికి వెళ్తుంది. అక్కడి నిబంధనల ప్రకారం సాయంత్రం కాగానే కోట ప్రధాన ద్వారం తలుపులను మూసివేస్తారు. కొండ దిగువన తన ఇంటిలో ఒక బామ్మకు అప్పగించి వచ్చిన తన నెలల నుండని తన పసి బిడ్డ ఆమెకు పాలను పట్టాల్సివుంటుంది. దీంతో ఆ రాత్రివేళ.. చాటుగా కోట వెనుక వైపు నుంచి కిందకు దిగుతుంది. అదంతా పెద్ద రాళ్లతోను, పొదలతోను చాలా సంక్లిష్టంగా ఉంటుంది.
తేనెటీగలు ఆమెపై దాడి చేస్తాయి. విష సర్పం ఒంటిపై పాకుతుంది. పై నుంచి సైనికులు అగ్నిగోళాలను వేస్తుంటారు. అక్కడి నుంచి ఎట్టకేలకు కిందకు దిగి ఇంటికి వెళ్లే సరికి రక్తపు నోటితో ఒక తోడేలు ఇంటి అరుగుపై తచ్చాడుతూ కనిపిస్తుంది. అది బిడ్డను తినేసిందేమోనని కలవరపడిన ఆమె.. మరో సారి ఎక్కడ లేని ధైర్యాన్ని తెచ్చుకొని ఈటెతో తోడేలును చంపేస్తుంది. ఇంటిలోకి అందోళనగా వెళ్లిన ఆమెకు.. పసిబిడ్డ అడుకొంటూ కనిపించగానే ఎంతో ఆనందానికి లోనవుతుంది. మరుసటి రోజు సైనికులు బిడ్డతో సహా ఆమెను కోటలోకి శివాజీ వద్దకు తీసుకెళ్తారు. బిడ్డను చూసుకోవాలనే ఏకైక లక్ష్యంతోనే రాత్రి వేళ తాను కొండను దిగానని ఆమె వాపోతుంది.
హిరకాని సాహసాన్ని శివాజి గుర్తిస్తాడు. ఆమె కొండను దిగిన చోట శివాజి ఆదేశాలతో బురుజును ఏర్పాటు చేసి దానికి హిరకాని అని పేరు పెడతారు. అది ఇప్పటికీ ఉంది. దానికి ఇటీవల కాలంలో రోప్ వేను అందుబాటులోకి తెచ్చారు. రాయగడ్ కోట పూనేకు 60 కి.మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక ప్రస్తుత సంఘటన విషయానికి వస్తే .. ఉత్తరప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల తోడేళ్లు ఆరుగురు చిన్నారులతో సహా ఎనమండుగురిని చంపివేశాయి. అటవీ శాఖ వారు అతి కష్టంమీద నాలుగు తోడేళ్లను బంధించినా వాటి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో 2024, సెప్టెంబరు 1 వ తేదీన హర్ధి ప్రాంతంలో పరాస్ అనే ఆమె తన పసిబిడ్డతో సహా నిద్రిస్తుండగా ఒక తోడేలు ఇంటిలోకి ప్రవేశించి బిడ్డను నోట బిగించటం, ఆమె ఒక్కొదుటన దానిపైకి దూకి మెడను తన చేతులతో గట్టిగా పట్టుకొని కేకలు వేయటం చకచకా జరిగిపోయాయి. దీంతో తోడేలు భయపడి బిడ్డను విడిచిపెట్టి అక్కడి నుంచి పారిపోయింది. బిడ్డ ఆసుపత్రిలో కోలుకొంటున్నాడు. తోడేలు మళ్లీ వస్తే చంపేస్తానని ఆమె చెప్పింది.