తాళి బొట్టుకు క్రమేణా మంగళ సూత్రాలు, పుస్తెల తాడు, శతమానం పేర్లు వచ్చాయి
బురుజు.కాం Buruju.com : వివాహ ప్రక్రియలో అతి కీలకమైన తాళిబొట్టు.. తెలుగు నేలపైనే ఆవిర్భవించింది. తాటాకు ముక్కను గుండ్రంగా చుట్టి దానిని పెళ్లి కుమార్తె మెడలో నూలు తాడుతో కట్టేవారు. తాటి ఆకుతో చేసింది కనుక దానిని తాళి, తాళి బొట్టు, తాళి కట్టు అని వ్యవహరించారు. తాటాకు స్థానంలోకి క్రమేణా రెండు పుస్తెలు ప్రవేశించి మంగళసూత్రాలు, పుస్తెల తాడు, శతమానం అనే పేర్లు వచ్చినప్పటికీ పూర్వపు తాళిబొట్టు పేరు కూడా కొనసాగుతుండటం విశేషం.
తెలుగు వారికి తాటి చెట్టు కల్ప వృక్షం . పూర్వపు కవులంతా తాటి ఆకులపైనే తమ కావ్యాలను రాసేవారు. వాటినే తాళ పత్రాలు అనేవారు. మహిళల చెవులకు కమ్మలను ఆభరణాలుగా పెట్టుకొనేవారు. కమ్మలన్నా తాటి ఆకేనని నాయని కృష్ణ కుమారి తన ‘పరిశోధన’ గ్రంధంలో స్పష్టం చేశారు. అంటే అప్పట్లో మెడకు, చెవులకు కూడా తాటి ఆకులతో చేసిన వాటినే ధరించేవారు. తాళి బొట్టుతో పాటుగా చెవి కమ్మలనే పేరు కూడా ఇప్పటికీ వ్యవహారంలో ఉండటం విశేషం. తాటాకు స్థానంలోకి ఆ తర్వాత పసుపు కొమ్ము చేరింది. ఇప్పటికీ బంగారు పుస్తెలను కొనుక్కోలేని పేదలు పసుపు కొమ్మును ధరిస్తుండం తెలిసిందే.
తాళి బొట్టును కట్టడమనే సంప్రదాయం ఉత్తర భారత దేశంలో లేనేలేదు. తెలుగు వారి నుంచే ఈ సంప్రదాయం ద్రావిడులకు చేరిందని ప్రఖ్యాత చరిత్రకారులు వేటూరి ప్రభాకర శాస్త్రి తన ‘తెలుగు మెరుగులు’ అనే గ్రంధంలో పేర్కొన్నారు. మంగళసూత్రాల ప్రస్తావన 15వ శతాబ్ధానికి చెందిన పోతన, శ్రీనాథుడు కావ్యాల నుంచే మొదలయ్యిందని ‘అశ్వధాటి కావ్యం’ అనే గ్రంధంలో రచయిత పండితేంద్ర జగన్నాథ పేర్కొన్నారు. గోవులు, పశువులే సిరిసంపదలుగా ఉన్న కాలంలో కొన్ని జాతులవారు దానంగా పొందిన గోవు మెడలో తాడు వేసి ఇంటికి తీసుకెళ్లేవారని, అదే పద్దతి కన్యాదానంగా పొందిన మహిళ మెడలోకి చేరిందని ప్రముఖ రచయిత తాపి ధర్మారావు ‘ పెళ్లి, దాని పుట్టుపూర్వోత్తరాలు’ అనే గ్రంధంలో విశ్లేషించారు.
తాపి ధర్మరావు చెప్పిన దాంట్లో వాస్తవం ఉన్నట్లైతే ఆ జాతులు తెలుగు నేలకు చెందినవే అయ్యిండాలి. ఎందు వల్లనంటే ఇలా తాళి కట్టే పద్దతి పూర్వకాలం నుంచి తెలుగు ప్రాంతాల్లోనే కొనసాగుతూ వస్తోంది. తెలుగు ఇంటి పేర్లు సైతం తాళం, తాళబత్తుల, తాళి అనే తాటి చెట్టుకు సంబంధించినవి ఉండటాన్ని బట్టి తెలుగు నేలపై తాటి చెట్టుకు ఎంతటి విశిష్టత ఉండేదో అర్దమవుతోంది. తాటాకు పదమే సంస్కృతంలోకి చేరి తాటంకం అయ్యిందని వేటూరి ప్రభాకర శాస్త్రి వెల్లడించారు.