1) పెన్షనర్ల ప్రతినిధులు జూలై 28వ తేదీన హైదరాబాదులోని సచివాలయంలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న దృశ్యం (2) సమన్వయ కమిటీ ప్రతినిధులు జూలై 27వ తేదీన అబిడ్స్ లోని బీసీ భవన్ లో భేటీ అయినప్పటి చిత్రం
బురుజు Buruju.com: Hyderabad: తెలంగాణ సర్కారు పోకడలకు విసిగిపోయిన ప్రభుత్వ పెన్షనర్లు ఇక పోరాట మార్గాలను ఎంచుకోదలచారు. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు ఆగస్టు 11వ తేదీన ‘చలో హైదరాబాదు’ కార్యక్రమాన్ని చేపట్టాలని ‘పెన్షనర్ల సంఘాల సమన్వయ కమిటీ’ నిర్ణయించింది. ఆ రోజున ఉదయం 11 గంటలకు వేలాది మందితో రాజధానిలోని ఇందిరా పార్కు వద్ద మహా ధర్నాను నిర్వహిస్తుంది. ఆందోళనలకు దిగుతున్న విషయాన్ని వెల్లడిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసును అందజేసింది. కనీసం అప్పటిలోగానైనా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేసింది.
సచివాలయం మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతున్న చైర్మన్ కొలిశెట్టి లక్ష్మయ్య తదితరులు
కార్పోరేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం, పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపుతో సహా 17 అంశాలపై పెన్షనర్ల ప్రతినిధులతో చర్చించాలని రాష్ట్ర పెన్షనర్ల సంఘాల సంయక్త కార్యాచరణ సమితి (జేఏసీ) చాలా కాలంగా ప్రభుత్వాన్ని అభ్యర్ధిస్తూనే ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవటంతో ఇక రోడ్లపైకి వచ్చి గళాలను విప్పటమే మిగిలి ఉన్న మార్గంగా 40 పెన్షనర్ల సంఘాల ముఖ్యులు భావించారు. దీని కోసం ఆయా సంఘాల ప్రతినిధులతో ఒక సమన్వయ కమిటీ ( Co-ordination committee of Talangana Govt. Pensioners Associations-CCTPA ) ఏర్పాటయ్యింది. కమిటీ ప్రతినిధులు జేఏసీ చైర్మన్ కొలిశెట్టి లక్ష్మయ్య అధ్యక్షతన జూలై 27వ తేదీన హైదరాబాదు అబిడ్స్ లోని బీసీ భవన్ లో సమావేశమయ్యి ‘చలో హైదరాబాదు’ ను నిర్వహించాలని నిర్ణయించారు.
సమన్వయ కమిటీ సమావేశం
నిరసన కార్యక్రమాలను చేపట్టేముందు ప్రభుత్వానికి ఆ విషయాన్ని తెలియజేయాల్సివుండటంతో సమన్వయ కమిటీ ముఖ్యలు జూలై 28వ తేదీన సచివాలయానికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అందుబాటులో లేకపోవటంతో ఆయన పేషీలో నోటీసును అందజేశారు. వివిధ డిమాండ్లను పొందుపర్చిన వినతి పత్రాన్ని నొటీసుకు జతచేశారు. అనంతరం అక్కడి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ చలో హైదరాబాదుకు దారితీసిన పరిస్థితులను వెల్లడించారు. వేలాది మందితో ధర్నాను నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వానికి ఇచ్చిన నోటీసులో ఇలా పేర్కొన్నారు.. ‘‘ తెలంగాణలో చాల కాలంగా అపరిష్కృతంగా ఉన్న పెన్షనర్ల సమస్యలపై ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, సి.ఎస్ తదితరులకు పలు సార్లు విన్నవించుకొన్నాం. పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యి సమస్యలను కడతేర్చాలని అధికారులను కోరాం. మా అభ్యర్ధనలనకు స్పందన కొరవడింది. ఇంతవరకు ఒక్క అంశం కూడా కొలిక్కిరాలేదు. పెన్షనర్ల ప్రతినిధులతో ఆగస్టు 10వ తేదీలోగా సమావేశాన్ని నిర్వహించి ఇబ్బందులను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. లేకుంటే 11వ తేదీన ‘చలో హైదరాబాదు (ఇందిరా పార్కు)’ కార్యక్రమాన్ని చేపడతాం’’ అని నోటీసులో వివరించారు.
ప్రభుత్వానికి అందజేసిన నోటీసు కాపీ.. ప్రతినిధుల సమావేశ చిత్రాలు
నోటీసులో సంతకాలు చేసిన వారిలో జేఏసీ చైర్మన్ కొలిశెట్టి లక్ష్మయ్య, మహిళా పెన్షనర్ల సంఘం అధ్యక్షురాలు ఆర్. ఉమాదేవి, TAPRA ప్రధాన కార్యదర్శి పి. కృష్ణ మూర్తి, ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు పెర్సన్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు డా.లింగ అరుణ, తెలంగాణ పెన్షనర్ల సంఘాల జేఏసీ ప్రధాన కార్యదర్శి తులసి సత్యనారాయణ, మహిళా పెన్షనర్ల సంఘం కొ-చైర్ పర్సన్ ధనలక్ష్మి, TRGOA అధ్యక్షులు ఎం.మోహన్ నారాయణ, ప్రధాన కార్యదర్శి ఎస్.నర్సరెడ్డి, తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం అధ్యక్షులు ఎం.భరత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సిహెచ్. ఓం ప్రకాష్, SGPAT అధ్యక్షులు ఎ.రాజేంద్ర బాబు, ప్రధాన కార్యదర్శి ఎం.వి.నర్సింగరావు, టి.ఎస్.జి పెన్షనర్స్ ఫ్యామిలి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.శివా రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి.సుభాకర్ రావు, ప్రభుత్వ కళాశాలల టీచర్ల సంఘం అధ్యక్షులు ఎ.పుల్లయ్య, రిటైర్డు కాలేజి టీచర్స్ అసోసియేషన్ కార్యదర్శి జనార్ధన్ భట్, తెలంగాణ రిటైర్డు ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పెద్ది రమేష్, రెవెన్యూ సర్వీసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎస్. జ్ఞానేశ్వర్ ఉన్నారు.