జీవించింది 53 ఏళ్లే అయినప్పటికీ.. శతాబ్ధాల పాటు గుర్తుండిపోయే రచనలు చేసిన గురజాడ అప్పారావు
పిళ్లా సాయికుమార్ Buruju.com
కన్యాశుల్కం ఒక అద్భుత నాటకం. ఇటువంటి మహా రచనలు చేసిన గురజాడ అప్పారావు.. అప్పట్లో ఇతర గ్రంధాలతో పాటు సెక్సు పుస్తకాలనూ చదివేవారా? ఆయన వద్ద లభించిన కొన్ని పుస్తకాలను బట్టి అవుననే సమాధానం వస్తోంది . ఇలా సెక్సు పుస్తకాలను చదివేవారనే విషయం 1989లో బయటపడింది. అప్పటి విజయనగరం జిల్లా తాత్కాలిక కలెక్టరు ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు.. గురజాడకు చెందిన కొన్ని వస్తువులను, వివిధ పుస్తకాలను అధికారులు సేకరించినప్పుడు. . వాటిలో హవెలాక్ ఎల్లీస్ రాసిన ఆరు సెక్సు పుస్తకాలు కనిపించాయి. ప్రస్తుత కథనాన్ని రాస్తున్న నేను.. అప్పట్లో విజయనగరం జిల్లా ‘ఈనాడు’ ప్రతినిధిగా విజయనగరంలో ఉంటూ.. ‘గురజాడ సెక్సు పుస్తకాలు చదివిరా?’ అనే శీర్షికతో ‘ఈనాడు’లో రాసిన కథనం .. గురజాడ మనవడికి( ఈయన పేరూ గురజాడ అప్పారావే) చాలా ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. తాతగారిపై ఇటువంటి వార్త రాస్తావా? అంటూ ఆయన నన్ను నిలదీసే ప్రయత్నం చేశారు. ఇతర పుస్తకాలతో పాటు సెక్సు పుస్తకాలూ ఉన్నందునే వార్తను రాశామని స్పష్టం చేసినా ఆయన శాంతించలేదు. దీంతో గురజాడకు అసలు ఆ పుస్తకాలు ఎలా వచ్చివుంటాయనే విషయం తెలుసుకోవటానికి అప్పటి నుంచి ప్రయత్నిస్తూ వచ్చిననాకు.. ఆ తర్వాత మరికొందరి రచనల ద్వారా కొన్ని ఆసక్తికర సంగతులు తెలిశాయి. కన్యాశుల్కం నాటకాన్ని రాయటానికి ముందు గురజాడ.. విజయనగరంలోని కొందరు వేశ్యల ఇళ్లకు వెళ్లి వారి హావభావాలు, ప్రవర్తన పద్దతులను సైతం పరిశీలించేవారని తేలింది. ఇటువంటి సంగతులను మాత్రం ఇప్పుడు Buruju.com ద్వారానే వెల్లడిస్తున్నాను. ఇవేమీ ఆ మహా కవిని ఎంత మాత్రం కించపర్చే అంశాలు కానేకావు. విజయనగరంలోని ..నాటి గురజాడ గృహం ప్రస్తుతం స్మారక భవనంగా మారింది. ఇంటిని స్వాధీనం చేసుకోవటానికి అప్పట్లో చాలా ప్రహసనం నడిచింది.
కన్యాశుల్కం, కన్యక వంటి అద్భుత రచనలు చేసిన గురజాడ ఇల్లు ఇదే . ఇక్కడ హవెలాక్ ఎల్లీస్ పుస్తకాలతో పాటు పలు గ్రంధాలూ ఉండేవి
విజయనగరంలోని గురజాడ ఇంటిని స్వాధీనం చేసుకొని దాన్ని స్మారక చిహ్నంగా ప్రకటించాలని ప్రజలు ప్రభుత్వంపై వత్తడి తెచ్చేవారు. ఎట్టకేలకు ప్రభుత్వం ముందుకొచ్చినా.. దాదాపు ఎనిమిదేళ్ల పాటు వారసలు ససేమిరా అంటూ రావటంవల్ల 1988 నాటికి కాని ప్రయత్నాలు ఫలించలేదు. ఇంటిని 1988, నవంబరు 7 వ తేదీన అప్పటి ఆర్డీవో సీహెచ్ రామారావు.. గురజాడ వారసులకు రెండు లక్షల రెండు వేల రూపాయలను అందజేసి స్వాధీనం చేసుకొన్నారు. విజయనగరం పాలకులు కొలువై ఉండే కోట పక్కనే గురజాడ ఇల్లు ఉండేది. ఆ ఇంటిలో గురజాడ ఉపయోగించిన వస్తువుల కోసం కుటుంబ సభ్యులను అధికారులు ప్రశ్నించగా.. అవన్నీ అప్పటికే అమ్మేసిన విషయం బయటపడింది. దీంతో వాటి కోసం మళ్లీ అన్వేషించాల్సివచ్చింది. అక్కడ అప్పట్లో గురజాడ.. తన కథలు, నాటకాలు, గేయాలు రాసుకోవటానికి ఉపయోగించిన టేబులు, చదివిన పుస్తకాలు, మరికొన్ని వస్తువులను ఆయన కుమారుడు రామదాసు ఇతరులకు విక్రయించేశారు. అలా అమ్మిన వాటిలో 128 పుస్తకాలు,టేబులు.. విజయనగరానికి చెందిన వసంతరావు తాతారావు ఇంటికి చేరాయి. వాటిని రామదాసు నుంచి తాతారావు తండ్రి బహ్మాజిరావు కొనుగోలు చేశారు.
గురజాడకు సంబంధించిన 128 పుస్తకాల్లో.. ఆరు సెక్సు పుస్తకాలు ఉన్నట్టుగా 1989 , ఫిబ్రవరి 3 వ తేదీన ‘ఈనాడు’ విజయనగరం ఎడిషన్ లో వెలువడిన వార్త ఇది. దీనిని చూసే గురజాడ మనవడు విలేకరిపై ధ్వజమెత్తారు
కొన్ని వస్తువులు, పుస్తకాలు తాతారావు ఇంటిలో ఉన్నట్టుగా అధికారులు నివేదించటంతో అప్పటి కలెక్టరు ఎల్.వి సుబ్రహ్మణ్యం.. వాటి కోసం మరో రూ. అయిదు వేలను కేటాయించారు. కలెక్టరు ఆదేశాల మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి నారాయణరావు.. 1989, ఫిబ్రవరిలో రూ.5వేలను తాతారావుకు అందజేసి గురజాడకు చెందిన 128 పుస్తకాలు, టేబులును తిరిగి తెచ్చారు. తిరిగి కొనుగోలు చేసిన పుస్తకాలను పరిశీలించినప్పుడు.. వాటిలో హవెలాక్ ఎల్లీస్ రాసిన సెక్సు పుస్తకాలు ఆరు ఉన్నాయి. ఇంకా రష్యా సాహిత్యం, చార్లెస్ డికెన్స్, బెర్నార్డ్ షా, డబ్ల్యు ఎస్ గిల్బర్ట్ , చార్లెస్ బ్రౌన్ రాసిన పుస్తకాలు, ఉత్తర హరివంశం, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, మాలతీ మాధవం తదితరాలు ఉన్నాయి.
ఇంగ్లాడులో 1859లో జన్మించి.. మానవ లైంగికతను వివిధ కోణాల్లో విశ్లేషిస్తూ పలు పుస్తకాలను రాసిన హవలాక్ ఎల్లీస్, ఆయన భార్యతో కలసి ఉనప్పటి ఫొటో ఇది
గురజాడ అప్పారావు 1862లో జన్మించి 1915లో.. 53 ఏళ్ల చిన్న వయస్సులోనే చనిపోయారు. మేధస్సుకు పదును పెట్టుకొనేందుకు దేశ, విదేశాల నుంచి అనేక పుస్తకాలను తెప్పించుకొనేవారు. ఆయనకు విజయనగరం సంస్థానాధీశులు ఆనందగజపతిరాజు అండదండలు పుష్కలంగా ఉండేవి కనుక ఖరీదైన పుస్తకాలనూ సులువుగానే రప్పించుకొనేవారని భావించవచ్చు. మానవ లైంగికతను అధ్యయనం చేసే రచయితగా హవలాక్ ఎల్లీస్ కు ర పేరు ఉండేది. హోమొసెక్సువల్ ( స్వలింగ సంపర్కం) అనే పదాన్ని తొలుత ఆయనే వాడినట్టు చెబుతారు. శృంగార సమయంలో వాసనల ప్రాధాన్యత, ఆ తన్మయత్వ సమయంలో చేసే కొన్ని రకాల పనులను ఎల్లీస్ విశ్లేషించారు ( రెండో భాగం.. వచ్చేవారం)