కృష్ణకు ముందు.. అల్లూరిపై సినిమా తీయకపోవటానికి కారణం అదేనా? (పదోవ భాగం)
personBuruju Editor date_range2024-04-30
బురుజు.కాం Buruju.com (అల్లూరి శ్రీరామరాజు తమ అధీనం నుంచి పారిపోతుండగా కాల్చి చంపినట్టు 1925 నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ నివేదిలో బ్రిటీష్ ప్రభుత్వం స్పష్టంగా రాసింది. ఇలా రాయటం ఆ త్యాగమూర్తిని అవమానపర్చినట్టే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిషన్ ను ఏర్పాటు చేసి నిజాలను రాబట్టాలని, బ్రిటన్ ప్రభుత్వంతో క్షమార్పణలు చెప్పించాలని సూచిస్తూ... బురుజు.కాం అందిస్తున్న కథనాల్లో ఇది పదోవది ) అల్లూరి సీతారామరాజుపై సినిమాను తీయాలన్నా మన చిత్రసీమ ప్రముఖులు చాలా కాలం భయపడుతూ వచ్చారు. అప్పటికి ప్రజా ప్రతినిధులుగా చెలామణి అవుతున్నవారిలో పలువురు.. సీతారామ రాజు ఏమయ్యిందీ పట్టించుకోని చరిత్రగల వారు కనుకనే సినిమా తీయదలచుకొన్నవారికి ఆయా నేతల నుంచి ప్రతిబంధకాలు ఎదురయ్యాయని చెప్పొచ్చు. ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు.. 70 ఏళ్ల క్రితం రాసిన వ్యాసాలను పరిశీలిస్తే స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత సైతం అల్లూరికి మన నేతలు ఎంతటి అన్యాయం చేసిందీ అవగతం అవుతుంది.
అల్లూరి సీతారామరాజు చిత్రంలో ఒక కీలక సన్నివేశం
అల్లూరి సీతారామరాజు Alluri Sitarama raju సినిమా ఇప్పటికి 50 ఏళ్ల క్రితం.. 1974, మే నెలలో విడుదలయ్యింది. సినిమాను కృష్ణ నిర్మించటానికి ముందు.. ఎన్టీఆర్ ప్రయత్నించినా.. అంతకు చాలా ఏళ్ల క్రితమే అల్లూరిపై సినిమాను తీయాలనే వినతులు పలువురి నుంచి వస్తుండేవి. తెలుగు నేలపై.. 1950 ప్రాంతంలో వెలువడ్డ పత్రికలను తిరగేస్తే.. అల్లూరిపై సినిమాను తీయాలంటూ వ్యాసాలు, పాఠకుల లేఖలు, కనిపిస్తాయి. అప్పటికి అల్లూరి మరణించి 26 ఏళ్లు మాత్రమే అవుతోంది.
అల్లూరిపై సినిమాను తీయకపోవటానికి రాజకీయ నాయకులే కారణమంటూ 1953లోనే వ్యాసాన్ని రాసిన ప్రఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబరావు
అల్లూరి ఉద్యమం 1922 నుంచి 1924 వరకు కొనసాగగా.. అప్పటి కాంగ్రెస్ పెద్దలు టంగుటూరి ప్రకాశం పంతులుతో సహా పలువురు నాయకులు ఆయన ఉద్యమాన్ని చులకన చేసి మాట్లాడేవారు. 1923లో కాకినాడలో నిర్వహించిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి అల్లూరి మారువేషంలో వెళ్లగా.. అక్కడా ఆయన ప్రకటనకు వేదికపై అవకాశం లేకుండా పోయింది. 1947లో స్వాతంత్య్రం సిద్ధించాక.. అప్పటి నేతల్లో పలువురు రాజకీయ చక్రాలను తిప్పుతూ వచ్చారు. అల్లూరిని దోపిడీదారుడుగా అభివర్ణించిన టంగుటూరి ప్రకాశం.. 1946లో మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇటువంటి నేపథ్యంలో.. అల్లూరి పోరాటాన్ని అప్పటి నేతలు స్వాగతించేవారు కాదు. దీంతో అల్లూరిపై సినిమా తీయటానికి దర్శకులు, నిర్మాతలు సాహసించేవారు కారు.
అల్లూరిని దోపిడీదారుడిగా పేర్కొని.. ఆతర్వాత 1946లో మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన టంగుగూరి ప్రకాశం పంతులు
ప్రఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబరావు.. 1953లో ‘తెలుగు స్వతంత్ర’ అనే వార పత్రకలో ఇలా రాశారు.. ‘‘ బ్రిటీష్ పాలకుల 18,19 శతాబ్ధాల పాలనను వాస్తవంగా చిత్రించినా ఈ నాటి మన ప్రభుత్వ ప్రతినిధులు సమ్మతిస్తారనే నమ్మకం లేదు. అల్లూరి సీతారామరాజు కథను కూడా మన ప్రభుత్వం నిషేధించింది. మన సినిమా నిర్మాణాలు చరిత్ర జోలికి పోకపోవటానికి పూర్తిగా నిర్మాతల తప్పని చెప్పలేం. మన సెన్సారు విధానం కూడా భయానికి తావు ఇస్తోంది. మనకు రాజకీయ స్వాతంత్య్రం వచ్చినా భావ స్వాతంత్య్రం రాలేదు’’ అని విశ్లేషించారు. కొడవటిగంటి విశ్లేషణ తర్వాత 20 ఏళ్లకు కృష్ణ.. అల్లూరిపై సినిమాను నిర్మించారు. అప్పటి పరిస్థితుల్లో ఆయనకు మరో రకమైన ఇబ్బందులు తలెత్తాయి. సినిమాను తాను తీయదలచుకొన్నానంటూ ఎన్టీఆర్ అన్నప్పటికీ.. కృష్ణ మాత్రం ముందడుగే వేశారు.