రోగులను ఎంతో ఆప్యాయంగా పలకరించే డాక్టర్ బొట్టు చంద్రకాంతరావు
బురుజు.కాం Buruju.com : Hyderabad: కరోనా మహమ్మారి పలు ఆసుపత్రులకు, వాటిలోని వైద్యులకు కోట్లు కుమ్మరించి పెట్టింది. అటువంటి వారికి భిన్నంగా.. హైదరాబాదుకు చెందిన ఒక వైద్యుడు మాత్రం తన సొంత పైకంతో కరోనా బాధితులను ఆదుకొని.. మానవత్వం మిగిలే ఉందని చాటి చెప్పారు. ఆయనే.. డాక్టర్ బొట్టు చంద్రకాంతరావు doctor Bottu Chandrakantha Rao ప్రముఖ దంత వైద్యులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతలున్న చంద్రకాంత రావు.. కరోనా అంటేనే ప్రాణాలు విలవిల్లాడిన సంక్లిష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచారు. కరోనా బారిన పడనివ్వని అద్భుత ఆయుర్వేద మందులను పెద్ద ఎత్తున ఆయన ఉచితంగా పంపిణీ చేశారు. కరోనాకు చిక్కుకొన్నవారికీ మందులను ఇచ్చారు. దీంతో కరోనా రోగుల కుటుంబ సభ్యులు ఈ మందులను వేసుకొని ధైర్యంగా తమ వారికి సపర్యలు చేయగలిగారు. డాక్టర్ చంద్రకాంతరావు.. ప్రస్తుతం పక్షవాతం రోగులకు సులువైన చికిత్సను అందించే కార్యక్రమాలను చేపడుతున్నారు. కనీసం మరికొందరు వైద్యులైనా ఆయన్ని ప్రేరణగా తీసుకొని ప్రజలకు ఉచిత సేవలను అందజేస్తారనే భావనతో Buruju.com అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.
గొంతు క్యాన్సర్ సోకకుండా ఎటువంటి ప్రచార కర్యక్రమాలను నిర్వహించాలో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు వివరిస్తున్న డాక్టర్ చంద్రకాంత్
కరోనా Corona మహమ్మారి తొలిదశైన 2020, జూన్ -సెప్టెంబరు నెలల మధ్య దేశ వ్యాప్తంగా జనం పట్టల్లా రాలిపోయారు. ఆ సమయంలో జబ్బును నయంచేసే మందులంటూ ఏవీ లేనేలేవు. ఆసుపత్రుల్లో అసలు పడకలు లభించేవే కాదు. హైదరాబాదులో ఒక్కో రోగి నుంచి రూ.35 లక్షల వరకు గుంజిన ఆసుపత్రులు ఉన్నాయి. ఆసుపత్రిలో బెడ్ లభించక ఇంటిలోనే ఉంటూ కుమిలిపోతున్న స్వప్న ఆనే గృహిణి .. చంద్రకాంతరావు అందజేసిన మందులతో కరోనా కోరల నుంచి సులువుగా బయటడ్డారు. మందులను వాడిన తన భర్త కరోనా నుంచి తేరుకోవటంతో పాటు, తాను కూడా వాటిని వేసుకొని..తనకేమీ కాదనే ధైర్యంతో భర్తకు సపర్యలు చేయగలిగానంటూ ఆమె వెలువరించిన ఒక ఆడియో అప్పట్లో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇటువంటి ఆడియోలు, వీడియోలు మరికొన్ని వెలువడ్డాయి. దీంతో ఎంతో మంది.. చంద్రకాంతరావు Bottu Chandra Kanth Rao నుంచి ఉచితంగా మందులను తీసుకెళ్లారు. వాటిని ఇవ్వటమే కాకుండా.. ఎవరు ఫోను చేసినా ఆయన మనో నిబ్బరాన్ని కల్పిస్తూ వచ్చారు. దూర ప్రాంతాల్లో ఉండేవారికి తన సొంత ఖర్చులతోనే మందులను పంపారు. మందుల పంపిణీకి తన కుటుంబ సభ్యులను సైతం ఆయన పంపారు. హైదరాబాదులోని మహావీర్ ఆసుపత్రి వద్దగల కౌంటర్ ద్వారానూ వాటిని అందజేశారు.
పై వాక్యాలు తనకు తండ్రి బొట్టు లక్ష్మీనారాయణ అందజేసిన తరగని ఆస్తిగా డాక్టర్ చంద్రకాంత్ సగర్వంగా చెబుతారు. తండ్రి అందించి వెళ్లిన ఏడు వాక్యాలను ఒక పోస్టరుగా తయారు చేయించి.. దానిని తన ఆసుపత్రికి వచ్చేవారందరికి కనిపించేలా అమర్చారు.
చంద్రకాంతరావు ఉచితంగా అందిస్తున్న మందుల వల్ల మంచి ఫలితాలు ఉంటున్నట్టు తెలుసుకొన్న కొందరు కార్పోరేట్ ఆసుపత్రుల వైద్యులు.. వాటిని తమకు ఇస్తే పెద్ద మొత్తంలో సొమ్మును ముట్టజెప్పుతామంటూ ఆశ చూపించారు. కష్ట కాలంలో ప్రజల సంక్షేమమే ముఖ్యమని భావించిన చంద్రకాంతరావు.. ఆ వైద్యుల సూచనలను తిరస్కరించారు. కరోనా తదుపరి దశల్లోనూ ఎంతో మందికి ఉచితంగానే మందుల కిట్లను అందజేశారు. ప్రజల కోసం తపించే వైద్యునిగా పేరుపడ్డ చంద్రకాంత రావు .. 1996లోనే స్కోప్ ( సొసైటీ ఫర్ క్యాన్సర్ ఇన్ ఓరల్ కావటీ ప్రివెన్షన్ త్రూ ఎడ్యుకేషన్ ) అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి.. వేలాది మంది జీవితాలను చక్కదిద్దారు. ఫేషయల్ సర్జన్ కావటంతో బసవతారకం ఆసుపత్రిలో 600 పైగా టీ.ఎం.జె, ఓరల్ క్యాన్సర్ సర్జరీలను నిర్వహించారు. నోరు మూసుకుపోయిన నిరుపేదలు ఎంతో మందికి ఉచితంగానే ఆపరేషన్లు చేశారు. ఉచిత దంత చికిత్స శిబిరాలను, పొగాకు వ్యతిరేకంగా సభలు, ర్యాలీలను ఆయన నిర్వహించారు. విదేశాల్లో సైతం ఆయన ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
కరోనా కారుచీకట్లు ముసురుకొన్నప్పుడు కాంతిపుంజంలా పలువురికి దారిచూపిన డాక్టర్ చంద్రకాంతరావును మిగతా వైద్యులు ఆదర్శంగా తీసుకోవాలి
ప్రస్తుతం హైదరాబాదులోని మహావీర్ దంత ఆసుపత్రి ప్రాంగణంలో గల దంత వైద్య శాలను నిర్వహిస్తున్న చంద్రకాంత రావు.. 2000 సంవత్సరంలో హైదరాబాదుకు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు.. పొగాకు రహిత ప్రపంచం కోసం కృషి చేయాల్సిందిగా ఆయన్ని కోరారు. రాష్ట్రపతి అబ్దుల్ కలాం, మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ , ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ వంటి పలువురు ప్రముఖులకు టుబాకో లేని సమాజ అవశ్యకతను ఆయన స్వయంగా వివరించారు. పొగాకు ఉత్పత్తుల వల్ల బతుకులు ఎలా తెల్లారి పోతున్నదీ ఎన్నో జీవితాలను స్వయంగా చూడటం వల్లనే ఆయన ఇంతగా తపన పడతున్నారు. తల్లి తండ్రుల నుంచి వచ్చిన స్థిరాస్తుల గురించి అంతా చెబుతారు. డాక్టర్ చంద్రకాంతరావు మాత్రం తనకు తన తండ్రి.. బొట్టు లక్ష్మీనారాయణ అందించి వెళ్ళిన కొన్ని అక్షరాలనే తన తరగని ఆస్తులుగా గొప్పగా చెప్పుకొంటారు. ‘ దైవాన్ని శక్తిని ఇమ్మని వేడుకొంటే కష్టాలు కలిగించి బలాన్ని చేకూర్చుతాడు ’అంటూ అద్భుతమైన విషయంతో కూడి ఉన్న తండ్రి వాక్యాలు.. డాక్టర్ చంద్రకాంత్ ను ‘జీవరహస్య పౌండేషన్’ ఏర్పాటుకు పురికొల్పాయి. ఆయన శ్రీమతి డాక్టర్ బొట్టు పద్మజ.. జీవ రహస్య ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.రోజుకు రెండు మూడు ఆసుపత్రుల్లో పనిచేస్తూ.. రెండు చేతులా సంపాదిస్తూ.. సేవాతత్పరత అనే భావననే మర్చిపోయిన వైద్యులకు డాక్టర్ చంద్రకాంతరావు వంటివారి సేవలు కాసింతైనా ఆలోచింప జేస్తే.. బాధల్లో ఉన్నవారికి ఎంతోకొంత ఉపశమనం లభించినట్టే.