తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ద్రవ్యోల్భణం ప్రతి నెలా అధికంగానే ఉంటోంది
బురుజు.కాం Buruju.com ధరల పెరుగుదలలో తెలంగాణ ఆధిక్యం కొనసాగుతూనే ఉంది. కేంద్ర గణాంకాల శాఖ తాజాగా వెలువరించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో ద్రవ్యోల్భణం రేటు 2022, జూలై నెలలో 8.58 శాతం మేర నమోదయ్యింది. అంటే 2021, జూలై నెలలో రూ. వంద రూపాయలకు లభించిన ఒక వస్తువును తెలంగాణలో ఇప్పుడు రూ.108.58 పెట్టి కొనాల్సివస్తోంది. దేశంలో మరే ఇతర రాష్ట్రంలోని ద్రవ్యలోల్భణం రేటు ఎనిమిదిని దాటలేదు. జాతీయ స్థాయిలో ఇది 6.71 శాతంగా ఉంది. విశేషమేమిటంటే.. మే, జూన్ నెలల్లో తెలంగాణలోని ధరల పెరుగుదల గ్రామాల్లో అధికంగా ఉండగా.. జూలై నెల కొచ్చేసరికి మాత్రం గ్రామాల కంటే పట్టణాల్లోని పెరుగుదల కొంత ఎక్కువగా ఉంది. ఇక్కడ పట్టణాల్లో 8.76 శాతం, గ్రామాల్లో 8.44 శాతం పెరుగుదల ఉంది.
పశ్చిమబెంగాలులోని గ్రామీణ ద్రవ్యోల్భణం 9.34 శాతం మేర ఉన్నప్పటికీ అక్కడి పట్టణాల్లో మాత్రం 6.10 శాతం మేర మాత్రమే నమోదయ్యింది. దీంతో ఆ రాష్ట్రం మొత్తం మీద చూస్తే ధరల పెరుగుదల 7.80 శాతంగా తేలుతుంది. తెలంగాణలోని మే, జూన్ నెలల్లోని ద్రవ్యోల్భణం రేటు 9 శాతాన్ని దాటి దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా.. జూలై నెలలో అది 8.58 శాతానికి తగ్గినప్పటికీ అగ్రస్థానాన్ని మాత్రం నిలుపుకొంది.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఇక్కడ 2022, జూలై నెలలో ధరల పెరుగుదల 7.38 శాతంగా నమోదయ్యింది. దేశంలో తెలంగాణ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, అసోం తర్వాత ఏపీలోనే ద్రవ్యోల్భణం అధికంగా ఉంది. తెలంగాణ కంటే భిన్నంగా.. ఏపీలో పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ధరల పెరుగుదల ఎక్కవ . ఇక్కడ పట్టణాల్లో పెరుగుదల రేటు 8.07 శాతం ఉండగా.. గ్రామాల్లో 7.04 శాతం నమోదయ్యింది. జాతీయ స్థాయి కంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ధరల జోరు అధికంగా ఉంది . కేంద్ర గణాంకాల శాఖ ప్రతి నెలా దేశ వ్యాప్తంగా2,295 గ్రామీణ, పట్టణ మార్కెట్ల నుంచి వివిధ రకాల వస్తువుల ధరలను సేకరించి ద్రవ్యోల్భణాన్ని లెక్కగడుతుంది. ఆహార వస్తువులతో పాటు దుస్తులు, వైద్యం, రవాణా, ఇంధనం, విద్య, పాలు, కూరగాయలు, పండ్లు, స్వీట్లు, చేపలు, మాంసం, వంట నూనెలు వంటి వాటి ధరలను సేకరిస్తుంది.