బురుజు.కాం Buruju.com : పలు ఆలయాల వద్ద రావి, వేప చెట్లు కలిసే పెరుగుతుంటాయి. హిందువులు వాటిని ఎంతో పవిత్రమైనవిగా పరిగణిస్తారు. కొన్ని సందర్భాల్లో భక్తులు వాటికి పెళ్లిళ్లు సైతం చేస్తుంటారు. అసలు అవి రెండు కలిసి ఉండటం వెనుక చారిత్రక పరిణామం ఒకటి దాగి ఉంది. తెలుగు నాట దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం బౌద్ధం, వైదికం కలిసిపోతున్న సమయంలో ఇరు వర్గాలవారి ఆరాధన వృక్షాలైన రావి, వేప కూడా పక్కపక్కకు చేరాయి. కాలక్రమేణా రావి ఉంటే పక్కన వేప చెట్టు కూడా ఉండాల్సిందేననే భావన ప్రభలింది.
రావి (బోధి) వృక్షం కింద బుద్ధుని ప్రతిమ
పురాతన కాలంలో తెలుగు నేలపై నాగ జాతి ఉండేది. నాగ దేవత ప్రతిమలను ఆ జాతివారు వేప చెట్ల కింద పెట్టి పూజలు చేసేవారు. ఇప్పటికీ ఉన్న నాగేశ్వరరావు, నాగమ్మ వంటి పేర్లు అప్పటి నాగారాధన సంప్రదాయంలో భాగమే. కాలక్రమేణ నాగజాతి బౌద్ధంలోకి ప్రవేశించింది. అమరావతి శిల్పాల్లో బుద్ధుని శిరస్సు వెనుక నాలుగైదు తలలు నాగుపాము పడగ విప్పి ఉంటుంది. ఇలా బౌద్ధంలో నాగుపామును చెక్కటం ఇటువంటి పరిణామంలో భాగమేనని కొందరు చరిత్రకారులు తేల్చారు. మరో వైపు.. బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యింది రావి చెట్టు కింద. దీనినే బోధి వృక్షమనీ పిలుస్తారు. ఇది బుద్ధులకు అత్యంత పవిత్రమైంది. ‘‘ ఒకే చోట రావి చెట్టును, వేప చెట్టును ఒకటిగా పెంచటం నాటి బౌద్ధ, వైదిక సమ్మేళన ఫలితం’’ అని గల్లా చలపతి తన ‘వ్యాస భాండారం’లో విశ్లేషించారు.
హైదరాబాదు సమీప అలకాపురి పార్కులో పెరుగుతున్న రావి, వేప చెట్లు. వీటికి చేర్చే శివునికి ఇష్టమైన బిల్వపత్రం చెట్టు కూాడా పెరుగుతోంది
కాలక్రమేణా బౌద్ధారామాలు సైతం శైవాలయాలుగా మారిపోయాయి. పురాణాలు తయారు చేసిన దశావతారాల్లో బుద్ధుడు ఒకడయ్యాడు. రావి చెట్టును అశ్వర్థక వృక్షమని సంస్కృతంలో పిలుస్తారని, ఉత్తరోత్తరా రావి చెట్టులో త్రిమూర్తులు ఉన్నరనే నమ్మకం హైందవుల్లో ఏర్పడిందని ఆరుద్ర తన ‘ గుడిలో సెక్సు’ అనే గ్రంథంలో తెలిపారు. సంతాన సౌభాగ్యాన్ని అభిలషించే స్త్రీలు రావి చెట్టు చుట్టూ ప్రదక్షణలు చేస్తే కోరికలు ఈడేరతాయన్న విశ్వాసం అనాదిగా ఉన్నట్టు ఆయన వెల్లడించారు. ద్రావిడులు వేపను, ఆర్యులు రావిని పూజించేవారని, ఇరు వర్గాలు గొడవలను పక్కన పెట్టి కలిసి పోవటానికి గుర్తుగా రెండు చెట్లు కలిశాయనేది కొందరు చరిత్రకారుల భావన.
రావి, వేప చెట్ల వివాహ సమయంలో గ్రామస్థుల కోళాహలం
తెలుగువారి ఆచారాల్లో రావి, వేప చెట్లు ఎంతగా పెనవేసుకుపోయాయంటే వాటిని దేవతల మాదిరిగానే కాకుండా పిల్లల మాదిరిగాను పరిగణించిన సంఘటనలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా పెద్ద తిప్ప సముద్ర మండలంలోని బొంతవారి పల్లెలోని ఒక పసివాడు 27 ఏళ్ల క్రితం చనిపోయాడు. అప్పట్లోనే అతని కుటుంబ సభ్యులు రావి, వేప మెుక్కలను నాటి వాటిని పెంచుతూ వచ్చారు . అవి వృక్షాలుగా మారటంతో 2022లో వాటికి ఘనంగా పెళ్లి జరిపించారు. రావి చెట్టును కుమారుడిగాను, వేప చెట్టును పెళ్లి కూతురుగాను భావించి వాటికి కొత్త బట్టలను అలంకరించారు. భాజా భజింత్రీలు, వేద మంత్రాల ఉచ్ఛారణ నడుమ పెళ్లి తంతును పూర్తి చేసి దాదాపు 200 మందికి మంచి విందును కూడా ఇచ్చారు. కరోనా నుంచి కాపాడాలంటూ 2021లో కొన్ని చోట్ల రెండు చెట్లకు పెళ్లిళ్లను చేసినట్టుగా వార్తలు వెలువడ్డాయి. రెండు చెట్లను కలిపి పెంచటం ఒకప్పుడు దేవాలయాలకే పరిమితమైనప్పటికీ క్రమేణా పార్కులు వంటి ఇతర ప్రాంతాల్లోను ఇవి కనిపిస్తున్నాయి.