రుషికొండను తవ్వి బౌద్ధ బిక్షువుల ఆనవాళ్లను మాయం చేశారు
personBuruju Editor date_range2022-10-29
ఒకప్పుడు బౌద్ధ బిక్షువులు నివసించిన రుషికొండ.. ఇలా మారిపోయింది
బురుజు.కాం Buruju.com : విశాఖపట్నం వద్దగల రుషికొండ.. ఒకప్పుడు ఆదిమానవులు, అనంతరం బౌద్ధ బిక్షువుల ఆవాసం. అంతటి ప్రాధాన్యం గల కొండపై జగన్ ప్రభుత్వం ఇష్టాను సారంగా తవ్వి వందల టన్నుల మట్టిని తీసుకెళ్లి దూరంగా పారబోయటంతో ముఖ్యంగా.. నాటి బౌద్ధ అనవాళ్లను చేజార్చుకొన్నట్లయ్యింది. కొండను తవ్వేటప్పుడు పురావస్తు శాఖ అధికారులు కనుక అక్కడ ఏ మాత్రం పరిశోధనలు జరిపినా వారికి ఆదిమానవుల పనిముట్లు, ఆ తర్వాత కాలంలో బౌద్ధ బిక్షువులు వాడిన వస్తువులు కొన్నైనా లభించి ఉండేవి. రుషి కొండ ప్రాముఖ్యత గురించి తెలియటంతో 1956లో నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి.. కొండపైకి వెళ్లే ప్రయత్నం చేసినట్టుగా అక్కడి వారు చెబుతుంటారు.
తవ్వకానికి ముందు.. తర్వాత రుషికొండ రూపాలు
విశాఖపట్నం పరిసరాల్లో ఒకప్పుడు బౌద్ధం ఫరిడవిల్లింది. అక్కడి బావికొండ, తొట్లకొండ, పావురాళ్ల కొండ తదితరాలన్నీ బౌద్ధుల ఆవాస ప్రాంతాలే. బావి కొండపై 1982-87 మధ్య జరిపిన తవ్వకాల్లోనైతే వివిధ బౌద్ధ కట్టడాలతో పాటు బుద్ధుని ధాతువు గల బంగారు భరిణె లభించింది. రుషి కొండ విషయానికి వస్తే.. ప్రస్తుతం మనుగడలో ఉన్న ఆ పేరే దాని ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. బౌద్ధ బిక్షువులు ఉండే కొండను రుషి కొండగా ప్రజలు వ్యవహరిస్తూ రావటంతో అక్కడి సమీపంలో ఏర్పాటైన గ్రామాలకూ పెద్ద రుషికొండ, చిన్న రుషి కొండ అనే పేర్లు వచ్చాయి. సాక్షాత్తూ బుద్ధుని ధాతువును బావికొండపై నిక్షిప్తం చేయటం వల్లనే సమీప ప్రాంతాల్లో బౌద్ధ కట్టడాలు విరివిగా నెలకొన్నాయని , అక్కడి ప్రజల ఇళ్ల పేర్లు సైతం ‘బుద్ధల’ అని ఉంటాయని పురావస్తు శాఖ మాజీ అధికారి బండారు సుబ్రహ్మణ్యం.. 1997లో వెలువరించిన ‘ అంధ్రప్రదేశంలో బుద్ధధాతు పేటికలు’ అనే గ్రంధంలో విశ్లేషించారు. రుషికొండలు అంటే బిక్షువుల కొండలని ఆయన నిర్ధారించారు. ప్రస్తుత రుషికొండకు బావికొండ దాదాపు ఆరు కి.మీటర్ల దూరంలో ఉంటుంది.
రుషి కొండ మట్టిని తీరంలో పోసే ముందు పరిశీలించినా ఏమైన వస్తువులు దొరికేవి
భారత పురాతత్వ సొసైటీ 1979లో వెలువరించిన ఒక నివేదిక ప్రకారం.. విశాఖ జిల్లాల్లో ఆది మానవులు నివసించిన 18 ప్రాంతాలను పురావస్తుశాఖ గుర్తించగా.. వాటిలో రుషికొండ కూడా ఉంది. ఆయా ప్రాంతాల్లో ఆనాటి పనిముట్లు లభించినట్టు ఆ నివేదిక తెలుపుతోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంథ్రోపాలజి ఆచార్యునిగా పనిచేసిన తిమ్మారెడ్డి.. 2001లో ‘‘ మ్యాన్ అండ్ ఎన్విరాన్ మెంట్’’ అనే జర్నల్ లో వెలువరించిన ఒక వ్యాసంలో.. రుషికొండపై అంతకు ముందు జరిగిన పరిశోధనలను వివరించారు. సముద్ర అలలకు వేలాది ఏళ్ల క్రితం కొండలకు ఏర్పడిన కోతలను, గుహలను ఆయన విశ్లేషించారు. రుషికొండ ఉత్తరంలోని రామయోగి అగ్రహారం ఎర్ర తిన్నెలపై మానవ పరిణామ క్రమంలోని మూడు దశల ఆనవాళ్లను కనుగొన్నట్టు వెల్లడించారు.
ఇంతటి ప్రధాన్యం గల రుషికొండ ఇప్పుడు కళ్ల ముందే రూపు మారిపోయింది. దాదాపు 61 ఎకరాల విస్తీర్ణం గల రుషికొండలోని 9.88 ఎకరాల్లోని కట్టడాల పునరుద్ధరణకు మాత్రమే అనుమతులు ఉండగా.. అందుకు భిన్నంగా కొండ నంతా దొలిచేశారు. అక్కడ తవ్వితీసిన వందల టన్నుల మట్టిని సముద్రతీరంలో దాదాపు పది కిలోమీటర్ల పొడవునా పారబోశారు. కొండను తవ్వే ప్రాంతాలకు ఎవరినీ వెళ్లనివ్వకుండా ప్రభుత్వం చాలా కాలం కట్టడి చేస్తూ వచ్చింది. పురావస్తు శాఖ అధికారులు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకొన్నా ఎన్నోకొన్ని ఆధారాలు తప్పక లభించి ఉండేవి. జగన్ ప్రభుత్వం అక్కడ దాదాపు రూ.500 కోట్ల ఖర్చుతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించినట్టు ప్రతి పక్షాలు వెల్లడించాయి. అద్భుత చారిత్రక నేపథ్యం గల రుషి కొండ భావి తరాలకు లేకుండా పోయింది.