బురుజు.కాం Buruju.com : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు KCR ఇంటి పేరైన ‘ కల్వకుంట్ల’ Kalvakuntla.. ఒక గ్రామం పేరు. ఇటువంటి పేరు గల గ్రామాలు తెలంగాణలో ఎక్కువగా ఉన్నందున ఆయన పూర్వీకులు ఇక్కడి వారేనని రూఢీ అవుతోంది. కల్వకుంట్ల అంటే కలువ పువ్వులు పూచే నీటి కుంటలు. కేసీఆర్ వంశస్థులు ‘కలువకుంట’ గ్రామానికి చెందిన వారు కనుకనే అది వారి ఇంటి పేరుగా స్థిరపడింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి పేరు ‘నారా’ అనేది ఎలా ఉద్భవించింది వివరించిన ‘బురుజు.కాం’ ఇప్పుడు కేసీఆర్ ఇంటి పేరు పూర్వపరాలను వెల్లడిస్తోంది.
కలువ పువ్వులతో నిండి ఉన్న కుంట ఇది
తెలంగాణలోని జిల్లా కేంద్రమైన సిద్ధిపేటకు 15 కిలోమీటర్ల దూరంలో గల చింతమడక Chintamadaka అనే గ్రామం కేసీఆర్ KCR స్వస్థలంగా రికార్డులకు ఎక్కింది. అంతకు ముందు అయన కుటుంబీకులు ఎగువ మానేరు డ్యాం నిర్మాణ సమయంలో భూమిని కోల్పోవటంతో చింతమడకకు వచ్చి స్థిరపడినట్టుగా వికీపీడియా చెబుతోంది . చింతమడకలో వ్యక్తిగత గృహాల నిర్మాణం వంటి అభివధ్ది కార్యకమాలను కేసీఆర్ ఇప్పటికే చేపట్టారు. ఆయన ఇంటి పేరు విషయానికి వస్తే.. ఇటీవల వరకు సిద్దిపేటతో సహా కలిగి ఉన్న పూర్వపు మెదక్ జిల్లా పరిధిలో కల్వకుంట్ల, కలువకుంట గ్రామాలు ఎక్కువగానే కనిపిస్తాయి. ఇక్కడి నిజాంపేట, సంగారెడ్డి మండలాల్లో కల్వకుంట పేరుతోను, నల్లగొండ జిల్లా మనుగోడు మండలంలో కల్వకుంట్ల పేరు గల గ్రామాలు ఉన్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ తల్లితండ్రులు
కల్వకుంట్లతో పాటు కలువకుంట, కలువకొలను ఇంటి పేర్లు గలవారూ ఉన్నారు. కలువకొలను సదానంద ఒక ప్రముఖ రచయిత. కేసీఆర్ తో పాటు జగిత్యాల జిల్లాలోని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర రావు ఇంటి పేరు కూడా కల్వకుంట్లే. నాగరుకర్నూలు జిల్లాలో కల్వకుర్తి ప్రస్తుతం మున్సిపాలిటీగా ఉంది. ‘కుర్తి’ అనేది గ్రామానికి పర్యాయ పదమని ‘తెలుగు వారి ఇంటిపేర్లు’ అనే పరిశోధన గ్రంథంలో తేళ్ల సత్యవతి పేర్కొన్నారు. కుంట అంటే గొయ్యి అని వివరించారు. అంటే కల్వకుర్తి ఒకప్పుడు కలువపువ్వులకు పేరుపడ్డ ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడి చిత్తూరు జిల్లాలో ఒక కలువకుంట ఉంది. గ్రామానికి ఆ పేరు రావటానికి ప్రజలు కొన్ని పౌరాణిక కథలను చెబుతున్నా పూర్వం కలువు పువ్వులు పూసే ప్రాంతమనీ ప్రచారంలో ఉంది. విజయనగర రాజుల కాలంలో దీని పేరు కలువపురి. పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలంలో కలవలపల్లి గ్రామం ఉంది.
రక్షా బంధన్ రోజున సోదరీమణులు, కుటుంబ సభ్యులతో కేసీఆర్
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆంధ్రా ప్రాంతం వారిపై తీవ్ర విమర్శలు చేస్తుండటంతో తెలుగుదేశం విజయనగరం జిల్లా నాయకులు బొబ్బిలి సమీప బుడ్డిపేట అనే గ్రామానికి వెళ్లి అదే కేసీఆర్ వంశీకుల జన్మస్థలి అంటూ ప్రకటించారు. కేసీఆర్ సామాజిక వర్గానికి చెంది, కల్వకుంట్ల ఇంటి పేరుగల ఒక కుటుంబం ఆ గ్రామంలో నివసిస్తోంది. వారి సమాచారం ఆధారంగా అప్పట్లో ఆ జిల్లా తెలుగు దేశం నాయకులు చేసిన ప్రకటనను కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఖండించారు. ఏడు తరాలుగా తమ కుటుంబం తెలంగాణలోనే ఉంటున్నట్టుగా ఆధారాలు ఉన్నట్టు అప్పట్లో ఆయన వెల్లడించారు. విజయగనరం, శ్రీకాకుళం జిల్లాల్లో కుంట పేరుతో కుమ్మరిగుంట, గుడారిగుంట వంటి గ్రామాలు ఉన్నప్పటికీ కలువకుంట మాత్రం ఉన్నట్టు లేదు. ఆ పేరుగల గ్రామాలు తెలంగాణలోనే ఎక్కువగా కనిపిస్తున్నందున కేసీఆర్ పూర్వీకులు ఇక్కడి వారేనని స్పష్టమవుతోంది. తెలుగువారికి ఇంటి పేర్లు అనేవి గ్రామాలు, వృత్తులు, హోదాలు వంటి వాటి ఆధారంగా వచ్చాయి. కుంట అంటే పాతిక సెంటు భూమి , మంచి నీటి గుంట అని అక్కిరాజు రమాపతి రావు తన ‘మాండలిక పదకోశం’లో తెలిపారు.